ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు టీఆర్ఎస్ అభ్యంతరం
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహ ఏర్పాటును తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఎన్టీఆర్ 91వ జన్మదినాన్ని పురస్కరించుకుని మియాపూర్ లోని అల్వీన్ చౌరస్తాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ప్రయత్నించారు. అయితే ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ టీఆర్ఎస్ అడ్డుతగలడంతో ఇరుపార్టీల మధ్య ఘర్షణకు దారి తీసింది.
దాంతో మియాపూర్ లో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే టీఆర్ఎస్ కార్యకర్తల నిరసనను టీడీపీ నేతలు ఖండించారు. ఇదిలా ఉండగా అనుమతి లేకుండా విగ్రహాన్ని ఏర్పాటు చేయవద్దని జీహెచ్ఎంసీ అధికారులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.