=సీవీఎస్‌వో నియామకానికి ఐపీఎస్‌ల కొరత!
=కుంభకోణాల నేపథ్యంలో ముందుకు రాని అధికారులు
సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో ఇన్‌చార్జ్‌ల పాలన కొనసాగుతోంది. పదవీ విరమణ చేసినా, అధికారులు బదిలీ అయినా, కొత్త వారిని నియమించడంలో జాప్యం జరుగుతోంది. టీటీడీలోని పలు శాఖల్లో ఇన్‌చార్జీలే పెత్తనం చేస్త్తున్నారు. ఆ కోవలోకి టీటీడీ భద్రతా వ్యవస్థా చేరింది. టీటీడీ చీఫ్‌విజిలెన్స్, సెక్యూరిటీ అధికారి (సీవీఎస్‌వో)గా గత నెల 28వ తేదీ వరకు బాధ్యతలు చేపట్టిన అశోక్ కుమార్‌ను వైఎస్సార్ జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆయన స్థానంలో సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా పనిచేస్తున్న చంద్రశేఖర్‌ను నియమించారు. అశోక్‌కుమార్ గత నెల 29వ తేదీన వైఎస్సార్ జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అయితే చంద్రశేఖర్ సీవీఎస్‌వోగా ఇంత వరకు బాధ్యతలు చేపట్టలేదు. దీనిపై టీటీడీ పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా బాధ్యతలు చేపట్టేందుకు ఆయన అంగీకరించలేదు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని నేషనల్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్నట్టు తెలిసింది. దీంతో ఇన్‌చార్జ్ సీవీఎస్‌వోగా అశోక్‌కుమారే ఉండాల్సిందిగా టీటీడీ కోరినట్టు తెలిసింది. ఆయన ప్రస్తుతం వైఎస్సార్ జిల్లాలో ఎక్కువ కాలం గడుపుతున్నారు.
బోర్డు సమావేశాలు, అత్యవసర సమావేశాలు ఉన్నప్పుడు మాత్రమే టీటీడీ కార్యాలయానికి వస్తున్నారు. పూర్తి స్థాయి అధికారి ఉంటేనే తిరుమలలో భద్రత అంతంత మాత్రం. ఇక ఇన్‌చార్జ్ పాలనలో ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఆయన టీటీడీ బాధ్యతలను పూర్తి స్థాయిలో చూసేందుకు వీలు కాని పక్షంలో ఉన్నారని తెలిసింది. ఇప్పటికే తిరుమల ఆలయానికి తీవ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు హెచ్చరికలు అందిన విషయం తెలిసిందే. పుత్తూరులో తీవ్రవాదులు పట్టుబడడం, తిరుపతి పరిసరాల్లో తీవ్రవాదుల జాడలు కనిపించడం లాంటి అంశాలు ఇటీవల జరిగాయి.
ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి భద్రతా అధికారి లేకపోవడం తిరుమల ఎంతవరకు సురక్షితమని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీలోని విద్యాశాఖాధికారి, డెప్యూటీ ఈవో సర్వీసెస్, వేద విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్, ఎస్‌వీ డెయిరీ ఫారం, అన్నమాచార్య ప్రాజెక్టుతో పాటు ఇంకా పలు విభాగాలు ఇన్‌చార్జీల ఆధీనంలోనే ఉన్నాయి. ఇదిలావుండగా టీటీడీ సీవీఎస్‌వో బాధ్యతలు చేపట్టేందుకు చంద్రశేఖర్ ఎందుకు ముందుకు రావడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తన పిల్లల విద్యకు సంబంధించి హైదరాబాద్ వదిలి రాలేనని ఆయన అంటున్నట్లు సమాచారం.
టీటీడీలో అధికారిగా పదవి చేపట్టడానికి అధికారులు ఉత్సాహం చూపిస్తారు. ఇటీవల కుంభకోణాల నేపథ్యంలో ఇక్కడ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇన్‌చార్జి సీవీఎస్‌వోగా ఉన్న అశోక్ కుమార్ కూడా టీటీడీ నుంచి ఎప్పుడు బయట పడతామా.. అని తొందరపడినట్లు తెలిసింది. టీటీడీ వ్యవస్థలో 60 కోట్ల రూపాయలతో సీసీ టీవీల ఏర్పాటు చేయడాన్నీ జాప్యం చేస్తూ వచ్చినట్లు తెలిసింది.
అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తీసుకోవడంలో వివాదాలు లాంటి అంశాలు సమస్యాత్మకంగా ఆయన భావించినట్టు సమాచారం. దీంతో ఇది వరకు ఉన్న సీవీఎస్‌వో తన పదవిని ముళ్లకంచెలా భావించారని సమాచారం. దీనిపై ఇన్‌చార్జి సీవీఎస్‌వో అశోక్ కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ బదిలీ అయినందున తాను రిలీవ్ అయ్యి వచ్చేశానని, అయితే టీటీడీ కోరిక మేరకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నానని అన్నారు. చంద్రశేఖర్‌రెడ్డి ఎందుకు రాలేదో తనకు తెలియదని చెప్పారు. కడప నుంచి ఏ విధంగా టీటీడీ సీవీఎస్‌వోగా బాధ్యతలు చేపడుతున్నారనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడానికి నిరాకరించారు.
టీటీడీలో ఇన్‌చార్జ్‌ల పాలన
Published Sun, Nov 24 2013 4:49 AM | Last Updated on Tue, Aug 28 2018 5:43 PM
Advertisement
Advertisement