- లేదు లేదంటూనే.. తవ్వకాలకు అనుమతివ్వడంపై మండిపాటు
- ఇక్కడి తవ్వకాల వల్ల 20 గ్రామాల గిరిజనులు కోల్పోనున్న ఉపాధి
- తక్షణమే దానిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని ప్రజా సంఘాల డిమాండ్
- టేకులోవలో సమావేశమై పలు తీర్మానాలు
- 20న ఐటీడీఏ వద్ద ధర్నాకు పిలుపు
పార్వతీపురం/పార్వతీపురం రూరల్ (విజయనగరం) : బోడికొండపై గ్రానైట్ తవ్వకాలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో గిరిజనుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. దశలవారీగా తాము పోరాడి ఇప్పటికే దానిని అడ్డుకుంటుంటే.. తమకు అనుకూలంగా హామీనిచ్చి, రహస్యంగా తవ్వకాలకు అనుమతివ్వడంపై వారంతా ఆగ్రహోదగ్రులవుతున్నారు. ఈ నెల ఎనిమిదో తేదీన తవ్వకాలకు భూమి పూజ చేసిన విషయం తెలుసుకుని ప్రజా సంఘాల నాయకులు ఉద్యమానికి సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు వారంతా టేకులోవలో శనివారం సమావేశమై ఈ నెల 20వ తేదీన ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టాలని నిర్ణయించారు.
అసలేమైందంటే..
పార్వతీపురం మండలం బుదురువాడ పంచాయతీ పరిధిలోని బోడికొండ గ్రానైట్ క్వారీని పోకార్నో కంపెనీకి ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. దీనిని చుట్టుపక్కల సమీప గ్రామాలకు చెందిన ఆదివాసీలు వ్యతిరేకించారు. గత సంవత్సరం జూలై 29, 30 తేదీల్లో జిల్లాలోని డీకే పట్నంలో జిల్లా అధికారులు నిర్వహించ తలపెట్టిన ప్రజాభిప్రాయ సేకరణను కూడా అడ్డుకున్నారు. అంతేగాకుండా పలుమార్లు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ సందర్భంలో అధికారులు గిరిజనుల సమ్మతి లేకుండా లీజుకు ఇచ్చేది లేదని తేల్చిచెప్పడంతో వారు తాత్కాలికంగా ఆందోళన విరమించారు. ఇంతలోనే ఈ నెల ఎనిమిదో తేదీన పోకార్నో కంపెనీ ఆ కొండవద్ద భూమి పూజ చేసి లాంఛనంగా తన కార్యకలాపాలను ప్రారంభించడంతో బుదురువాడ, అనసభద్ర, గోచెక్క పంచాయతీలకు చెందిన 20 గ్రామాల ఆదివాసీలు మళ్లీ ఉద్యమానికి సమాయత్తమయ్యారు. వారికి మద్దతుగా ప్రజాసంఘాల నాయకులు టేకులోవలో సమావేశమై తాము అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
ఐక్యంగా పోరాడుదాం...
సమావేశంలో పాల్గొన్న అఖిల భారత రైతుకూలీ సంఘం నాయకురాలు పి.రమణి, రైతుకూలీ సంఘం నాయకులు ఊయక ముత్యాలు తదితరులు మాట్లాడుతూ... గతంలో ఆదివాసీలు ఆందోళన చేపట్టినపుడు అధికారులు బోడికొండను లీజుకి ఇవ్వమని హామీ ఇచ్చి, ఇప్పుడు మాట తప్పారని ఆరోపించారు. దీనిపై ఆదివాసీలంతా ఐకమత్యంగా పోరాడాలని, ఆదివాసీల పోరాటానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బోడికొండపై ఇచ్చిన లీజును రద్దు చేసేంతవరకు ఉద్యమిస్తామని ప్రకటించారు. ఈ నెల 20వ తేదీన ఐటీడీఏ కార్యాలయం ఎదుట చేపట్టబోయే ధర్నాకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జన్ని ముత్యాలు, కె.రామస్వామి(ఏపీ గిరిజన సంఘం), టి.సాయి (గిరిజన సంక్షేమసంఘం), వెలగాడ కృష్ణ (ఏఎల్‌కెఎంఎస్ జిల్లా అధ్యక్షుడు), ఎం. భాస్కరరావు (ఏపీ రైతుకూలీసంఘం), రెడ్డి శ్రీరామమూర్తి(వ్యవసాయ కార్మిక సంఘం), పి.రంజిత్‌కుమార్ (గిరిజన సంక్షేమసంఘం), మేస్త్రి పూర్ణచంద్రరావు, పి.మల్లిక్(అఖిల భారత రైతుకూలీ సంఘం) తదితరులతో పాటు ఆదివాసీ గ్రామాల ప్రతినిధులు సీదరపు ఎర్రప్ప(బుదురువాడ ఎంపీటీసీ), ఎం.గణేష్ (గోచెక్క పంచాయతీ సర్పంచ్), మెల్లిక ఆదియ్య, ప్రభాకర్ (బొడ్డవలస), కర్రి రామన్న(టొంకి), తవుడు(జిల్లేడువలస), అప్పారావు(దుగ్గేరు సంఘం ప్రతినిధి) తదితరులు పాల్గొన్నారు.
బోడికొండపై గిరిజనాగ్రహం
Published Sun, Jun 19 2016 10:37 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM
Advertisement