బీఏసీతో సంబంధం లేకుండానే చర్చించొచ్చు! | trs mla's meet for t.bill | Sakshi
Sakshi News home page

బీఏసీతో సంబంధం లేకుండానే చర్చించొచ్చు!

Published Mon, Dec 16 2013 12:23 AM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM

బీఏసీతో సంబంధం లేకుండానే చర్చించొచ్చు! - Sakshi

బీఏసీతో సంబంధం లేకుండానే చర్చించొచ్చు!

సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు రాష్ట్రపతి నుంచి వచ్చిన విభజన బిల్లుపై శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) నిర్ణయంతో సంబంధం లేకుండానే అసెంబ్లీలో చర్చకు చేపట్టవచ్చునని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. అసెంబ్లీ నిబంధనలు (కౌల్ అండ్ శక్దర్)  8వ చాప్టర్ ఆ విషయాన్ని స్పష్టం చేస్తుందన్నారు. ఆ విధంగా చర్చ చేపట్టే అధికారం స్పీకర్‌కు ఉంటుందని వెల్లడించారు.  
 
 తెలంగాణభవన్‌లో ఆదివారం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రపతి నుంచి వచ్చిన బిల్లును మించి చర్చించాల్సిన ప్రాధాన్యాంశం ఏముంటుందని ప్రశ్నించారు. రాజ్యాంగాధినేత అయిన రాష్ట్రపతి నుండి వచ్చిన బిల్లును చర్చించకపోతే అటు రాష్ట్రపతికి, ఇటు శాసనభకు కూడా అవమానమేనన్నారు. ముసాయిదా బిల్లులో సవరణలకు సూచనలు చేసే అవకాశం మాత్రమే శాసనసభకు ఉందని, అభిప్రాయాలను కచ్చితంగా సవరించాలనే హక్కు కూడా అసెంబ్లీకి లేదన్నారు. విభజన అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికే ఉన్న సార్వభౌమాధికారం అని వివరించారు. ‘ఏనుగు ఎల్లింది. తోక చిక్కింది. అది కూడా అయిపోతది. కేంద్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది.
 
 దీనిని ఎవరూ ఆపలేరు. చరిత్రలో చారిత్రక మలుపులను అంగీకరించాలి. అప్పట్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టడం ఒక చారిత్రక మలుపు. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు కూడా ఒక చారిత్రక మలుపు. వీటిని హూందాగా అంగీకరించాలి. అడ్డుకోవాలనుకునే చంద్రబాబు వంటివారు చరిత్ర అనే రోడ్డురోలర్ కింద పడి నలిగిపోతారు. ఎవరూ వెయ్యేళ్లు బతకడానికి రాలేదు. ఉన్నంతకాలం చేసిన మంచి పనులు మాత్రమే చరిత్రలో మిగులుతయి’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.  టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఇంకా మూర్ఖపు వాదనలతో బిల్లును అడ్డుకోవాలని ప్రయత్నించడం వారి కుసంస్కారానికి నిదర్శనమన్నారు. తెలంగాణకు అన్యాయం చేసిన నాయకులే ఈ పరిస్థితులకు కారణమన్నారు. 371(డి) అనే ఆర్టికల్ రాష్ట్ర విభజనకు అవరోధం కాదని, అలాంటి పనికిమాలిన అంశాలపై సవరణకు చర్చ కూడా అవసరం లేదన్నారు. తెలుగులోకి అనువాదం చేయడం పెద్ద సమస్య అనడం కూడా రంధ్రాన్వేషణ చేసేవారికి ఒక వినోదం మాత్రమే అని కొట్టిపారేశారు. కేంద్ర, పార్లమెంటు, రాష్ట్రపతి స్థాయిలో వచ్చే బిల్లులన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయని, ప్రాంతీయ భాషల్లో ఉండవని, వాటిని అనువదించుకోవాల్సిన బాధ్యత సభ్యులదేనని వివరించారు.
 
 చంద్రబాబు ఓ కాలాంతకుడు
 
 ‘చంద్రబాబు ఓ కాలాంతకుడు. తెలంగాణను అడ్డుకోవడానికి ఎంత నీచానికైనా దిగజారొచ్చు. అయితే తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామంటూ బీజేపీ చాలాసార్లు ప్రకటించింది. తెలంగాణకు వ్యతిరేకంగా చంద్రబాబు చేసే కుట్రలేవీ సాగవు. రాష్ట్ర విభజన తప్పదని తేలిపోయిన తర్వాత బాబుకు మతి భ్రమించింది. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నడు. బిల్లు విమానంలో తెస్తరా? అర్థరాత్రి తెలంగాణ ఇస్తరా? అంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నడు.
 
 ముఖ్యమైన విభజన బిల్లు విమానంలో రాకుంటే సైకి ల్ మీద వస్తదా? ఎడ్లబండి మీద వస్తదా? ఏమన్నా సోయి ఉండే  మాట్లాడ్తున్నడా. పారిశ్రామికవేత్త ధీరూభాయి అంబానీ చనిపోతే చంద్రబాబు ప్రత్యేక విమానంలో పోలేదా? అప్పుడు మేమేమన్నా తప్పుబట్టినమా? తెలంగాణలో టీడీపీ పూర్తిగా చచ్చిపోయింది. పార్టీ నుండి కొందరు ఎమ్మెల్యేల చేరికలు ఉంటయి. అలాంటి బాబుతో చర్చలకు మాకేం పని? ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే ఏమైనా చర్చించొచ్చు. పక్క రాష్ట్రానికి చెందిన చంద్రబాబుతో మేమెందుకు టైం వేస్టు చేసుకోవడం. ఆంధ్రాలో బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే మాకేం సంబంధం?’ అంటూ ధ్వజమెత్తారు.
 
 నిజాం షుగర్స్‌ను సాధీనం చేసుకోవాలి : హరీష్
 
 టీడీపీ హయాంలో ప్రైవేటు పరం చేసిన నిజాం షుగర్స్‌ను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని టీఆర్‌ఎస్  ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ గతంలో శాసనసభాసంఘం ఇచ్చిన నివేదికను ఆమోదించాలని, ప్రభుత్వమే దానిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు.
 
 
 ఇక చర్చ కోసం దూకుడే
 అసెంబ్లీలో బిల్లు ప్రతులను అందించిన తర్వాత చర్చ కోసం దూకుడుగా వ్యవహరించాలని టీఆర్‌ఎస్ శాసనసభ్యులకు పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం, అధికారపార్టీకి చెందినవారిపై ఒత్తిడి తీసుకురావాల్సిన మార్గాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. చర్చకు అనుమతించేదాకా ఎంతటి పోరాటమైనా చేయాలని సూచించారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేలకు అవసరమైన సహకారం అందించాలన్నారు. ఎప్పటికప్పుడు అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ చర్చకు అనివార్య పరిస్థితులను కల్పించాలన్నారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించే వీలుంటే అధికారపార్టీకి చెందిన వారిపై రాజీనామాకు ఒత్తిడి తీసుకువచ్చే అవకాశాన్ని కూడా చూడాలన్నారు. రాజ్యాంగ సంక్షోభం, గవర్నర్ ద్వారా ఒత్తిడికి అనుసరించాల్సిన వ్యూహం, వీలైతే రాజ్‌భవన్‌కు ఎమ్మెల్యేల ర్యాలీ వంటివాటిపై ఎప్పటికప్పుడు అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయించుకోవాలని కేసీఆర్ సూచించారు. సభ్యులందరూ విధిగా సభకు హాజరుకావాలని కోరారు.అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలతో సమన్వయం చేసే బాధ్యతలను ఈటెల రాజేందర్, హరీష్‌రావు, కేటీఆర్‌లకు అప్పగిం చారు.
 
 కేసీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే షిండే భేటీ
 
 టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో టీడీపీకి చెందిన జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్‌షిండే ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. కేసీఆర్ నివాసంలో జరిగిన ఈ భేటీలో టీఆర్‌ఎస్‌లో షిండే చేరడం విషయంపై చర్చించారు. మిగిలినవారిలో ఇంకా ఎవరైనా ఎమ్మెల్యేలు వచ్చే అవకాశముందా అనే విషయంపైనా చర్చ జరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement