పళ్లంరాజు
కాకినాడ: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యుటి) చేసేందుకు కేంద్రాన్ని ఒప్పించడంలో తాము విఫలమయ్యామని, ఇప్పుడు సీమాంధ్ర రాజధానిని తూర్పు గోదావరి జిల్లాకు తీసుకురావడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి పళ్లం రాజు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకే రాజధానిని రప్పించడానికి తన ప్రయత్నాలు తాను చేస్తున్నట్లు చెప్పారు. కాకినాడలో సీబీఎస్సీ ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర రాజధాని ఎక్కడనే విషయంపై కేంద్రం ఓ కమిటీని నియమిస్తుందని చెప్పారు.
ప్రజలు ఏ తీర్పు ఇచ్చినా స్వీకరిస్తాం
రాష్ట్రవిభజన విషయంలో తాము పొరబాటు చేసినట్లు ప్రజలు భావిస్తే, వచ్చే ఎన్నికల్లో వారు ఎటువంటి తీర్పు ఇచ్చినా స్వీకరిస్తామని పళ్లంరాజు చెప్పారు. కాకినాడ ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో ఓ ల్యాబ్తో పాటు నూతనంగా నిర్మించే ఐసీయూకి ఆయన శంకుస్ధాపన చేశారు. 2014 ఎన్నికల్లో కాకినాడ నుంచే లోక్సభకు పోటీచేస్తానని స్పష్టం చేశారు. తెలంగాణ అంశం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ అన్ని పార్టీల నిర్ణయం మేరకే విభజన జరిగిందని తెలిపారు. హైదరాబాద్‌ను యూటీ చేసేందుకు కేంద్రాన్ని ఒప్పించడంలో తాము విఫలమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.