బ్రహ్మోత్సవాల ఏర్పాట్లలో టీటీడీ నిమగ్నం
సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో ఉత్సవ ఏర్పాట్లపై ఆలయ అధికారులు దృష్టి పెట్టారు. వాహన సేవల్లో అన్నిటికంటే ఎక్కువగా రెండు టన్నుల బరువుండే సూర్యప్రభ వాహనాన్ని తిరుమలలో గురువారం ప్రయోగాత్మకంగా పరిశీలించారు. దీనిపై ఉత్సవమూర్తులు, నలుగురు అర్చకులు, అలంకరణలతో కలిపి మొత్తం 3 టన్నుల వరకు బరువుంటుంది.
ఆ వాహనాన్ని మావటులు రెండు గంటల పాటు ఆలయ వీధుల్లో తమ భుజాలపై మోయాల్సి ఉంది. గురువారం ముందు జాగ్రత్తగా వాహన మండపం నుంచి సూర్య వాహనాన్ని మోసి పరిశీలించారు. ఇదిలా ఉండగా వా రం రోజులుగా తిరుమల శేషాచల అడవుల్లో కురిసిన వర్షాల వల్ల జలాశయాల్లోకి నీరు చేరుతోంది. జలాశయాలతోపాటు తెలుగుగంగ, బోర్లతో వంద రోజులకు పైగా తిరుమలకు నీటిని సరఫరా చేయవచ్చని అధికారులు నిర్ధారించారు. కాగా, తిరుమలలో గురువారం భక్తుల రద్దీ కొంత పెరిగింది.