విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్. చిత్రంలో ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ విజయరామరాజు
సాక్షి, అమరావతి: దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు పారదర్శకంగా జరిగిందని, ఒకవేళ ఏ రాష్ట్రానికైనా తక్కువ రేటుకు కిట్లను విక్రయిస్తే తాము కూడా అదే ధర చెల్లిస్తామని దక్షిణ కొరియాతో చేసుకున్న ఒప్పందంలో ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లు, రాష్ట్రంలో చేస్తున్న టెస్ట్‌లకు సంబంధించిన వివరాలను ఆదివారం ఆయన ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ విజయరామ రాజుతో కలిసి నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు.
► దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న ర్యాపిడ్ టెస్ట్ కిట్ల కొనుగోలు చాలా పారదర్శకంగా జరిగింది.
► ఆ దేశానికి చెందిన మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ భారత్‌లో ఉంది.
► మనం ఆర్డర్ ఇచ్చే నాటికి దేశంలోని ఆ కంపెనీ మ్యానుఫాక్చరింగ్ యూనిట్‌కు అనుమతి లేదు.
► ఇటీవల ఈ కంపెనీకి భారత్‌లో అనుమతి రావడంతో ఆ యూనిట్ నుంచి ర్యాపిడ్ కిట్లను ఛత్తీస్‌గఢ్ కొనుగోలు చేసింది. ► ఒప్పందం చేసుకునే ముందే.. ఏదైనా రాష్ట్రానికి తక్కువ ధరకు కిట్లు విక్రయిస్తే తామూ అదే ధర చెల్లిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
► అందుకే ఛత్తీస్‌గఢ్ చెల్లిస్తున్న ధరనే చెల్లిస్తున్నాం.
► ఏప్రిల్ 20 కల్లా అన్ని జిల్లాలకు ర్యాపిడ్ టెస్ట్ కిట్లను చేరవేస్తాం.
► ర్యాపిడ్ కిట్ల ద్వారా ఒకే సారి చాలామందికి స్క్రీనింగ్ చేయడానికి వీలుపడుతుంది.
► క్షేత్రస్థాయిలో మెడికల్ ఆఫీసర్లు ర్యాపిడ్ టెస్ట్‌లు నిర్వహిస్తారు.
► వైరస్ సోకి తగ్గిందనే విషయం ర్యాపిడ్ టెస్ట్‌లో మాత్రమే తెలుస్తుంది.
► ప్రెగ్నెన్సీ టెస్ట్ మాదిరిగానే ఈ టెస్ట్ కూడా ఉంటుంది. కాకపోతే కొంచెం స్కిల్‌తో చేయాల్సి ఉంటుంది.
► ప్రస్తుతం టెస్ట్‌ల సంఖ్యను భారీగా పెంచాం. ట్రూనాట్ పరికరాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నాం.
► రాష్ట్రంలో 40 మందికి కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ద్వారా వైరస్ సోకినట్లు భావిస్తున్నాం. ఈమేరకు ఆరా తీస్తున్నాం.
► దగ్గు, జలుబు, జ్వరానికి ఎవరికైనా మందులిస్తే వారి వివరాలు చెప్పాలని మెడికల్ షాప్ కీపర్లను కోరాం.
విపత్కర సమయంలో విష ప్రచారమా ?
ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లు కొనుగోలు చేయడం, దేశవ్యాప్తంగా అత్యధిక పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో ఆంధప్రదేశ్ రెండో స్థానంలో ఉండటంతో జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా కిట్‌ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ దుష్ప్రచారం చేస్తున్నాయి. విపత్కర సమయంలో కీలకమైన కిట్లు రాష్ట్రానికి ఎన్ని వచ్చాయి? ఎంత మందికి ఉపయోగపడ్డాయనే విషయాన్ని విస్మరించి విష ప్రచారానికి పాల్పడటంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోనే తొలిసారిగా ఏపీకి ర్యాపిడ్ టెస్ట్ కిట్‌లు తెచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి ఇలా దుష్ప్రచారం చేస్తుండటం పట్ల వైద్య వర్గాల్లో సైతం ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీడీపీ విమర్శలను వైద్య ఆరోగ్యశాఖ కూడా తీవ్రంగా ఖండించింది. దేశ అత్యున్నత పరిశోధనా సంస్థ ఐసీఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్) టెస్టులు చేసేందుకు ఓ సంస్థ నుంచి ఒక్కో కిట్‌ను రూ.795 చొప్పున కొనుగోలు చేయగా, ఐసీఎంఆర్ కంటే ఒక్కో కిట్‌ను రూ.65 తక్కువ రేటుకే ఆంధ్రప్రదేశ్ కొనుగోలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment