
బదిలీ ఫీవర్
సాక్షి, అనంతపురం :
జిల్లా అధికార యంత్రాంగానికి బదిలీ ఫీవర్ పట్టుకుంది. ఈ నెలాఖరుకు బదిలీ ప్రక్రియ పూర్తి కానున్న నేపథ్యంలో ఎవరి స్థాయిలో వారు పైరవీలు చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల కోసం వాళ్ల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గెజిటెడ్ హోదా కలిగి కార్యాలయాల్లో తమకు తిరుగులేకుండా ఉన్న వారు కూడా బదిలీల నేపథ్యంలో బంట్రోతుల కంటే అధ్వానంగా మారిపోతున్నారు. సిఫారసు లేఖల కోసం అష్టకష్టాలు పడుతూ చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు వారి పీఏలు, వ్యక్తిగత సిబ్బంది చీదరింపులతో తల్లడిల్లిపోతున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో కీలక స్థానాల్లో ఉన్న అధికారులకు స్థాన చలనం కలగనుంది. ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో పనిచేసిన అధికారులను టీడీపీ ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఇప్పటికే డిప్యూటీ తహశీల్దార్లు, తహశీల్దార్లను భారీ స్థాయిలో బదిలీ చేసింది. కీలక పదవుల్లో ఉన్న అధికారులను కూడా కచ్చితంగా బదిలీ చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో బదిలీలు జరుగుతాయని భావిస్తున్న అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. బదిలీ ఈ రోజు..రేపు అంటూ ఊరిస్తుండడంతో వారికి పనిలో నిబద్ధత కూడా కరువైపోయింది. మంచి స్థానం కోసం జిల్లా అధికారులు ప్రయత్నాల్లో ఉన్నారు. రాజధానికి పరుగులు పెడుతున్నారు. ఏడాది
కింద, ఎన్నికల ముందు జిల్లాకు వచ్చిన శాఖాధిపతులకు స్థాన చలనం తప్పక పోవచ్చని తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఇక్కడికి బదిలీపై వచ్చిన అదనపు జేసీ రామస్వామి నాయక్‌ను ఇప్పటికే బదిలీ చేసి ఆయన స్థానంలో హైదరాబాద్ సెర్ప్‌లో ల్యాండ్ అసెస్ డెరైక్టర్‌గా పనిచేస్తున్న ఖాజామొహిద్దీన్‌ను అనంతపురం బదిలీ చేశారు. ఇక రవాణాశాఖ డిప్యూటీ కమినర్ ప్రసాద్‌కు స్థానం చలనం తప్పదని తెలుస్తోంది. ఇదే కోవలో మరికొంత మంది అధికారులు కూడా బదిలీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. జిల్లా స్థాయి పోస్టులు మినహా మిగిలిన వాటికి కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ నిర్వహించున్నారు. ఈ నెలాఖరుకు బదిలీల ప్రక్రియ పూర్తి కానుంది.
బదిలీపై వెళ్లనున్న జేసీ
జాయింట్ కలెక్టర్(జేసీ)గా పనిచేస్తున్న సత్యనారాయణ తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా వెళ్లనున్నట్లు కలెక్టరేట్‌లో జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈయన్ను తూర్పుగోదావరి జిల్లాకు బదిలీ చేయించుకునేందుకు రాష్ట్ర మానవవనరుల శాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సీఎం చంద్రబాబు వద్ద సత్యనారాయణ బదిలీ ఫైల్ పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఈయన బదిలీ అయిన సమక్షంలో కర్నూలు జిల్లాలో జేసీగా పనిచేస్తన్న కన్నబాబును ఇక్కడికి తీసుకురావడానికి మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారు.
