అట్టుడికిన ట్రిపుల్ ఐటీ | Triple IT | Sakshi
Sakshi News home page

అట్టుడికిన ట్రిపుల్ ఐటీ

Published Wed, Mar 11 2015 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 PM

అట్టుడికిన ట్రిపుల్ ఐటీ

అట్టుడికిన ట్రిపుల్ ఐటీ

వేంపల్లె : ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన తార స్థాయికి చేరింది. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. ఆర్డీఓ, వీసీ, మంత్రి ఘంటా శ్రీనివాసరావు రంగంలోకి దిగి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా, గతంలో ఇలాంటి హామీలెన్నో ఇచ్చారని విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తక్షణమే తమ డిమాండ్ల పరిష్కారానికి ఉపక్రమిస్తేనే ఆందోళన విరమిస్తామంటున్నారు. సోమవారం ప్రారంభమైన ఆందోళన మంగళవారం రాత్రి పొద్దుపోయేదాకా కొనసాగింది.
 
 తన వద్దకు చర్చలకు వస్తే సరి.. లేదంటే ఇంటికి పంపుతామని వీసీ హెచ్చరించారు. వివరాల్లోకి వెళితే.. ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో అవినీతి రాజ్యమేలుతోందని, తమ అభ్యున్నతి కోసం కృషి చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలను నీరు గారుస్తున్నారని, తమ సమస్యలు పట్టించుకునే వారే లేరని సోమవారం విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వీరన్నగట్టుపల్లె క్రాస్ వద్ద రోడ్డుపై బైఠాయించారు. ట్రిపుల్ ఐటీ అధికారుల చర్చలు సఫలం కాకపోవడంతో మంగళవారం కూడా ఆందోళన కొనసాగింది.
 
  కలెక్టర్ ఆదేశాల మేరకు జమ్మలమడుగు ఆర్డీవో వినాయకం ఇక్కడికి చేరుకొని విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు విషయాలను ఆయన దృష్టికి తెచ్చారు. ట్రిపుల్ ఐటీలో అడ్మినిస్ట్రేషన్ అధికారులంతా అవినీతికి పాల్పడుతున్నారని, విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని వాపోయారు. క్యాంటిన్ నుంచి ఫ్యాన్సీ స్టోర్ ఏర్పాటు చేసేవరకు భారీగా కమీషన్లు తీసుకుంటున్నారని. మరికొంత మంది అధికారులకు వాటిలో భాగస్వామ్యం ఉందని చెప్పారు.
 
  అందువల్ల వస్తువులను అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఐడెంటిటి కార్డులు, ఇతర అవసరాల కోసం ఒక్కో విద్యార్థి నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తున్నారని తెలిపారు. ఇతర యూనివర్సిటీలకు రూ.50 కోట్ల నిధులు వస్తే..   ట్రిపుల్ ఐటీలకు వందల కోట్లు నిధులు మంజూరవుతున్నా.. ఇక్కడి అధికారులు నాణ్యమైన విద్య అందించకుండా స్వాహా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
 
  డిమాండ్ల పరిష్కారం కోసం రెండు రోజులుగా ధర్నా చేస్తున్నా.. ట్రిపుల్ ఐటీ అధికారులు వేణుగోపాల్‌రెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, కె.ఎల్.ఎన్.రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి ఇక్కడికి వచ్చి సమస్య అడిగిన పాపానపోలేదని తెలిపారు. మెస్ నుంచి భోజనం వస్తుంటే అడ్డుకునేందుకు కొందరు అధికారులు ప్రయత్నించారంటే విద్యార్థులపై వారికి ఎంత కసి ఉందో స్పష్టమవుతోందన్నా రు. నాలుగేళ్ల నుంచి యూనిఫాం ఇవ్వడంలేద, ఒకే జతతో కళాశాలకు వెళుతున్నామని చెప్పారు. తాగు నీరు, క్లీనింగ్, లైటింగ్, సరైన భోజనం లేక ఎన్నిమార్లుర విన్నవించినా ఫలితం లేదన్నారు. వారి సమస్యలు విన్న ఆర్డీవో వినాయకం విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వీసీ సత్యనారాయణ స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించబోమని రోడ్డుపై బైఠాయించారు.
 
 విద్యార్థులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి ఘంటా..  
 విద్యా శాఖ మంత్రి ఘంటా శ్రీనివాసరావు ఇక్కడ ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మంగళవారం ఉదయం ఫోన్‌లో మాట్లాడారు. శాసనమండలి డిప్యూటీ చెర్మైన్ సతీష్‌రెడ్డి జోక్యం చేసుకొని మంత్రి ఘంటా శ్రీనివాసరావుతో ఫోన్‌లో మాట్లాడించారు. తాను ఈ నెల 15 ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి వస్తానని, అప్పుడు సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. తక్షణమే తమ డిమాండ్లను పరిష్కరిస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు తేల్చి చెప్పారు.
 
