కడుపు తరుక్కుపోయేలా | tribal woman gives birth to baby on road | Sakshi
Sakshi News home page

కడుపు తరుక్కుపోయేలా

Published Thu, Dec 12 2013 4:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

కడుపు తరుక్కుపోయేలా

కడుపు తరుక్కుపోయేలా

కురుపాం, న్యూస్‌లైన్: గర్భం మరో బ్రహ్మలోకమని,  ప్రసవం స్త్రీకి పునర్జన్మ అని అంటారు. కానీ జిల్లాలోని అధికారులకు ఈ వాక్యాలు అంతగా పరిచయం ఉన్నట్లు లేవు. మాతాశిశు రక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నా అవి మారుమూల పల్లె వరకు చేరడం గగనమైపోతోంది. అందులోనూ కొండకోనల్లో పలు మూఢనమ్మకాలు గూడుకట్టుకున్న గిరిజనులకు అవగాహన కల్పించేవారు కనిపించడంలేదు.  దీనికి మరో ఉదాహరణే ఈ సంఘటన. కొమరాడ మండలం పాలెం పంచాయతీ మర్రిగూడ గ్రామానికి చెందిన గర్భిణి పాలక ప్రమీల(21)కు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో మంగళవారం అర్ధరాత్రి 108 వాహనంలో కురుపాం  పీహెచ్‌సీకి  ఆమె తల్లి పాలక యశోద, అత్త నారాయణమ్మలు తీసుకొని వచ్చారు. అయితే అప్పటికే విధి నిర్వహణలో ఉన్న వైద్యాధికారి రవికుమార్ వైద్యసేవలు అందించారు. గర్భంలో ఉమ్మనీరు పోవడంతో ప్రసవం కష్టం అవుతుందని పార్వతీపురం వెళ్లాల్సి ఉంటుందని ఆయన  సూచించారు. కానీ ఆ గర్భిణిలో గూడు కట్టుకుపోయిన భయాలు ఆమెను ఆస్పత్రికి వెళ్లనీయలేదు.
 
 ఆపరేషన్ అంటే భయం, ఆస్పత్రిలో ఉంటే చనిపోతానేమోనన్న భీతి మరోపక్క ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆమె పార్వతీపురం వెళ్లేందుకు నిరాకరించి తిరిగి ఇంటికి వెళ్లి పోదామని పట్టుబట్టింది. వైద్యాధికారులు, తల్లి, అత్తలు ఎంత చెప్పినా, నొప్పులు పడుతూనే ఎవ్వరికి చెప్పకుండా తెల్లవారు జామున ఆస్పత్రి నుంచి పారిపోయి శివ్వన్నపేట జంక్షన్‌కు చేరుకుంది. అయితే అప్పటికే నొప్పులు ఎక్కువ కావడంతో శివ్వన్నపేట మూలబుడ్డి జంక్షన్‌లో రోడ్డుపైనే ప్రసమవుతుండగా   స్థానిక మహిళలంతా చేరి చీరలు, దుప్పట్లను చుట్టూ పెట్టి ప్రసవానికి సహాయపడ్డారు. దీంతో బుధవారం ఉదయం 6.15 నిమిషాలకు నడిరోడ్డుపై గిరిజన గర్భిణి మగ పిల్లాడికి జన్మనిచ్చింది. వెంటనే స్థానికులు ఆస్పత్రికి వెళ్లి స్టాఫ్‌నర్స్‌ను వెంట తీసుకు వచ్చి దగ్గర ఉండి పసిబిడ్డ బొడ్డు కోయించి సపర్యలు చేయించి తిరిగి ఆస్పత్రికి తీసుకు వెళ్లారు.
 
 అవగాహన రాహిత్యమే కారణమా..?
 ప్రభుత్వ పథకాలను అమలు చేయాల్సిన అధికారులు వాటిని ప్రచారం చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫలితంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముందుగానే అధికారులు గ్రామాల్లోకి వెళ్లి పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తే గిరిజన తల్లులకు ఈ వేదన ఉండదు. ఇప్పటికైనా ఈ అమ్మ రోదనలు ఎవరైనా పట్టించుకుంటారా..? ఆ తల్లి నడిరోడ్డుపై కార్చిన కన్నీటి బొట్లకు అర్థం చెబుతారా అన్నది వేచి చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement