డిజిటల్‌ వెంకన్న! | TTD plan to Digitise Tirumala Venkanna Assets | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ వెంకన్న!

Published Thu, Dec 7 2017 10:56 AM | Last Updated on Thu, Dec 7 2017 10:56 AM

TTD plan to Digitise Tirumala Venkanna Assets - Sakshi

సాక్షి, తిరుమల: భక్తకోటి కోర్కెలు తీర్చే కోనేటిరాయుని ఆభరణాలు, వస్తువుల విలువ అమూల్యం. ఆ దేవదేవుడికి ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో కానుకల రూపంలో సమర్పించిన భూములు, భవనాలు, ఇతర ఆస్తులు 4,143 ఎకరాలున్నాయి. డిజిటలైజ్‌ చేయటం ద్వారా ఈ ఆస్తులకు మరింత రక్షణ కల్పించాలని టీటీడీ సంకల్పించింది. శ్రీవారికి భక్తుల నుంచి నిత్యం నగదు, కానుకలు, ఆభరణాల రూపంలో సుమారు రూ.3 కోట్లపైబడి  అందుతున్నాయి. వీటితోపాటు భూములు, భవనాలు, ఇతర ఆస్తులు కూడా సమర్పిస్తూ భక్తి ప్రపత్తులు చాటుకుంటారు. ఇలా ప్రస్తుతం తిరుమల వెంకన్నకు 4,143 ఎకరాలు భూములు, ఆస్తులు సమకూరాయి. 2009లో హైకోర్టు ఆదేశాలతో స్వామివారి ఆస్తుల జాబితాను టీటీడీ అధికారులు కోర్టుకు సమర్పించారు.

పలుచోట్ల శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం
తిరుమల శ్రీవారికి ఏపీ, తెలంగాణా, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాలతోపాటు నేపాల్‌లోనూ ఆస్తులున్నాయి.  తెలుగు రాష్ట్రాల్లో 88% ఆస్తులు, ఉత్తరాదిన 11%, నేపాల్‌లో 1 శాతం ఆస్తులున్నాయి. ఇందులో కొన్ని అన్యాక్రాంతం అవుతున్నట్టు విమర్శలున్నాయి. మరికొన్ని ఆస్తులు లీజు పద్ధతిలో ఉన్నా అద్దెలు సక్రమంగా వసూలు కావటం లేదు. మరికొన్ని ఆస్తులు టీటీడీ ఖాతాలో ఉన్నప్పటికీ కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక పలు చోట్ల స్వామివారి ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నట్టు విమర్శలున్నాయి.  

డిజిటల్‌ ద్వారా ఆస్తులకు భద్రత
డిజిటలైజ్‌ చేయటం ద్వారా లక్షల కోట్ల విలువైన శ్రీవారి ఆస్తులకు రక్షణ కల్పించాలని ధార్మిక సంస్థ టీటీడీ నిర్ణయించింది. స్వామి సొత్తు సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా సంపూర్ణంగా డిజిటల్‌ చేసి పర్యవేక్షించాలని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశించారు. 2018 మార్చి నాటికి ఆస్తుల డేటాను సిద్ధం చేయాలని నిర్దేశించారు. దీంతో దేవస్థానం రెవెన్యూ, ఐటీ విభాగాలు స్వామి ఆస్తులను డిజిటల్‌ చేయటంలో నిమగ్నమయ్యాయి. అందుబాటులో ఉన్న రికార్డులతోపాటు శ్రీవారికి ఉన్న స్థిర, చరాస్తుల ఫొటోల డిజిటలైజేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఈ ప్రకియ పూర్తైతే భవిష్యత్‌లో స్వామివారి ఆస్తుల రక్షణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement