గిరిజనులు ఏం పాపం చేశారని..! | tribal peoples what they did | Sakshi
Sakshi News home page

గిరిజనులు ఏం పాపం చేశారని..!

Published Thu, Feb 20 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM

tribal peoples what they did

రుణాల మంజూరులో నాన్చుడు ధోరణిపై బ్యాంకర్లపై జేసీ ఆగ్రహం
  నెలాఖరులోగా లక్ష్యాలను
 చేరుకోవాలని ఆదేశం
  జిల్లా బ్యాంకు అధికారుల
 సంప్రదింపుల కమిటీ సమావేశం
 
 సాక్షి, ఏలూరు : గిరిజనులు ఆర్థికంగా ప్రగతి సాధించవద్దా? వారు ఏ పాపం చేశారని ఇంత వివక్ష చూపుతున్నారు? వారికి ఎందుకు రుణాలు ఇవ్వటంలేదో స్పష్టంగా చెప్పాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జేసీ టి.బాబూరావునాయుడు బ్యాంకర్లను ప్రశ్నించారు.  జిల్లా బ్యాంకు అధికారుల సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లో బుధవారం సాయంత్రం నిర్వహించారు.
 
 
 అధ్యక్షత వహించిన జేసీ మాట్లాడుతూ గిరిజనులు ఆర్థికంగా ప్రగతి సాధించాలనే లక్ష్యంతో ఈ ఆర్థిక సంవత్సరానికి ఐటీడీఏ పరిధిలో 1,238 మందికి పలు యూనిట్లు మంజూరు చేయాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ నిర్ణయించారని గుర్తుచేశారు. దీనికోసం రూ.2.41 కోట్లను సబ్సిడీగా 11 బ్యాంకులకు కేటాయిం చినా కేవలం 146 మంది గిరిజనులకు మాత్రమే రుణాలివ్వడం బాధాకరమని పేర్కొన్నారు. యూనిట్ల స్థాపన కోసం  10 మందితో కూడిన అధికారుల బృందాన్ని గిరిజన గ్రామాలకు నిత్యం పంపిస్తున్నా ఆయిల్ ఖర్చు, సిబ్బందికి టీఏ ఖర్చు తప్ప గిరిజనులకు ఒరిగిందేమీ కనిపించడం లేదని ఘాటుగా అన్నారు. గిరిజనులకు రుణాలు మంజూరు చేస్తారో? లేదో? రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని, లేనిపక్షంలో సమాచార హక్కు చట్టం కింద ప్రతి బ్యాంకుకూ లేఖ రాయాల్సి ఉంటుందని జేసీ హెచ్చరిం చారు. ఏజెన్సీలో ప్రతిపాదించిన గిరిజ నులందరికీ రుణాలివ్వటానికి  అంగీ కార పత్రాలను ఫిబ్రవరి నెలాఖరు నాటికల్లా అందజేసి, మార్చి 15 నాటికి యూనిట్ల స్థాపన జరిగేలా బ్యాంకులు చర్యలు తీసుకుంటామని లీడ్ బ్యాంకు మేనేజర్ లక్ష్మీనారాయణ హామీ ఇవ్వడంతో జేసీ శాంతించారు.
 
 వ్యవసాయ రుణాలు భేష్
 జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.8వేల 710 కోట్ల రుణాలు అందించాలనేది లక్ష్యం కాగా, రూ.8వేల 950  కోట్లు అందించటంలో  బ్యాంకర్ల పాత్రను బాబూరావునాయుడు ప్రశంసించారు. రూ.4వేల 374 కోట్ల 8 లక్షలను పంట రుణాలుగా అందించాలని లక్ష్యం కాగా, రూ. 5వేల 545 కోట్ల 97 లక్షలు అందించినట్టు ఆయన చెప్పారు. పీఎంఈజీపీ, రాజీవ్ యువశక్తి స్వయం ఉపాధి పథకాల కింద, స్వ యం సహాయక సంఘాలు బ్యాంకు లింకేజీ ద్వారాతీసుకున్న రుణాల వసూళ్లపై కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి మండల స్థాయిలో రికవరీ కమిటీలను ఏర్పాటు చేశారని జేసీ చెప్పారు. ఈ కమిటీల పని తీరును పరిశీలించడానికి కొత్తగా జిల్లా స్థాయిలో జిల్లా రికవరీ కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడిం చారు. రాజీవ్ యువశక్తి పథకం కింద 505 యూనిట్లు స్థాపించాల్సి ఉండగా 438 యూనిట్లు మంజూరు చేశారని, పట్టణ ప్రాంతాలలో మహిళా గ్రూపులకు రూ.87 కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా రూ.77 కోట్లు మాత్రమే మంజూరు చేశారని జేసీ చెప్పారు. వచ్చే నెలలో మోడల్ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశాలున్న దృష్ట్యా ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను తక్షణమే అధిగమించడానికి బ్యాంకర్లు మరింత శ్రద్ధ వహించాలన్నారు.
 
 రుణ లక్ష్యాలు చేరుకుంటాం: డీఆర్‌డీఏ పీడీ
 స్వయం సహాయక సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరం బ్యాంకు లింకేజీ ద్వారా రూ.662 కోట్ల రుణాలు అందించాల్సి ఉండగా 90 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని డీఆర్‌డీఏ పీడీ కె.శివశంకరరావు చెప్పారు. రూ.36 కోట్లు మంజూరుకు సంబంధించిన ప్రతిపాదనలు ఆంధ్రాబ్యాంకులో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సత్యనారాయణ మాట్లాడుతూ 2వేల 223 యూనిట్లకు గాను ఇంతవరకూ 1,412 యూనిట్లు మంజూరు అయ్యాయని, మిగిలినవి నెలాఖరు నాటికి పూర్తయ్యేలా బ్యాంకర్లు సహకరించాలని కోరారు. బీసీ కార్పొరేషన్ ఈడీ పెంటోజీరావు మాట్లాడుతూ 5వేల 239 యూనిట్లు లక్ష్యానికిగాను ఇంతవరకూ 2వేల 658 యూనిట్లు మంజూరు అయ్యాయని, మిగిలిన వాటిని నెలాఖరు నాటికి మంజూరు చేసి వచ్చేనెల 15 లోగా స్థాపన జరిగేలా బ్యాంకర్లు సహకారం అందించాలని కోరారు. వ్యవసాయశాఖ డెప్యూటీ డెరైక్టర్ కృపాదాసు మాట్లాడుతూ నీలం తుపానుకు సంబంధించి నష్టపరిహారం అందాల్సిన రైతుల కోసం తమ కార్యాల యంలో ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశామన్నారు. గత ఏడాది అక్టోబర్‌లో తుపాను, భారీ వర్షాలకు పాడైన పంటలకు రూ.124 కోట్ల  నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు.
 
 పాఠశాల  విద్యార్థులకు బ్యాంకింగ్‌పై అవగాహన : లీడ్ బ్యాంకు మేనేజర్
 పాఠశాల విద్యార్థులకు బ్యాంకింగ్ కార్యకలాపాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న ఏలూరు సుబ్బమ్మదేవి పాఠశాలలో ఆర్‌బీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు లీడ్ బ్యాంకు మేనేజర్ ఎం.లక్ష్మీనారాయణ చెప్పారు. బ్యాంకు ఖాతాలతో ఆధార్ సీడింగ్ ప్రక్రియను కొనసాగించాలని బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలో ఉద్యానపంటలు సాగుచేసే రైతులకు ముఖ్యంగా ఆయిల్‌పాం రైతులకు రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు.  ఆంధ్రాబ్యాంకు డీజీయం, డీసీసీ కన్వీనర్ నాగరాజునాయుడు, డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో డి.వెంకటరెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ శ్రీమన్నారాయణ, పశుసంవర్థక శాఖ జేడీ జ్ఞానేశ్వరరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం త్రిమూర్తులు, సీపీవో కె.సత్యనారాయణ, మత్స్యశాఖ డీడీ కృష్ణమూర్తి, శిశు సంక్షేమ శాఖ పీడీ వసంతబాల, ఉద్యాన శాఖ ఏడీ సుజాత, మెప్మా పీడీ శేషారెడ్డి, మైనారిటీస్ కార్పొరేషన్ ఈడీ ఘోరీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement