రూ.100కోట్లే చెల్లింపులు
మరో రూ.90 కోట్లకు బ్రేకులు
హుద్‌హుద్ సాయంపై ప్రభావం
అడ్వాన్స్ జీతభత్యాలకు నో
పేరుకుపోయిన వెయ్యికి పైగా బిల్లులు..
ట్రెజరీలో కొనసాగుతున్న ఆంక్షలు
ఆర్థికలోటు సాకుగా చూపి ట్రెజరీ ద్వారా చెల్లింపులపై విధించిన నిషేధం అభివృద్ధి పనులతో పాటు ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. చెల్లింపులపై ఫ్రీజింగ్ ఉంది ఏం చేయలేం అంటూ ట్రెజరీ అధికారుల చేతులెత్తేస్తుండడంతో వందల్లో బిల్లులు పేరుకు పోతున్నాయి.. వందల కోట్ల చెల్లింపు లకు బ్రేకులు పడుతున్నాయి.
విశాఖపట్నం: ట్రెజరీ ద్వారా చెల్లింపులపై గతనెల 26న ప్రభుత్వం నిషేధం విధించింది. ఫిబ్రవరి మొదటి వారంలో జీతభత్యాలు, ఫింఛన్ల చెల్లింపులకు మినహాయింపు ఇచ్చినా.. వచ్చిన ప్రతీ బిల్లుకూ ఏదో ఒక సాకుతో చె ల్లింపులకు బ్రేకులేస్తూనే ఉన్నారు. జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యా యులు 40వేలమంది ఉండగా, 12వేల మంది వరకు అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. సుమారు 25వేల మంది పింఛన్ దారులున్నారు. జీతభత్యాల రూపంలో ఉద్యోగులకు రూ.115కోట్లు, అవుట్‌సోర్సింగ్/కాంట్రాక్టు సిబ్బందికి రూ.15కోట్లు చెల్లిస్తుండగా, పింఛన్ దారులకు రూ.60కోట్ల వరకు చెల్లింపులు జరుగుతుంటాయి. అంటే సుమారు రూ.190కోట్ల మేర చెల్లింపులు జరగాల్సి ఉండగా, నిషేధం సడలించినప్పటికీ జనవరి నెలకు సంబంధించి ఫిబ్రవరిలో జరిగిన జీతభత్యాలు, పింఛన్ల చెల్లింపులు కేవలం రూ.100కోట్ల లోపే. మరో 90కోట్ల చెల్లింపులకు బ్రేకులుపడ్డాయి. ఇక హుద్‌హుద్ సాయం కింద రూ.320కోట్ల మేర పరిహారం విడుదల కాగా, ఇప్పటి వరకు 80శాతం వరకు బ్యాంకులకు జమయ్యాయి.
రూ.30కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది. వీటిలో గృహాల డామేజ్ కింద మంజూరైన సొమ్ములో రూ.17కోట్లు, మత్స్యశాఖ పరిధిలో రూ.3.50కోట్లు, పశుసంవర్ధకశాఖ పరిధిలో మరో రూ.10కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది. పంపిణీ సమయంలోనే నిషేధం అమలులోకి రావడంతో ఈ చెల్లింపులన్నీ నిలిచిపోయాయి. 13వ ఆర్థిక సంఘ నిధులతో పాటు వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రతీనెలా రూ.150కోట్ల మేర చెల్లింపులు జరుగుతుంటాయి. వీటి విషయంలోనూ నిషేధం ఆంక్షలు ప్రతిబంధకంగా మారాయి. ఇక ఇవన్నీ ఒక ఎత్తయితే హుద్‌హుద్ సమయంలో రేయింబవళ్లు శ్రమించిన జిల్లా పరిధిలోని వివిధశాఖల ఉద్యోగులకు అడ్వాన్స్ బేసిక్‌పే ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చింది. ఈమేరకు జీవో కూడా జారీ చేసింది. దీంతో ఉద్యోగుల బేసిక్ ప్రకారం రూ.27కోట్ల మేర చెల్లింపుల కోసం ప్రతిపాదనలు తయారు చేసి నివేదించగా జీవో జారీ చేసిన ప్రభుత్వం నిర్ద్వందంగా తోసిపుచ్చింది. డబ్బులున్నప్పుడు చూద్దాంలే అంటూ పక్కన పెట్టేసిందని అధికార వర్గాలే చెబుతున్నాయి. జీతభత్యాలు, పింఛన్లు, పే అలవెన్సెస్, గ్రాట్యుటీ, పింఛన్‌దారుల మెడికల్ రీయింబర్సుమెంట్,ఎ్‌ఫ్‌టీఏ కన్వీనియన్స్, కాస్మోటిక్స్, సీక్రెట్ సర్వీసెస్ ఖర్చులు(పోలీస్), ప్యూనరల్ చెల్లింపులకు నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ ఏదో ఒక వంకతో చెల్లింపులకు బ్రేకులేస్తూనేఉన్నారు.
జిల్లా ట్రెజరీలోనే ఏకంగా 300కుపైగా బిల్లులు పెండింగ్‌లో ఉండగా, ఇక సబ్ ట్రెజరీకార్యాలయాల్లో పేరుకుపోయిన చెల్లింపులన్నీ కలుపుకుంటే వెయ్యికిపైగానే ఉంటాయని అంచనా. ఆర్థిక సంవత్సరం ముగిశాక చెల్లింపులపై విధించిన నిషేధం ఎత్తివేసే అవకాశం ఉందా అంటే అదే డౌటేనని అధికారులంటున్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కనుగుణంగా జరిపే చెల్లింపులను బట్టీ నిషేధం ఎత్తివేత ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఏది ఏమైనా మార్చిలో కూడా ఇదే రీతిలో నిషేధం కొనసాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో వచ్చే ఏడాది కూడా అరకొర గానే జీతాల చెల్లింపులు జరుగుతాయన్న వాదన వ్యక్తమవుతోంది.
రానున్న నెలా అరకొరే..
Published Tue, Feb 24 2015 1:03 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement
Advertisement