ప్రయాణికులకు సమైక్య సెగ | travellers faced problems with united andhra strike | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు సమైక్య సెగ

Published Wed, Aug 28 2013 3:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM

travellers faced problems with united andhra strike

గుడివాడ అర్బన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం ప్రయాణికులపై తీవ్రంగా పడుతోంది. దాదాపు 18 రోజులుగా ఆర్టీసీ బస్సులను నిలిపివేసి ఆ సంస్థ కార్మికులు సైతం ఉద్యమబాట పట్టడంతో జనం ప్రైవేటు వాహనాలు, రైళ్లలో ప్రయాణాలు సాగిస్తున్నారు. ప్రైవేటు వాహనదారులు రెట్టింపునకు పైగా చార్జీలు వసూలు చేస్తుండటంతో ప్రయాణికుల జేబుకు చిల్లు పడుతోంది. దీంతో రోజువారీ రైళ్లలో ప్రయాణం చేసేవారి కన్నా 80 శాతం మంది ప్రజలు అధికంగా రైళ్లను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. రైల్వే శాఖ నడుపుతున్న రైళ్లలో చోటు సరిపడక, గంటల తరబడి నిలబడి గమ్యానికి చేరుకోవటానికి ప్రయాణికులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కాదు.
 
 మచిలీపట్నం-విజయవాడ, నరసాపూర్-గుంటూరు ప్యాసిం జరు, మచిలీపట్నం-విశాఖపట్నం, భీమవరం-గుడివాడ ప్యాసింజరు రైళ్లు నడుస్తుండగా అన్నీ కిక్కిరిసిన వెళ్తున్నాయి. మామూలు రోజుల్లో అయితే గుడివాడ నుంచి రోజుకు సుమారు ఏడు వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య లెక్కకు మిక్కిలిగా పెరిగింది. రైల్వేస్టేషన్‌లోని టిక్కెట్ కౌంటర్‌లు సైతం ప్రయాణికులు టిక్కెట్ల కోసం క్యూ కట్టడంతో వారు టిక్కెట్ తీసుకునేందుకు గంటల తరబడి పడిగాపులు పడాల్సి వస్తోంది. పెరిగిన ప్రయాణికుల సంఖ్యకు సరిపడునన్ని సౌకర్యాలు లేక అవస్థలు తప్పడంలేదు. మరోపక్క కిక్కిరిసిన రైళ్లలోకి ఎక్కలేక చాలామంది స్టేషన్‌లోనే ఉండిపోతున్నారు. ఇక పిల్లలతో ప్రయాణాలు చేసేవారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. రైలు మార్గంలేని గ్రామాలకు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
 
 ప్రైవేటు వాహనాల దోపిడీ..
 సమైక్య ఉద్యమాన్ని అదునుగా చేసుకుని ప్రైవేటు వాహనదారుల దోపిడీ పెరిగింది. ఆర్టీసీ బస్సులు తిరగకపోవడాన్ని ఆసరాగా తీసుకున్న ఆటో డ్రైవర్‌లు గుడివాడ-విజయవాడకు రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్యుడిపై పెనుభారం పడుతోంది. రైళ్లు మాత్రం ఒకటి రెండు తిరగడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు స్పందించి అదనపు వేళల్లో రైళ్లను నడిపితే ప్రయాణికులకు మేలు చేసిన వారవుతారని కోరుతున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement