
తిరుమలలో ఏకాదశికి భారీ ఏర్పాట్లు
సాక్షి,తిరుమల : వైకుంఠ ఏకాదశి, ద్వాదశి దర్శనాల కోసం తరలివచ్చే భక్తులకోసం తిరుమలలో టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే చలి కోసం అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక షెడ్లు నిర్మించారు. ఇవి సామాన్య భక్తులకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. ఆదివారం కురిసిన భారీ మంచు, ముసురువాన వల్ల భక్తులకు రక్షణగా నిలిచాయి. తాత్కాలిక మరుగుడొడ్లు నిర్మించారు. అదనంగా క్యూలు నిర్మించారు. ఏకాదశికి ఆకర్షణగా ఆలయం వద్ద పందిరి నిర్మిస్తున్నారు. వీఐపీల కోసం ఇప్పటికే నాలుగు క్యూలు నిర్మించారు. బ్యారికేడ్లు నిర్మించారు. అలాగే, ఆలయం వద్ద ఈసారి కొత్తగా శేషతల్పంపై పవళించే శ్రీరంగనాథుని ప్రతిమను రూపొందించనున్నారు.
8 టన్నుల పుష్పాలు, 5 టన్నుల పండ్లతో అలంకరణ
వైకుంఠఏకాదశి కోసం టీటీడీ ఉద్యావన వన విభాగం ఎనిమిది టన్నులు పుష్పాలు, ఐదు టన్నుల పండ్లతో ఆలయాన్ని అందంగా అలంకరించనున్నారు. ఆలయ మహద్వారం, బలిపీఠం, ధ్వజస్థంభం , వెండివాకిలి, ఇతర అనుబంధ ఆలయాలు, వైకుంఠద్వారం (ఉత్తరద్వారం) వరకు వివిధ రకాల సంప్రదాయ, బ్యాంకాక్‌నుంచి తెప్పించిన కట్‌పుష్పాలతో అలంకరించనున్నారు. వీటితోపాటు గ్రీన్‌యాపిల్, బెర్రీ, చెర్రీ, ఇతరరత్రా పండ్లతో ఆకట్టుకునే విధంగా అలంకరణచేయనున్నట్టు టీటీడీ గార్డెన్ విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులు తెలిపారు.
భద్రతా ఏర్పాట్ల పరిశీలన
సాక్షి, తిరుమల: నూతన సంవత్సరం జనవరి ఒకటో తేదీ, వైకుంఠ ఏకాదశి, రెండో తేది ద్వాదశి రోజుల్లో రెండు వేల మంది పోలీసు, భద్రతా బలగాలను భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. భద్రతా ఏర్పాట్లపై ఆదివారం అధికారులు సమీక్షించారు. టీటీడీ ఇన్‌చార్జి సీవీఎస్‌వో జి.శ్రీనివాస్, అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి, ఏఎస్పీ ఎంవీఎస్ స్వామి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అన్ని క్యూ లైన్లను పరిశీలించారు. ఎంబీసీ నుంచి నారాయణగిరి, వైకుంఠం క్యూకాంప్లెక్స్ వరకు విస్తరించిన క్యూ లైన్లను పరిశీలించారు.
క్యూలైన్ల నిర్వహణలో అవసరమైన చర్యలను మ్యాపుల ద్వారా గుర్తించారు. అదే క్యూలైన్లలో ఆలయానికి చేరుకున్నారు. అన్ని పార్కింగ్ కేంద్రాలను పరిశీలించారు. భక్తుల రక్షణ కోసం సుమారు రెండు వేల మంది సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తున్నామని టీటీడీ ఇన్‌చార్జి సీవీఎస్‌వో జి.శ్రీనివాస్, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గోపినాథ్ జెట్టి పేర్కొన్నారు. ప్రధానంగా క్రౌడ్ కంట్రోల్ మేనేజ్‌మెంట్, భద్రకు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ట్లు చెప్పారు. అలిపిరి నుంచి ఆలయం వరకు భద్రత వ్యవస్థను పటిష్టం చేస్తామని తెలిపారు.