- జూన్10 వరకు పొడిగించే అవకాశం
- సీఎం దృష్టికి తీసుకెళ్లిన మంత్రులు
- మహానాడు ఎఫెక్ట్..
సాక్షి, విశాఖపట్నం: షెడ్యూల్ ప్రకారం బదిలీల ప్రక్రియ ఈ నెలాఖరుతో ముగియాల్సిఉంది. జూన్ ఒకటి లేదా రెండో తేదీల్లో బదిలీ అయినవారు కొత్తస్థానాల్లో చేరాల్సిఉంది. తొలుత ఐదేళ్లు అని.. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఒకేచోట పనిచేసిన వారు బదిలీకి అర్హులని ప్రకటించిన ప్రభుత్వం ఒక్కో శాఖకు ఒక్కో రీతిలో గైడ్‌లైన్స్ జారీతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది.
దీనికి తోడు పరిపాలనా సౌలభ్యం పేరిట ఎవరినైనా బదిలీ చేసే అవకాశం కల్పించడంతో ప్రతీ ఒక్కరినీ అభద్రతా భావం వెన్నాడుతోంది. షెడ్యూల్ లోగా ఈ బదిలీల తంతు పూర్తి చేయాలన్న తలంపుతో వారంరోజులుగా ప్రభుత్వ శాఖలన్నీ సీనియారిటీ లిస్టుల తయారీలో తలమునకలయ్యాయి.
నాలుగైదుశాఖలు మినహా మిగిలిన శాఖల్లో సీనియార్టీల జాబితాల తయారీపై ఒక స్పష్టత వచ్చింది. విద్య, వైద్య, ఆరోగ్యం, రవాణా, ప్రొహిబిషన్,ఎక్సైజ్,పోలీస్ వంటి శాఖల్లో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఈరోజు నుంచే సీనియార్టీ జాబితాల్లో ఉన్న వారు తాము కోరుకున్న ప్రాంతాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 29 కల్లా ఉద్యోగలు బదిలీల ఫైళ్లను జిల్లా కమిటీ ఆమోదానికి పంపాలి. 31వ తేదీ లోగా కమిటీ ఆమోదముద్ర వేయడం..అదే రోజు అపాయింట్‌మెంట్, రిలీవింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగిపోవాలి. జూన్ ఒకటి కల్లా వీరంతా విధుల్లో చేరాలి.
కానీ ఈరోజు వరకు బదిలీల జాబితాలు ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. ఈ ప్రక్రియ కమిటీకి నేతృత్వం వహించాల్సిన జిల్లా ఇన్‌చార్జి మంత్రియనమల రామకృష్ణుడుతో పాటు జిల్లా మంత్రులు చింత కాయల అయ్యన్నపాత్రుడు,గంటా శ్రీనివాసరావులు టీడీపీ మహానాడులో ఉన్నారు. వీరంతా జిల్లాకు జూన్ ఒకటి నాటికి కానీ విశాఖ రాలేని పరిస్థితి నెలకొంది. మరో పక్క ఈ కమిటీలో మరో కీలక సభ్యుడైన జిల్లా కలెక్టర్ యువరాజ్ స్వచ్చభారత్ మిషన్‌లో శిక్షణ పొందేందుకు హర్యానా రాష్ర్టంలోని ఫదీరాబాద్‌కు బయల్దేరి వెళ్తున్నారు.
దీంతో బదిలీ కమిటీ సభ్యులెవరూ ఈనెల 30వ తేదీ వరకు జిల్లాలో అందుబాటులో ఉండే అవకాశం లేదు. మరొకపక్క రాష్ర్ట విభజన రోజైన జూన్ రెండో తేదీన రాష్ర్ట ప్రభుత్వం తలపెట్టిన నవనిర్మాణ దీక్షను సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ తర్వాత ఆర్థిక పరిపుష్టి పేరిట డ్వాక్రా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి మూడు వేల చొప్పున 3వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వారి పొదుపు ఖాతాల్లో వేసే కార్యక్రమాన్నికూడా సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
జిల్లా స్థాయిలోనే కాదు..మండల స్థాయిలో కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించాలని తలపోసింది. 30వ తేదీలోపు కమిటీ సభ్యులెవరూ అందుబాటులో లేకపోవడం ఆ తర్వాత వరుసగా ప్రభుత్వ కార్యక్రమాలుండంతో బదిలీల ప్రక్రియకు మరో పది రోజుల గడువు కోరనున్నట్టు మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. ఈ విషయాన్ని మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఇదే పరిస్థితి రాష్ర్టవ్యాప్తంగా ఉండడంతో ఒక్క మన జిల్లాలోనే కాదు..రాష్ర్టవ్యాప్తంగా బదిలీల ప్రక్రియకు గడువు పెంచే అవకాశాలు లేకపోలేదని అధికారులంటున్నారు.
అయితే ఈ నెల30వ తేదీలోగా బదిలీల ప్రక్రియ పూర్తిచేస్తే జూన్ 1, 2 తేదీల్లో కొత్త పోస్టింగ్‌లో చేరడం వలన పాఠశాలలు తెరిచేలోగా కొత్త ప్రాంతాల్లో ఇల్లు చూసుకునేందుకు, కుటుంబాలను షిప్ట్ చేసుకు నేందుకు, పిల్లలకు పాఠశాలలు, కళాశాలల్లో అడ్మిషన్ల కోసం గడువు దొరుకుతుందని బదిలీ అవుతుందనుకున్నవారంతా భావిస్తున్నారు. షెడ్యుల్ ప్రకారం పూర్తిచేయాలని వారు కోరుతుంటే..మరో పదిరోజులు గడువు తప్పదని ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలోమహానాడు ముగిసేలోగా ఒక క్లారిటీ వస్తుందని జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సాక్షికి తెలిపారు.
బదిలీలు మరింత ఆలస్యం
Published Thu, May 28 2015 12:00 AM | Last Updated on Mon, Oct 8 2018 5:28 PM
Advertisement