సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చెప్పేటందుకే నీతులున్నాయి అన్నట్టుగా తయారైంది జిల్లా పోలీసు యంత్రాంగం తీరు. ‘సక్రమంగా పనిచేయాలి... లేకపోతే ఎలాంటివారినైనా ఉపేక్షించేది లేదు’ అన్న పోలీస్ బాస్ మాటలు ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. అందుకు తాజాగా రూపొందుతున్న ఎస్సైల బదిలీల కసరత్తే నిదర్శనంగా నిలవనుంది. రాజకీయ ప్రాబల్యానికి పోలీసు శాఖ జీ హుజూర్ అంది. పైగా రాజకీయ పార్టీలను తలదన్నేలా పోలీస్ స్టేషన్లకు సామాజికవర్గాలవారీగా పరిమితులు విధించడం విస్మయపరుస్తోంది. అలా రాజకీయ, సామాజికవర్గ ప్రమాణాలకు అనుగుణంగానే జిల్లాలో ఎస్సైల బదిలీల జాబితాను సిద్ధంచేసినట్టు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రానికి అధికారికంగా విడుదల చేస్తారని భావిస్తున్నారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో జిల్లాలో ఎస్సైల బదిలీల వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగుపులుముకుంది. ఆ తీరు ఇదిగో ఇలా ఉంది...
ఇది నా ఇలాకా!... రూల్స్ జాన్తా నై!
జిల్లాలో ఎస్సైలను ఈసారి సబ్ డివిజన్ దాటించి బదిలీలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. దాదాపుగా అందరు ఎస్సైల బదిలీలు అలాగే చేశారు. కానీ ఒక్క చోట తప్పా!... జిల్లా నుంచి ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఓ ప్రజాప్రతినిధి ఇలాకాలో మాత్రం నిబంధనలు పాటించడానికి పోలీస్ బాస్ ధైర్యం చేయలేకపోయారు. పూర్తిగా ఆ కీలక ప్రజాప్రతినిధి ఎంపికకే పోలీసు ముద్ర వేశారు. జిల్లా అంతటా ఎస్సైలను సబ్ డివిజన్ దాటించి బదిలీ చేసినప్పటికీ... ఆ నియోజకవర్గంలో కనీసం సర్కిల్ కూడా దాటించలేదు. అదే సర్కిల్‌లో ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు మార్చి చేతులు దులుపుకున్నారు. ఆ కీలక ప్రజాప్రతినిధి కేంద్రస్థానంలో ఇద్దరు ఎస్సైల మధ్య తీవ్ర విభేదాలున్నాయి. సివిల్ సెటిల్‌మెంట్లలో ఇద్దరూ ఆధిపత్యం కోసం కలహించుకుంటున్నారు. ఇంతటి తీవ్రమైన ఆరోపణలున్నప్పటికీ వారిపై కఠిన చర్య తీసుకోవడానికి పోలీసు ఉన్నతాధికారి సాహసించలేకపోయారు. వారిలో ఒకరిని అదే సర్కిల్‌లో మరో స్టేషన్‌కు మార్చివేసి మమ అనిపించారు.
వీళ్లు బదిలీలకు అతీతులు
‘చట్టం దృష్టిలో అందరూ సమానులే’ నని పోలీసులు చెబుతుంటారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ‘కొందరు పోలీసు అధికారులు కొంచెం ఎక్కువ సమానం’ అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. అదే సూత్రం ప్రకారం కొందరు ఎస్సైలకు ఈసారి బదిలీల నుంచి మినహాయింపునిచ్చేశారు. తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ వారిని బదిలీ చేయడానికి సాహసించలేదు.
= కనిగిరి నియోజకవర్గంలో ఓ ఎస్సైపై తీవ్రమైన వ్యక్తిగత ఆరోపణలు వచ్చాయి. మహిళలతో ఆయన వ్యవహారశైలి తీవ్రవివాదాస్పదమైంది. దీర్ఘకాలంగా అక్కడ పనిచేస్తున్నప్పటికీ ఆయనకు బదిలీ నుంచి మినహాయింపునిచ్చారు. ఎందుకంటే అక్కడ అధికార పార్టీ ప్రజాప్రతినిధి భూ అక్రమాలకు ఆయన కొమ్ముకాస్తుండటమే.
= జిల్లాలో బాపట్ల లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఎస్సైల బదిలీల ప్రక్రియ మరింతగా విస్మయపరుస్తోంది. జూదగృహాల నిర్వాహకులకు కొమ్ముకాస్తున్న ఇద్దరు ఎస్సైలను వారి స్థానాల్లోనే కొనసాగించాలని నిర్ణయించారు. ఇక ధనబలం, కండబలం ప్రదర్శిస్తారని పేరుపడిన ఓ ప్రజాప్రతినిధి కుడిభుజమైన ఎస్సై జోలికి వెళ్లలేకపోయారు. ఆయన ఏకంగా ఓ జూదగృహాన్ని నిర్వహిస్తున్నారన్న తీవ్రమైన ఆరోపణలున్నాయి. కానీ ఆయన్ని ఈసారి కూడా బదిలీ చేయకూడదని నిర్ణయించడం గమనార్హం.
బదిలీల్లో ‘సామాజికవర్గ’ సమీకరణలు
సామాజికవర్గాల సమీకరణల ప్రకారం రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించడం మనం చూస్తుంటాం. కానీ ఈ జాడ్యం జిల్లా పోలీసు శాఖకు కూడా ఆవహించడం విస్మయపరుస్తోంది. బదిలీల కోసం ఎస్సైలకు ఇటీవల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆ సందర్భంగా ఎస్సైలు తమ ప్రాధాన్యతలను బట్టి మూడు ఆప్షన్లను సూచించాలి. వాటిలో ఏదైనా ఒక చోట పోస్టింగ్ ఇస్తారు. కాగా ఈసారి కౌన్సెలింగ్ సందర్భంగా ఎస్సైలకు ఒక వింత అనుభవం ఎదురైంది. కొన్ని పోలీసు స్టేషన్లకు సామాజికవర్గాల వారీగా పరిమితులు విధించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆప్షన్లు ఎంపిక చేసుకునే ముందే ఎస్సైలకు ఈ మేరకు కచ్చితంగా చెప్పినట్టు సమాచారం. పొదిలి, కంభం పోస్టింగ్‌లను ఓ వర్గం వారు ఎంపిక చేసుకోవద్దని సూచించారు. అద్దంకి, బల్లికురవ, మార్టూరు పోస్టింగ్‌లను ఆ ప్రాంతంలో బలమైన వర్గానికి చెందినవారు ఎంపిక చేసుకోవద్దని తేల్చేశారు. కనిగిరి పోస్టింగ్‌ను కూడా ఓ సామాజికవర్గానికి చెందినవారికి కేటాయించలేమన్నారు.
రానున్న ఎన్నికల దృష్ట్యా ఆ పోలీస్ స్టేషన్లలో వారికి అవకాశం ఇవ్వలేమని కూడా సన్నాయి నొక్కులు నొక్కినట్టు సమాచారం. ఇలా పలానా సామాజికవర్గానికి చెందినవారు పలానా పోలీస్ స్టేషన్‌లో పోస్టింగ్‌ను కోరుకోకూడదనడం అనైతికమే కాదు... నిబంధనలకు విరుద్ధం కూడా!. కానీ ఆ విషయాన్ని కౌన్సెలింగ్ సందర్భంగా ఓ పోలీసు ఉన్నతాధికారి ఎస్సైలకు నిష్కర్షగా చెప్పడం విడ్డూరంగా మారింది. పోలీసు శాఖను ఆవహించిన సామాజికవర్గ జాడ్యానికి ఈ పరిణామం నిదర్శనంగా నిలుస్తోంది. దీనిపై జిల్లా పోలీసు వర్గాలు అంతర్గతంగా తీవ్రంగా చర్చించుకున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పోలీసు శాఖలో ఇంకెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందోనని వ్యాఖ్యానిస్తున్నాయి.
చిత్తం... దొరా!
Published Tue, Dec 10 2013 5:42 AM | Last Updated on Tue, Aug 21 2018 8:52 PM
Advertisement
Advertisement