 విద్యార్థులతో ఏఎస్పీ అన్బురాజన్ చర్చలు  
 పులివెందుల ఏఎస్పీ అన్బురాజన్ మంగళవారం సాయంత్రం విద్యార్థులతో చర్చలు జరిపారు. ఇంజనీరింగ్ విద్యార్థులు రోడ్డుపై ధర్నాకు దిగడం మంచిది కాదన్నారు. సమస్యలు పరిష్కారమయ్యేలా తానూ కృషి చేస్తానని చెప్పారు. గతంలో చాలా మంది అధికారులు ఇలానే చెప్పారని విద్యార్థులు ఆందోళనను కొనసాగించారు. విద్యార్థుల సమస్యలను తెలుసుకొనేందుకు వీసీ ట్రిపుల్ ఐటీకి వచ్చారని.. అక్కడికి వెళ్లి సమస్యలు విన్నవించుకోవాలని అధికారులు తెలుపగా, వీసీ ఇక్కడికే రావాలని పట్టుబట్టారు. కాగా, విద్యార్థుల ఆందోళనకు వివిధ పార్టీలు, విద్యార్థి సంఘాల నేతలు మద్దతుగా నిలిచారు.
 
 
  వైఎస్‌ఆర్ సీపీకి చెందిన ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి, అయ్యవారిపల్లె రామగంగిరెడ్డి, టోపివల్లి, గండి దేవస్థాన మాజీ చెర్మైన్ కావలి విజయ్‌కుమార్, మాజీ ఉప సర్పంచ్ చలపతి, కేకే, టీడీపీ నాయకులు భాస్కర్‌రెడ్డి, బీజెపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బ్రహ్మం తదితరులు విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. కాగా, ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని వేంపల్లె మండలాధ్యక్షుడు రవికుమార్‌రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి పేర్కొన్నారు.
 
 విద్యార్థులు క్యాంపస్‌లోకి రావాలి : వీసీ సత్యనారాయణ ట్రిపుల్ ఐటీ విద్యార్థుల డిమాండ్లు సమంజసంగా లేవని, వారి ఆరోపణలు అర్థరహితంగా ఉన్నాయని ఆర్‌జీకేయూటీ వైస్ చాన్సలర్ సత్యనారాయణ పేర్కొన్నారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆయన ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, ఎఫ్‌వో కె.ఎల్.ఎన్.రెడ్డి, ఓఎస్డీ ప్రభాకర్‌రెడ్డిలతో ఆందోళనలకు గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులు కొందరు అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పడం సరికాదన్నారు. అసలు ఈ విషయం వారికి సంబంధం లేదన్నారు.
 
 ఆర్‌జీకేయూటీ యూనివర్శిటీ నుంచి టెండర్ల పక్రియ ద్వారా అన్ని పనులు జరుగుతాయని.. ఇక్కడ ఉన్న అధికారులకు సంబంధమే ఉండదన్నారు. అలాంటప్పుడు అవినీతికి ఎలా పాల్పడుతారన్నారు. రాత్రి 10 గంటల్లోపు విద్యార్థులు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి రాకపోతే ఇంటికి పంపుతామన్నారు. ఇప్పటికే తల్లిదండ్రులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపినట్లు తెలిపారు. విద్యార్థులు క్యాంపస్‌లోకి వచ్చి సమస్యలు తనదృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు.
 
 15వ తేదీన క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉన్నాయని.. అందుకు సమాయత్తమవకుండా ఇలా ఆందోళనలకు దిగడం మంచిది కాదన్నారు. మెస్‌కు సంబంధించి రాద్ధాంతం చేస్తున్నారని, ఒక్కో విద్యార్థికి రూ.75 చెల్లిస్తున్నామని చెప్పారు. ఇందులో 15 శాతం మెస్ నిర్వాహకులు టాక్స్ చెల్లించాల్సి ఉందన్నారు. అయినప్పటికి సక్రమంగా భోజనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక్కడ సమస్యలు లేకపోయినా,  కొంత మంది అధ్యాపకులు విద్యార్థుల వెనుక ఉండి నడిపిస్తున్నట్లు తెలిసిందన్నారు. బాసర, నూజివీడు ట్రిపుల్ ఐటీలకంటే నీటి సౌకర్యం ఇక్కడ బాగుందని చెప్పారు. గతంలో వైస్‌చాన్సలర్‌గా ఉన్న రాజ్‌కుమార్ ఇక్కడ జరుగుతున్న ఆందోళనకు నలుగురు అధ్యాపకులే కారణమని గుర్తించినట్లు తెలిపారు.
 
  ఈ ఆందోళనకు కూడా వారే కారణమని తెలుసుకున్నామని, విద్యార్థులు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి వచ్చేలా వారే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో అధ్యాపకులను నియమిస్తామని, యూనిఫాం కూడా అందజేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా వీసీ తమ వద్దకు వచ్చి తమ సమస్యలు విని పరిష్కారానికి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. పులివెందుల ఏఎస్పీ నేతృత్వంలో రూరల్ సీఐ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జమ్మలమడుగు డీఎస్పీ సర్కార్, సీఐ మురళి, ఎస్‌ఐలు హాసం, ప్రదీప్‌నాయుడు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
 
 క్యాంపస్‌కు వెళ్లిన విద్యార్థులు
 వీసీ హెచ్చరిక నేపథ్యంలో మంగళవారం రాత్రి 10 గంటలకు విద్యార్థినులు క్యాంపస్‌కు వెళ్లిపోయారు. 11.15గంటలకు విద్యార్థులు సైతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణానికి చేరుకున్నారు. వారితో వీసీ, ఏఎస్పీ చర్చలు జరుపుతున్నారు. కాగా రెండు రోజులపాటు ఆందోళనలో పాల్గొనడంతో ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైంది. ఆమెకు ట్రిపుల్ ఐటీలో ప్రాథమిక చికిత్స అనంతరం అంబులెన్స్‌లో మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement