=అమలులోకి కొత్త విధానం
=ఇక అవినీతికి అవకాశముండదు..
=వీడియోకాన్ఫరెన్స్‌లో మంత్రి పితాని వెల్లడి
కలెక్టరేట్ (విజయవాడ), న్యూస్‌లైన్ : విద్యార్థులకు పారదర్శకంగా స్కాలర్‌షిప్‌లు మంజూరు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అధికారులకు సూచించారు. హైదరాబాదు నుంచి ఆయనతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రేమాండ్ పీటర్, ఎస్సీ కార్పొరేషన్ కమిషనర్ జయలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఉదయలక్ష్మి, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ వాణిప్రసాద్‌లు జిల్లా అధికారులతో గురువారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పారదర్శకంగా మంజూరు చేసేందుకు నూతన విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు.
ఈ విధానంలో విద్యార్థి దరఖాస్తును ఆన్‌లైన్ ద్వారా సంబంధిత జిల్లా అధికారి వెబ్‌సైట్‌లో పొందుపరచాలన్నారు. విద్యార్థి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలను ఆర్‌ఏఎస్‌ఎఫ్ వెబ్‌సైట్ ద్వారా జిల్లా అధికారులు వాటిని పరిశీలించి సంబంధిత కళాశాలలకు లాగిన్ చేస్తారని వివరించారు. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు విద్యార్థి దరఖాస్తుతో పాటు కావాల్సిన ధ్రువపత్రాలు పొందుపరిచేలా పరిశీలించి.. పాస్ డివైస్ పరికరం ద్వారా విద్యార్థి వేలిముద్రను ఈ-పాస్ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాలను ధ్రువీకరించి ఒక బార్‌కోడ్ నంబరు ఇస్తారని చెప్పారు.
ధ్రువీకరించిన బార్‌కోడ్ నంబర్ల ద్వారా విద్యార్థుల కులాలవారీగా వివరాలను జాబితా తయారుచేసి సంబంధిత జిల్లా అధికారులకు పంపించనున్నట్లు తెలిపారు. బార్‌కోడ్ నంబరు ద్వారా విద్యార్థుల వివరాలను స్కానింగ్ ద్వారా ధ్రువీకరించి స్కాలర్‌షిప్‌లు మంజూరు చేస్తారని వివరించారు. మంజూరైన స్కాలర్‌షిప్‌ల వివరాలు ఒకే సమయంలో ట్రెజరీకి, విద్యార్థి బ్యాంకు ఖాతాకు జమయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
అవినీతికి ఆస్కారం లేకుండా...
ఈ విధానం వల్ల విద్యార్థి స్కాలర్‌షిప్ మంజూరు విషయంలో ఎలాంటి అవినీతీ జరగదని, బోగస్ విద్యార్థి, కళాశాలకు అవకాశం కలగదని మంత్రి, అధికారులు.. జిల్లా అధికారులకు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వీడియోకాన్ఫరెన్స్‌లో వివరించారు. ఎస్సీ కార్పొరేషన్ కమిషనర్ జయలక్ష్మి మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరుకు ఇటీవల ప్రభుత్వం జీవో విడుదల చేసిందని చెప్పారు. దాని ఆధారంగా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కె.శివశంకర్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ డి.మధుసూదనరావు, బీసీ సంక్షేమశాఖ డీడీ ఎం.చినబాబు, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత పాల్గొన్నారు.
పారదర్శకంగా స్కాలర్‌షిప్‌ల మంజూరు
Published Fri, Jan 3 2014 1:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement