మానవ జాతి చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టం – ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’ వెలువడటం. ప్రపంచ నడకను ఈ సిద్ధాంతం సమూలంగా మార్చివేసింది. మానవ పురోభివృద్ధికి సరికొత్త దారులు వేసింది. ‘ద కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’ మొట్టమొదటగా వచ్చిన జర్మన్ భాషా ప్రచురణకు ఈ సంవత్సరం ఫిబ్రవరి 24న 175 ఏళ్ళు పూర్తయ్యాయి.
ఈ సిద్ధాంత స్ఫూర్తితోనే రష్యా, చైనా విప్లవాలు మొదలుకొని ఎన్నో ప్రజాస్వామ్య విధానాలు అమలులోకి వచ్చాయి. భారత దేశంలో కూడా నేడు మనం అనుభవిస్తున్న జీవితాలు, అమలు జరుగుతున్న విధానాలు ఎన్నో కమ్యూనిస్టు భావజాల ప్రభావం నుంచి వచ్చాయంటే అతిశయోక్తి కాదు. దోపిడీ, అణచివేత ఉన్నంత వరకూ కమ్యూనిస్టు ప్రణాళిక సజీవ సిద్ధాంతంగానే ఉంటుంది.
‘‘చెల్లాచెదురుగా ఉండే ప్రజలను, ఉత్పత్తి సాధనాలను, ఆస్తులను బూర్జువా వర్గం నిర్మూలిస్తున్నది. దీని ఫలితంగా రాజకీయ కేంద్రీకరణ ఏర్పడుతున్నది. బూర్జువా వర్గం తన గుత్తాధిపత్యాన్ని పెంచుకుంటున్నది.
వివిధ ప్రయోజనాలను కలిగిన ప్రాంతాలను, స్వంత శాసనాలను, ప్రభుత్వాలను, పన్నులను కలిగి ఉన్న రాష్ట్రాలను తన ఆధిపత్యంలో ఒకే శాసనం, ఒకే జాతీయత, ఒకే భూ సరిహద్దు, ఒకే పన్నుల వ్యవస్థను రూపొందించి ఒకే జాతి ముద్దగా చేస్తు న్నది.’’ 1848 ఫిబ్రవరి 24న ప్రకటించిన ‘కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక’లో పేర్కొన్న విషయమిది.
అంతర్జాతీయ కార్మిక సమాఖ్య అయిన కమ్యూనిస్టు లీగు సంస్థ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికా రచన బాధ్యతను తమకు అప్పగించిందని ఈ ప్రణాళిక రచయితలు ఫ్రెడరిక్ ఎంగెల్స్, కారల్ మార్క్స్ 1872 నాటి ప్రచురణకు రాసిన ముందుమాటలో పేర్కొన్నారు. మొదట ఈ ప్రణాళిక జర్మన్ భాషలో రాశారు. ఆ తర్వాత రచయిత మిస్ హెలెన్ మెక్‌ఫర్లేన్ జర్మన్ నుంచి ఇంగ్లిష్‌లోకి అనువదించారు (మేనిఫెస్టో ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ).
ఇది 1850లో రెడ్ రిపబ్లికన్ పత్రికలో లండన్‌లో అచ్చయ్యింది. 1848 లోనే ఫ్రెంచిలో ఫ్రెంచి విప్లవానికి కొన్ని నెలల ముందు పారిస్‌లో అచ్చ యింది. రష్యా, డేనిష్, పోలిష్ భాషలన్నింటిలోకీ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక అనువాదమైంది. మొదటిగా వచ్చిన జర్మన్ ప్రచురణకు ఈ సంవత్సరం ఫిబ్రవరి 24న 175 ఏళ్ళు పూర్తయ్యాయి.
కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక ప్రభావం, పరిణామాల గురించి చెప్పాలంటే ఎన్ని పేజీలైనా సరిపోవు. ఇది మానవ జాతి చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన ఘట్టంగా, ప్రపంచ మార్గాన్ని నిర్దేశించిన సిద్ధాంత గ్రంథంగా నిలిచిపోయింది. అప్పటి వరకు ఉన్న ప్రపంచ నడకను ఈ సిద్ధాంతం సమూలంగా మార్చివేసింది. మానవ పురోభి వృద్ధికి సరికొత్త దారులు వేసింది.
అది కేవలం విప్లవ పోరాటాల జయకేతనం మాత్రమే కాదు, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక రంగాలను సంపూర్ణంగా మలుపు తిప్పింది. ఈ రచన సాగించే నాటికి కారల్ మార్క్స్ వయసు 29 ఏళ్ళు, ఫ్రెడరిక్ ఎంగెల్స్‌కు 27 ఏళ్ళు మాత్రమే. ఇద్దరు నవ యువకులుగా ఉన్న సమయంలోనే పెట్టు బడిదారీ వ్యవస్థ పునాదులను పెకిలించే నవ సమాజ నిర్మాణానికి పునాదులు వేసే అద్భుతమైన సిద్ధాంత గ్రంథాన్ని ప్రపంచానికి అందించారు.
కారల్ మార్క్స్ అప్పటికే తొమ్మిదికి పైగా సిద్ధాంత గ్రంథాలను రాశారు. 1841లో ‘ద డిఫరెన్స్ బిట్వీన్ డెమొక్రిటియన్ అండ్ ఎపిక్యురన్ ఫిలాసఫీ ఆఫ్ నేచర్’ పేరుతో మొదలైన మార్క్స్ రచన, పరిశోధనల ప్రయాణం 1848కి వచ్చేసరికి కమ్యూనిస్టు పార్టీ ప్రణా ళికను అందించింది. మార్క్స్ రచనలలో మరొక విశేషమైన రచన ‘దాస్ కాపిటల్’ మొదటిభాగం 1867లో వచ్చింది.
మార్క్స్ తన జీవితం అంతా కార్మిక వర్గ ప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచించినట్టు మనకు తెలుస్తున్నది. కమ్యూనిస్టు ప్రణాళిక ఒక రాజకీయ డాక్యుమెంటుగా కనిపించవచ్చు. కానీ అందులో తాత్విక సంవాదం ఎక్కువగా కనిపిస్తుంది. భూస్వామ్య సమాజంపై పెట్టుబడిదారీ విధానం విజయం సాధించి, సమాజంపై తన దుర్మార్గమైన దోపిడీ పంజాను విసురుతున్న తీరును కళ్ళకు కట్టినట్టుగా ఈ ప్రణాళిక చూపిస్తున్నది.
దాదాపు డెబ్భై పేజీల రచనలో నాలుగు భాగాలు న్నాయి. మొదటి భాగం: బూర్జువాలు– కార్మికులు. రెండవ భాగం: కార్మికులు – కమ్యూనిస్టులు. మూడవ భాగం: సామ్యవాద – కమ్యూ నిస్టు సాహిత్యం. నాలుగవ భాగంలో వివిధ ప్రతిపక్ష పార్టీల పట్ల కమ్యూనిస్టుల వైఖరి ఉంటాయి.
ఇందులో మొదటి భాగం ముఖ్యమైనది. బూర్జువాలు– కార్మికులు అధ్యాయంలో ఆ రోజున్న సామాజిక స్వరూపాన్ని, పెట్టు బడిదారీ వ్యవస్థ దుర్మార్గాన్ని సంక్షిప్తంగా ప్రపంచం ముందుంచారు. ఈ రోజు మనం చూస్తున్న కార్పొరేట్ వ్యవస్థ దారుణమైన చర్యలను అత్యంత సూక్ష్మంగా వివరించారు. మొదటి పేరాలో పేర్కొన్న అంశం ఈ రోజు మనం చూస్తున్న ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు అద్దం పడుతున్నది. ‘‘ఆధునిక రాజ్యంలో ప్రభుత్వం బూర్జువా వర్గపు వ్యవహారాలను నిర్వహించే ఒక యంత్రాంగంగా, అంగంగా మారిపోయింది’’ అని పేర్కొన్నారు.
ఇటీవల మన దేశపు కార్పొరేట్ కంపెనీలకు ప్రస్తుత ప్రభుత్వం ఒక సబార్డినేట్‌గా పనిచేస్తున్నదన డంలో ఎటువంటి సందేహం లేదు. అంతేకాకుండా, ‘‘గతంలో ప్రజల భక్తి, గౌరవాలకు పాత్రమైన వృత్తులన్నింటినీ బూర్జువా వర్గం దిగజార్చింది. వైద్యులు, న్యాయవాదులు, కవులు, శాస్త్రవేత్తలను తన కింద పనిచేసే కూలివాళ్ళుగా మార్చి వేసింది’’ అంటూ చేసిన వ్యాఖ్య మన కళ్ళ ముందు అత్యంత స్పష్టంగా అనుభవంలోకి వచ్చింది.
‘‘యంత్రాలు విస్తృతంగా ఉపయోగంలోకి రావడం వల్ల కార్మికుల శ్రమలో వ్యక్తిగత ప్రత్యేకత పూర్తిగా అంతరించింది. కార్మికుడికి ప్రాధాన్యత కరువైంది. కార్మికుడు యంత్రానికి తోకగా మారిపోయాడు. అతనికి ఉండవలసింది చాకచక్యం మాత్రమే. గానుగెద్దులాంటి యంత్రంలో తానో యంత్రంగా మారి పోయాడు’’ అంటూ చేసిన వివరణ ఈరోజు అత్యంత వాస్తవ దృశ్యంగా మనకు దర్శనమిస్తోంది.
అది కార్మికుడికి కేవలం పొట్టపోసుకోవడానికి కావాల్సిన వసతులను మాత్రమే ఏర్పాటు చేస్తుందనీ, యంత్రాల వాడకమూ, శ్రమ విభజనా పెరిగే కొద్దీ కార్మికుడు తన ఉనికిని కోల్పోతాడనీ కమ్యూనిస్టు ప్రణాళిక ఆనాడే హెచ్చరించింది.
దిగువ మధ్య తరగతివాళ్లు, చిన్న చిన్న వ్యాపారస్తులు, దుకాణదారులు, చేతి పనివాళ్ళు, రైతులు క్రమంగా తమ ఉపాధిని కోల్పోతారనీ, పెట్టుబడిదార్లతో పోటీ పడ లేక దివాళా తీస్తారనీ కూడా కారల్ మార్క్స్, ఎంగెల్స్ ఆనాడే ప్రకటించారు.
ఇప్పుడు ఇది మరింత తీవ్రమైంది. దాదాపు అన్ని రంగాల్లో ఒకరిద్దరు పెట్టుబడిదార్లు మాత్రమే తమ గుత్తాధిపత్యాన్ని చలా యిస్తున్నారు. ఇది అప్పటికన్నా ఇప్పుడు మరింతగా అసమానతలను తీవ్రతరం చేస్తున్నది.
కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ పరిస్థితులను వివరించి మాత్రమే ఊరుకోలేదు. ఆనాటి బూర్జువా దోపిడీని స్పష్టంగా విశ్లేషించి, దానికి పోరాటాలు మాత్రమే పరిష్కారంగా చూపారు.
సంఘర్షణ, పోరాటాలు లేకుండా సమాజం ప్రగతిని సాధించలేదని ప్రకటించారు. ఇందులోనే కార్మికవర్గం నాయకత్వాన్ని ప్రతిపాదించిన వర్గపోరాటాల చరిత్రను ఉదహరించారు. కార్మిక వర్గానికి ఒక సందే శాన్ని కూడా ఈ ప్రణాళికలోనే అందించారు. ‘పోరాడితే పోయేది లేదు, బానిస సంకెళ్ళు తప్ప’, ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండి’ నినాదాలను ప్రపంచానికి ఆయుధాలుగా అందించారు.
కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ అందించిన సిద్ధాంత స్ఫూర్తితో ప్రపంచంలో ఎన్నో గొప్ప మార్పులు వచ్చాయి. రష్యా, చైనా విప్లవాలు మొదలుకొని ఎన్నో ప్రజాస్వామ్య విధానాలు అమలులోకి వచ్చాయి. భారత దేశంలో కూడా ఈనాడు మనం అనుభవిస్తున్న జీవితాలు, అమలు జరుగుతున్న విధానాలు ఎన్నో కమ్యూనిస్టు భావజాల ప్రభావం నుంచి వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో దోపిడీ, అణచివేత, అసమానత, వివక్షతలు ఉన్నంత వరకూ కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక సజీవ సిద్ధాంతంగానే ఉంటుంది. ఇది అక్షర సత్యం.
మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077
Comments
Please login to add a commentAdd a comment