సాక్షి, విజయవాడ: సప్తగిరి మాసపత్రికపై రాజకీయ కుట్రకోణం దాగుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ గతంలోనూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని, దేవుడిని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘‘గతంలో ఆర్టీసీ బస్సుల్లో అన్యమత ప్రచారం, తిరుమల కొండల్లో సిలువ పెట్టారని సోషల్ మీడియాలో టీడీపీ తప్పుడు ప్రచారం చేసింది. దేవుడిని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ఎవరు చూస్తున్నారో.. వారి ఇంగిత జ్ఞానానికి వదిలి వేస్తున్నాం. మధ్యలో ఎవరైనా కవర్లు మార్చారా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. టీటీడీ కార్యాలయంలో అన్యమత పుస్తకాలు ఎందుకు ఉంటాయి? దేవుడిపైనే నింద వేయాలని చూస్తున్నారని’’ ఆయన ధ్వజమెత్తారు. (ఇది దురుద్దేశ చర్య: టీటీడీ)
గతంలో ఇలాంటి ప్రయత్నాలు చేసిన వారిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ ఘటనలో ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దీనిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ సమయంలో ప్రజలను కాపాడమని సుందరకాండ, వేద పారాయణం టీటీడీ తరపున చేశామని, భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రస్తుత కష్ట కాలంలో రాజకీయ దురుద్దేశ్యం తో చేస్తున్న ఆరోపణలు సరికావని వైవీ సుబ్బారెడ్డి ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment