బదిలీ గోల! | transfers in various departments | Sakshi
Sakshi News home page

బదిలీ గోల!

Published Tue, Feb 11 2014 5:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM

transfers in various departments

 ఫెవికాల్ వీరులకు విద్యాశాఖ అధికారుల అండదండలు!
 
 సాక్షి ప్రతినిధి, కడప :  ప్రభుత్వ ఉద్యోగం వస్తే చాలు...మారుమూల ప్రాంతంలో నియమించినా వెళ్లి పనిచేయడానికి సిద్ధమని అంటారు. తీరా ఉద్యోగం వచ్చాక జిల్లా కేంద్రంలో అయితే బాగుంటుందని అనుకుంటారు. ఒకవేళ అది సాధ్యంకాకపోయినా కనీసం ప్రక్క మండలంలో పోస్టింగ్ ఇచ్చినా సరిపెట్టుకుందామని భావిస్తారు. బదిలీల విషయంలో కూడా ఉద్యోగుల వైఖరి ఇలాగే ఉంటోంది. ఇందుకోసం ప్రజాప్రతినిధులు, ఉద్యోగసంఘాల నాయకులను ఆశ్రయించడం, డబ్బులతో పై అధికారులను మేనేజ్ చేసేందుకు చేయని ప్రయత్నాలు ఉండవు. ఉపాధ్యాయ వర్గాల్లో ఇవి మరీ అధికం. ప్రస్తుతం కడప, చింతకొమ్మదిన్నె మండలాల్లోని కొందరు ఉపాధ్యాయులు బదిలీ అయినప్పటికీ అక్కడే ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శనం.
 
  ఎనిమిదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న కడప మండలంలోని 31 మంది, చింతకొమ్మదిన్నె మండలంలోని 10 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం గతంలో బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే వీరు 2011లో ఆంధ్రపదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి బదిలీ ఉత్తర్వులను అడ్డుకున్నారు.
  కాగా, గత సంవత్సరం నవంబరు 27వ తేదీ కడప, విశాఖ జిల్లాల 60 ఓఏలకు సంబంధించి ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. ఉపాధ్యాయులందరినీ బదిలీ చేయాలని ట్రిబ్యునల్ అందులో పేర్కొంది. దీంతో గత సంవత్సరం నవంబరు 30వ తేదీ విశాఖ డీఈఓ ఆ జిల్లాలోని ఉపాధ్యాయులను బదిలీ చేశారు.
  అయితే, కడప డీఈఓ మాత్రం డిసెంబరు 12వ తేది 41 మందిని బదిలీ చేస్తూ ఆదేశాలిచ్చారు. బదిలీ చేసిన ప్రాంతాలకు వెళ్లి జాయిన్ కావాలని, లేనిపక్షంలో సీసీఏ రూల్స్ మేరకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేశారు. జాయిన్ అయ్యే దాకా మెడికల్, క్యాజువల్ లీవులు వర్తింపజేయబోమని కూడా తెలిపారు. ఈ నేపథ్యంలో కడప ఎంఈఓ తన పరిధిలోని 31 మంది ఉపాధ్యాయులను రిలీవ్ చేస్తున్నట్లు గత డిసెంబరు 14న ఉత్తర్వులు ఇచ్చారు.
 
  అయినా తమ మొండిపట్టు వీడని ఉపాధ్యాయులు హైకోర్టును ఆశ్రయించారు. గత డిసెంబరు 16వ తేదిన కోర్టు స్టేటస్ కో జారీ చేసింది. దీన్ని అడ్డుపెట్టుకుని తాము బదిలీపై వెళ్లేది లేదని వారు భీష్మించారు. కోర్టు ఉత్తర్వులు రాకమునుపే రిలీవ్ చేస్తూ విద్యాశాఖాధికారులు ఉత్తర్వులు ఇచ్చినందున బదిలీ అయిన కేంద్రాలకు వెళ్లి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అలా వెళ్లకుండా ప్రస్తుతం ఉన్న ప్రాంతాల్లోనే ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
 
 ఇదిలా ఉండగా చాలా ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు జిల్లా కేంద్రానికి బదిలీ కావాలని ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే బదిలీలపై వెళ్లకుండా మొండి కేస్తున్న ఉపాధ్యాయుల వైఖరిపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు. ఫెవికాల్ వీరులకు ఓ ఉపాధ్యాయ సంఘ నాయకుడు మద్దతుగా నిలిచారని అంటున్నారు. ఈ వ్యవహారం కలెక్టర్ దృష్టికి కూడా వెళ్లడంతో ఆయన విద్యాశాఖ అధికారులను తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రానికి రావాలనుకుంటున్న ఉపాధ్యాయులు ప్రభుత్వం నుంచి ఒక మెమోను తీసుకొచ్చారు. జిల్లా కేంద్రంలో ఖాళీలు ఉంటే వీరికి అవకాశం కల్పించాలని, లేకపోతే సమీప మండలాల్లో నియమించాలంటూ ప్రభుత్వం మెమోలో పేర్కొంది. దీంతో సోమవారం డీఈఓ కార్యాలయంలో హడావుడిగా బదిలీల కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. అయితే జిల్లా కేంద్రంలో 31 మందిని రిలీవ్ చేసినట్లు గతంలో స్వయంగా ఆదేశాలు జారీ చేసిన డీఈఓ ప్రస్తుతం ఆ ఖాళీలను చూపకుండా ఇతర మండలాలకు వెళ్లండంటూ తమపై ఒత్తిడి తెస్తున్నట్లు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఖాళీలు చూపకపోవడం ద్వారా డీఈఓ పరోక్షంగా ఫెవికాల్ వీరులకు వత్తాసుగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదేమిటని ప్రశ్నిస్తే కోర్టులో కేసు తెగేంత వరకు తాము చేయగలిగేది ఏమీ లేదని ఆయన అంటున్నట్లు సమాచారం. ఉపాధ్యాయులను ముందే రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినందు వల్ల హైకోర్టు జారీ చేసిన స్టేటస్‌కో ఈ విషయంలో ఎలా వర్తిస్తుందని ఉపాధ్యాయులు ప్రశ్నించగా, డీఈఓ నుంచి సరైన సమాధానం లేదంటున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement