హస్తానుసారం బదిలీలు!
Published Fri, Feb 7 2014 1:38 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
జిల్లాలో దీర్ఘకాలంగా ఉన్న అధికారులను బదిలీ చేయాలని జారీ చేసిన ఎన్నికల కమిషన్ ఆదేశాలను హస్తం పార్టీ నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఈ మేరకు పైరవీలు షురూ చేశారు. పక్క జిల్లాల్లో తమకు అనుకూలమైన అధికారులను జిల్లాకు రప్పించుకుని ఎన్నికలను గట్టెక్కాలని భావిస్తున్నారు. పోలీస్ శాఖలో తమకు అనుకూలమైన వారిని ఇప్పటికే బదిలీ చేయించుకున్నట్టు సమాచారం.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న వారితో పాటు సొంత జిల్లాలో పనిచేసే అధికారులు పక్షపాతంతో వ్యవహరించవచ్చని భావించి, ఎన్నికలతో సంబంధం ఉన్న వారందరినీ బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కానీ, శతకోటి సమస్యలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా అధికార పార్టీ నేతలు పైఎత్తులు వేస్తూ ఇతర జిల్లాల్లో ఉన్న తమ ఇష్టానుసారం కావలసిన అధికారులనే బదిలీపై రప్పించుకుంటున్నారు. సిఫారసుల లేఖతో దర్జాగా కావలసిన వారిని తెచ్చుకుంటున్నారు. ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. అధికార పార్టీ నేతల ఎత్తుగడలను గమనిస్తు న్న విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ దృష్టి సారించకపోతే ప్రస్తుతం చేస్తున్న బదిలీలకు సార్థకత ఉండదని వాపోతున్నాయి.
మూడేళ్లు ఒకేచోట పనిచేసిన అధికారులు, సొంత జిల్లాలో పనిచేస్తున్న అధికారులు ఎన్నికల సందర్భంలో తమ అనుకూల నేతలకు సానుకూలంగా పనిచేస్తున్నారన్న ఉద్దేశంతో ప్రతిసారి రెవెన్యూ, పోలీస్ అధికారుల్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం బదిలీ చేస్తుంది. ఈసారి వారితో పాటు ఎంపీడీఓలను బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ అంతా ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దీంతో పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల్లో బదిలీల పర్వం ప్రారంభమయింది. ఇన్నాళ్లూ పనిచేసిన అధికారులు ఎలాగూ వెళ్లిపోతున్నారని వారి స్థానంలో కావలసిన వ్యక్తులను రప్పించుకోవడానికి అధికార పార్టీ నేతలు ఆరాతీయడం మొదలుపెట్టారు.
గతంలో ఇక్కడ పనిచేసి బదిలీపై వెళ్లి పొరుగు జిల్లాలైన శ్రీకాకుళం, విశాఖపట్నంలో పనిచేస్తున్న వారిలో తమకు కావల్సిన అధికారులను గుర్తించి, వారితో సంప్రదింపులు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సుల లేఖలిచ్చి రప్పించుకుంటున్నారు. దీనికి ఉన్నతాధికారులు ఇతోధికంగా సాయపడుతున్నారు. జిల్లాలో 25 మం ది ఎంపీడీఓలు, 34 మంది తహశీల్దార్లు బదిలీపై వెళ్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులపై ఒత్తిడి చేసి వారి స్థానంలో తమకు కావల్సిన వారిని, కావల్సిన మండలాలకు వేసుకుంటున్నారు. ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే మండలాల కేటాయింపుల జాబితా రానుంది. పోలీసుశాఖలో ఈ వ్యవహారం మరింత జోరుగా సాగుతోంది.
ఇప్పటికే కార్యాచరణలోకి వచ్చేసింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మం త్రుల సిఫారసుల లేఖ ఆధారంగానే సీఐ, ఎస్‌ఐల బదిలీలు జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఓ ఇద్దరు ఎమ్మెల్యేలైతే అదే పనిలో నిమగ్నమయ్యారు. రేంజి అధికారులపై ఒత్తిడి చేసి పోస్టింగ్‌లు వేయించుకున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే విసృ్తత ప్రచా రం జరుగుతోంది. అనుకూల వ్యక్తులతో రానున్న ఎన్నికల్లో ఇష్టారీతిన వ్యవహరించేందుకు వ్యూహాత్మకంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరి భాగోతాన్ని పసిగట్టిన విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ఇప్పటి నుంచే అధికార పార్టీ నేతలు ఎత్తుగడలు వేస్తున్నారని వాపోతున్నాయి.
Advertisement
Advertisement