చిలకలూరిపేట: మంత్రి నియోజకవర్గంలో దౌర్జన్యాలు, అరాచకాలు పెచ్చుమీరాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పట్టణంలోని ఎన్‌ఆర్టీ సెంటర్‌లో రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దంపతుల దౌర్జన్యాలకు నిరసనగా బాధిత కుటుంబాలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి సతీమణి రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా, షాడో మంత్రిగా మారి అరాచకాలకు కారణమౌతున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అభిమానులను టార్గెట్ చేస్తూ వారిని వేధించడం సరికాద ని హితవుపలికారు. వైఎస్సార్‌సీపీకి మద్దతు పలికారన్న కోపంతో స్థానిక కేబుల్ నెట్‌వర్కులో 20 ఏళ్లుగా భాగస్వాములుగా ఉన్న వారి వాటాను బలవంతంగా లాక్కొని బయటకు నెట్టివేశారని విమర్శించారు. వ్యాపారాలు కోల్పోయిన ఆపరేటర్లు కుటుంబాలు నడిబజారులో నిలబడాల్సిన అగత్యం ఏర్పడిందన్నారు.
దౌర్జన్యంతో ఆస్తులను రాయించుకోవటం ఏ సంప్రదాయమని ప్రశ్నించారు. రేషను కార్డులు, ఫించన్లు తొలగించి నిరుపేదల, వృద్ధుల కడుపు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల తరుపున తమ పార్టీ పోరాడుతుందని హామీ ఇచ్చారు. కేబుల్ ఆపరేటర్ల వాటా వారికే అప్పగించాలని, తొలగించిన ఫించన్లు, రేషన్‌కార్డులను పునరుద్ధరించాలని, స్థానిక విలేకరి శంకర్ హత్యకేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సీపీకి మద్దతు పలికామనే మంత్రి, ఆయన సతీమణి ప్రోద్బల్యంతో తమ వాటాలు లాక్కొన్నారని దీక్షల్లో వారి కుటుంబసభ్యులతో కూర్చొన్న బాధిత ఆపరేటర్లు ఆరోపించారు. కేబుల్ టీవీలో మంత్రికి 50 శాతం వాటా ఇవ్వటానికి ఈ ప్రయత్నాలు కొనసాగాయని తెలిపారు. ప్రసారాలు నిలిపివేసి, కనెక్షన్లు కట్ చేసి భయానక వాతావరణం సృష్టించారని వాపోయారు.
ప్లెక్సీ తొలగింపుతో ఉద్రిక్తత..
దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న పోలీసు అధికారులు వ్యక్తిగత విమర్శలు చేయవద్దని, మంత్రి పేరుతో ఏర్పాటు చేసిన ప్లెక్సీని తొలగించాలని కోరారు. దీనికి మర్రి రాజశేఖర్ ప్రజాసామ్యయుతంగానే దీక్షలు చేస్తున్నామని, బాధితులు తమ ఆవేదన కూడా చెప్పుకోవటానికి వీలులేదా అని ప్రశ్నించారు. ఈ సమయంలో ఆయనకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు బలవంతంగా ప్లెక్సీని తొలగించడంతో వారి చర్యకు నిరసనగా కార్యకర్తలు నినాదాలు చేశారు. కార్యక్రమానికి పార్టీ పట్టణ కన్వీనర్ ఎ.వి.ఎం.సుభానీ అధ్యక్షత వహించగా మాజీ కౌన్సిలర్ పటేల్(కొప్పురావూరి నాగేశ్వరరావు), కట్టా సీతమ్మ, సావిత్రి తదితరులు బాధితులకు మద్దతుగా దీక్షల్లో పాల్గొన్నారు.
పేటలో ఆటవిక పాలన
Published Sat, Dec 20 2014 1:53 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement