గిరిజనుడి హత్య
గుమ్మలక్ష్మీపురం, న్యూస్‌లైన్ : భూతగాదాలు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. సొంత పెదనాన్ననే ఓ యువకుడు బండరాయితో మోది దారుణంగా హతమార్చాడు. గుమ్మలక్ష్మీపురం మండలంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటికే చీకటిపడడంతో ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎల్విన్‌పేట పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వనకాబడి పంచాయతీ వండిడి గిరిజన గ్రామానికి చెందిన నిమ్మక లక్ష్మయ్య (50) అదే గ్రామానికి చెందిన తన తమ్ముడు(సీతయ్య) కొడుకు నిమ్మక పరశురాంతో కలసి దేరువాడ గ్రామంలోని చర్చిలో ప్రార్థనకు వెళ్లాడు.
ప్రార్థన ముగిసిన అనంతరం సాయంత్రం ఐదు గంటల సమయంలో స్వగ్రామానికి ఇద్దరూ కాలినడకన బయల్దేరారు. దేరువాడ, వనకాబడిగ్రామాలకు మధ్య గల గెడ్డ వద్దకు చేరుకోగానే.. పరశురాం పెద్ద రాయిని తీసుకుని లక్ష్మయ్య ముఖంపై బలంగా మోదాడు. దీంతో లక్ష్మయ్య కుప్పకూలిపోయూడు. మళ్లీ అదే రాయితో లక్ష్మయ్య తలపైన, ముఖంపైన తీవ్రంగా గాయపరిచాడు. దీంతో సంఘటన స్థలంలోనే లక్ష్మయ్య ప్రాణాలు వదిలాడు. మృతదేహాన్ని అక్కడ నుంచి గెడ్డలో పడేయడానికి పరశురాం ప్రయత్నిస్తుండగా.. అదే సమయంలో అటుగా వెళ్తున్న వండిడి గ్రామానికి చెందిన మండంగి శంకరరావు చూశాడు. దీంతో మృతదేహాన్ని పరశురాం అక్కడే వదిలి వెళ్లిపోయూడు. శంకరరావు సమాచారంతో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని భోరుమన్నారు.
భూతగాదాలే కారణమా?
లక్ష్మయ్య హత్యకు భూ తగాదాలే కారణమై ఉండొచ్చని ఎల్విన్‌పేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.వేణుగోపాల్ అనుమానం వ్యక్తం చేశారు. తండ్రి వారసత్వంగా లక్ష్మయ్య, సీతయ్యలకు రెండున్నర ఎకరాల భూమి వచ్చింది. ఇందులో లక్ష్మయ్య ఎకరంన్నర, సీతయ్య ఎకరా భూమి సాగు చేస్తున్నారు. తనకంటే ఎక్కువ భూమి ఉందన్న అక్కసుతో సీతయ్య తన అన్నతో తరచూ గొడవలు పడుతుండేవాడని స్థానికులు చెబుతున్నారు. సుమారు ఏడాదికాలంగా ఇదే విషయమై ఇరు కుటుంబాల మ ద్య గొడవలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బంధుత్వాన్ని మరచి, సొంత పెదనాన్ననే పరశురాం హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమా నం వ్యక్తం చేస్తున్నారు. ఎల్విన్‌పేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.వేణుగోపాల్, ఎస్సై గోపి ఘటనా స్థలికి సోమవారం చేరుకుని పరిశీలించారు. హత్యకు ఉపయోగించిన రారుుని స్వాధీనంచేసుకున్నారు. అనంతరం గ్రామం లో ఉన్న నిందితుడు పరశురాంను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.