పోలీసు శాఖలో భారీ బదిలీలు :
జిల్లాలో ఎనిమిది పోలీసు సబ్‌డివిజన్లు ఉన్నాయి. అన్ని సబ్‌డివిజన్ల అధికారులకూ స్థాన చలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. అనంతపురం డీఎస్పీ నాగరాజ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి శైలజానాథ్ ఆశీస్సులతో పోస్టింగ్ తెచ్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ చమన్‌సాబ్ ద్వారా మంత్రి పరిటాల సునీతపై ఒత్తిడి తెచ్చి ఇక్కడే కొనసాగాలని చూస్తున్నట్లు తెలిసింది. అయితే సివిల్ పంచాయితీల్లో ఈయన విపరీతమైన జోక్యం చేసుకుంటున్నారని టీడీపీ శ్రేణులే మంత్రుల దృష్టికి తీసుకెళ్లి ఆయనను బదిలీ చేయాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. గుంతకల్లు డీఎస్పీ రవికుమార్ అక్కడే ఉండాలని ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ సిఫారసు చేసినప్పటికీ.. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మాత్రం బదిలీ చేయాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. కళ్యాణదుర్గం డీఎస్పీ వేణుగోపాల్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో ఖాసీంసాబ్‌ను నియమించాలని ఎమ్మెల్యేలు హనుమంతరాయచౌదరి, కాలవ శ్రీనివాసులు సిఫారసు లేఖలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం లూప్‌లైన్‌లో ఉన్న ఖాసీం సాబ్ రాజంపేటలో పనిచేసిన సమయంలో ఎర్రచందనం తరలింపు కేసులో ఇరుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఆ కేసు ఇంకా పెండింగ్ ఉందని ఆయన బదిలీ వ్యవహారానికి తాత్కాలికంగా తెరపడినట్లు తెలిసింది. పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు మాజీ మంత్రి పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి అత్యంత సన్నిహితుడు అయినప్పటికీ గడిచిన ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయన్ను అక్కడే కొనసాగించాలని భావిస్తున్నారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఈయన అనంతపురం పోస్టింగ్ కావాలని ఆశిస్తున్నారు. ఇందుకోసం మంత్రులు పల్లె, పరిటాల సునీత, ఎమ్మెల్యే బాలక్రిష్ణ ద్వారా సిఫారసు చేయించుకునే పనిలో నిమగ్నమయ్యారు. పుట్టపర్తి డీఎస్పీ శ్రీనివాసులు స్థానంలో విశాఖలో పనిచేస్తున్న రారాజుప్రసాద్‌ను తీసుకురావాలని మంత్రి పల్లె ఆలోచిస్తున్నారు. ఇప్పటికే మంత్రి పల్లెను ఆయన కలసి ఆశీస్సులు పొందినట్లు సమాచారం. ధర్మవరం అడిషనల్ ఎస్పీ అభిషేక్ మహంతి స్థానంలో కర్నూలు జిల్లాలో పనిచేస్తున్న బోయ మల్లికార్జునను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కదిరి డీఎస్పీ దేవదానం స్థానంలో పీటీసీలో పనిచేస్తున్న ఏ.శ్రీనివాసులు రానున్నట్లు తెలిసింది. దీనికి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా మద్దతుపలికినట్లు తెలుస్తోంది. తాడిపత్రి డీఎస్పీ నాగరాజును అక్కడే కొనసాగించేందుకు జేసీ సోదరులు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. అయితే రెడ్డి సామాజికవర్గానికి చెందిన తాడిపత్రి సీఐ సుధాకర్‌రెడ్డికి త్వరలో డీఎస్పీగా పదోన్నతి రానుండడంతో ఆయనకు తాడిపత్రిలోనే పోస్టింగ్ ఇప్పించుకోవాలని, అంత వరకు నాగరాజునే కొనసాగించే విధంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. సీఐల విషయానికి వస్తే అనంతపురం టూటౌన్‌కు ప్రస్తుతం పీటీసీలో పనిచేస్తున్న కమ్మ సామాజికవర్గానికి చెందిన సాయినాథ్, త్రీటౌన్‌కు మన్సూరుద్దీన్‌కు పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. రూరల్ సీఐ శుభకుమార్ కూడా టూటౌన్‌ను ఆశిస్తున్నారు. వన్‌టౌన్ సీఐ గోరంట్ల మాధవ్ అక్కడే కొనసాగే విధంగా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి సిఫారసు చేసినట్లు తెలిసింది. అనంతపురం త్రీటౌన్‌లో ఉన్న దేవానంద్ ఆత్మకూరుకు సర్కిల్‌కు మారనున్నట్లు తెలిసింది. అక్కడున్న విజయ్‌కుమార్‌కు త్వరలో డీఎస్పీ పదోన్నతి రానుంది. అనంతపురం రూరల్ సర్కిల్‌కు చిత్తూరు జిల్లాలో ఉన్న ఈదుర్‌బాషా వస్తున్నట్లు తెలిసింది.
రెవెన్యూలో...
రెవిన్యూ బదిలీల విషయానికి వస్తే కళ్యాణదుర్గం ఆర్డీఓ మలోలా కర్నూలుకు బదిలీ కానుండగా, ఆయన స్థానంలో గతంలో ఇక్కడ ఆర్వీఎం పీఓగా పనిచేసిన రామారావుకు ఇద్దరు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చారు. పెనుకొండ ఆర్డీఓగా రామ్మూర్తి పేరు ఖరారైనప్పటికీ వెంకటేష్ అక్కడే కొనసాగాలని ఎమ్మెల్యే బీకే పార్థసారథి ద్వారా ఒత్తిడి పెంచినట్లు తెలిసింది. కదిరి ఆర్డీఓగా రాజశేఖర్‌నే కొనసాగించాలని మంత్రి పల్లె లేఖ ఇచ్చారు. అయితే మరికొందరు ఆయన బదిలీకి పట్టుబడుతున్నారు. ఇక మునిసిపల్ రిజినల్ డిప్యూటీ డెరైక్టర్ మురళీకృష్ణ గౌడ్‌తో సహా ఆయా మునిసిపాలిటీలలో పనిచేస్తున్న మునిసిపల్ కమిషనర్లు, ఏఈలు, డీఈలు, ఎంఈలకు స్థానం చలనం తప్పేలా ఉంది.