సాక్షి, తిరుమల : మహా సంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని సుమారు తొమ్మిది రోజులపాటు మూసివేస్తామని ప్రకటించి.. సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న టీటీడీ బోర్డు తాజాగా స్వరాన్ని మార్చింది. మహా సంప్రోక్షణ సమయంలో గత నిబంధనలు, సంప్రదాయాలకు అనుగుణంగా భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సమావేశమై.. భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేసే విషయమై చర్చిస్తామని ఆయన తెలిపారు. ఈ విషయమై వారంలోగా భక్తుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని ఈవో చెప్పారు. మహా సంప్రోక్షణ సందర్భంగా రోజుకు మూడు నుంచి నాలుగు గంటలు రెండు విడతలుగా శ్రీవారి దర్శనం భక్తులకు కల్పించాలని యోచిస్తున్నామని తెలిపారు. అందుబాటులో ఉన్న సమయం, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
విమర్శలు, ఆగ్రహం
మహాసంప్రోక్షణ సందర్భంగా ఆగస్టు 9వ తేదీ సాయంత్రం నుంచి 17వ తేదీ ఉదయం 6 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తామని టీటీడీ మొదట నిర్ణయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై ఇటు భక్తులు, అటు హిందూ ధార్మిక సంస్థలు, పీఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా భక్తులు నిరసనలు వ్యక్తం చేశారు. ఆలయాన్ని మూసివేస్తామని చెప్పడం వెనుక కుట్ర దాగుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అనుమానం వ్యక్తం చేశారు. మహా సంప్రోక్షణ సమయంలో సీసీ కెమెరాలను సైతం ఆపేస్తామనడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment