కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల బదిలీ పర్వం ఊపందుకుంది. ఇప్పటికే ముగ్గురు జిల్లా అధికారులను, 28 మంది తహశీల్దార్లను బదిలీ చేసిన ప్రభుత్వం బుధవారం మరో నలుగురు జిల్లా అధికారులకు స్థానచలనం కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిం ది. ఇప్పటికే బదిలీ అయిన జిల్లా డ్వామా పీడీ స్థానంలో భద్రాచలంలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న వై.వి. గణేశ్‌ను నియమిం చింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సొంత జిల్లాలో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) కృష్ణారెడ్డిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్‌ఎమ్‌డీఏ) ఎస్టేట్ అధికారిగా బదిలీ చేసింది. మన జిల్లాకే చెందిన రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి శ్యాంప్రసాద్‌లాల్‌ను వరంగల్ జిల్లాకు, అక్కడి పీవో రాజమౌళిని కరీంనగర్‌కు బదిలీ చేశారు. మంథని ఆర్డీవో అయేషా మస్రత్‌ఖానమ్‌ను బదిలీ చేస్తూ సీసీఎల్‌ఏలో రిపోర్టు చేయాలని ఆదేశించింది.
ఆమె స్థానంలో పోస్టు కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్న పి.అరుణకుమారి(డెప్యూటీ కలెక్టర్)ని మంథని ఆర్డీవోగా నియమించింది. విజిలెన్స్ సెల్ డెప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న పి. రాంచందర్‌ను వరంగల్ జిల్లా ములుగు ఆర్డీవోగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. పెద్దపెల్లి ఆర్డీవోగా మహబూబ్‌నగర్ నుంచి సి.నారాయణరెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఫారెస్ట్ సెటిల్‌మెంట్ ఆఫీసర్‌గా విజయనగరం జిల్లా నుంచి శోభను నియమించినట్లు సమాచారం. జేజీకే ప్రసాద్ తర్వాత ఈ పోస్టు కొంతకాలంగా ఖాళీగా వుంది. ఎన్నికల బదిలీల జాబితాలో ఉన్న ఎంపీడీవోల బదిలీ ఉత్తర్వులు నేడో రేపో వెలువడనున్నట్లు సమాచారం. బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని ఎంపీడీవోలు కోర్టుకెక్కినా వారికి చుక్కెదురు తప్పదని ఉద్యోగులు భావిస్తున్నారు.
పలువురికి పోస్టింగ్‌లు
బదిలీ ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ పోస్టింగ్‌లు కేటాయించని పలువురి అధికారులకు ఆయాస్థానాల్లో పో స్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అందులో జిల్లాలో పనిచేసిన డెప్యూటీ కలెక్టర్ జి.ఐలయ్య(ఎస్‌డీసీ, ఎస్సారెస్పీ)ని నిజామాబాద్ జిల్లా భూ భారతి ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో పనిచేసిన డ్వామా పీడీ మనోహర్‌కు నిజామాబాద్ జిల్లా స్పెషల్ డెప్యూటీ కలెక్టర్(బీఆర్ ఏపీ సీఎస్ ఎస్‌పీ-యూనిట్9) ఎస్సారెస్పీకి పో స్టింగ్ ఇచ్చింది. కరీంనగర్ జిల్లాలో కేఆర్‌సీసీ డెప్యూటీ కలెక్టర్‌గా, ఇన్‌చార్జి మెప్మా పీడీగా ఉన్న కలెక్టర్ సతీ మణి జి.విజయలక్ష్మికి పూర్తిస్థాయిలో మెప్మా పీడీగా ప్రభుత్వం బాధ్యతలు అప్పజెప్పింది. కేఆర్‌సీసీ డెప్యూ టీ కలెక్టర్ వచ్చేవరకు ఆమె అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
జెడ్పీ సీఈవోకు డబుల్ ధమాకా
అసలే ఎన్నికల బదిలీలతో తలలు పట్టుకుంటున్న అధికారులకు మరో వింత చోటు చేసుకుంది. సాధారణంగా ఒకచోటుకే బదిలీ చేయాల్సి ఉన్నప్పటికీ జెడ్పీ సీఈవోగా ఉన్న చక్రధర్‌రావుకు డబుల్ ధమాకా తగి లింది. ఆయనను ముందుగా రంగారెడ్డి జిల్లా జెడ్పీ సీ ఈవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పుడు చేసిన బదిలీల్లో ఆయనను వరంగల్ జిల్లా డీసీవోగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అసలే భారంగా వెళుతున్న అధికారులకు ఇదేం ట్విస్ట్ అంటూ మిగతా అధికారులు చర్చించుకుంటున్నారు. తాను ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక చక్రధర్‌రావు తల పట్టుకుంటున్నట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు. అరుదుగా జరిగే ఇటువంటి సంఘటనల్లో బదిలీకి ఆప్షన్ ఇచ్చి రెండింటిలో ఏదో ఒక చోటుకు బదిలీపై వెళ్లవచ్చని అధికారులు చెబుతున్నారు.
బదిలీల పర్వం
Published Thu, Feb 13 2014 3:37 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement
Advertisement