కౌంటర్‌లో లడ్డూలు తీసుకుంటున్న భక్తులు (ఫైల్)
సాక్షి, తిరుపతి: తిరుమలలో ఆన్‌లైన్ మోసాలు పెచ్చుమీరుతున్నాయి. నెలల తరబడి స్వామివారి సేవ కోసం ప్రయత్నాలు చేసే వారికి దొరకని భాగ్యం దొంగలకు దొరుకుతోంది. ఇంటి దొంగల సహకారంతోనే జరుగుతోందా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం సామాన్య భక్తులకు అంత తేలిగా దొరకడం లేదు. అదే పలుకుబడి ఉన్న వారికి, టీటీడీలో పనిచేసే మరి కొందరు తలుచుకుంటే వెంటనే అయిపోతోంది. తాజా ఉదాహరణలే ఇందుకు నిదర్శనం. శ్రీవారి సేవలు పొందే వారి కోసం నెలలో మొదటి శుక్రవారం ఆ నెలకు సంబంధించి సేవా టికెట్లను విడుదల చేస్తారు. భక్తులు కావాల్సిన టికెట్టుకు తమ పేరు నమోదు చేసుకోవాలి. వారికి ఎలక్ట్రానిక్ లాటరీ పద్ధతిలో టికెట్లు కేటాయిస్తారు. నెలల తరబడి ప్రతినెలా పేరు నమోదు చేసుకుంటున్నా ఒక్కసారి కూడా తమకు టికెట్టు దొరకలేదని డయల్ యువర్ ఈఓ కార్యక్రమంలో భక్తులు పలుమార్లు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.
ఇటీవల సోలాపూర్‌లో పట్టుబడిన దళారీ, తాజాగా తిరుపతిలో దొరికిన కాల్ సెంటర్ ఉద్యోగి వందల సంఖ్యలో సేవా టికెట్లు ఎలా పొందగలిగారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో గురువారం పట్టుబడ్డ కాల్ సెంటర్ ఉద్యోగి ఈ నెలలోనే 16 టికెట్లు వచ్చాయని చెబుతున్నారు. అంటే తను ఎన్ని పేర్లు ఎలక్ట్రానిక్ లాటరీకి బుక్ చేసుకుని ఉంటాడు? ప్రతినెలా ఇదే విధంగా బుక్ చేస్తుండడం వల్లే అతనికి పదుల సంఖ్యలో టికెట్లు లభ్యమవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒక కంప్యూటర్ నుంచి లేదా ఒక నిర్ధిష్ట ప్రాంతం నుంచి వందల సంఖ్యలో టికెట్లకు పేర్లు నమోదు అవుతుంటే టీటీడీ ఐటీ విభాగం ఎందుకు గుర్తించలేకపోతోందని భక్తులు ప్రశ్నిస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టుకోబట్టే ఆ దళారులు దొరికారని, ఐటీ విభాగం గుర్తించింది ఏమీ లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంత లోపభూయిష్టంగా ఉంటే ఆ సాఫ్ట్‌వేర్‌ను ఎలా విశ్వసించాలి? అసలు ఎలక్ట్రానిక్ లాటరీ సవ్యంగా ఉందని ఎలా నమ్మాలి? ఐటీ విభాగానికి, దళారులకు మధ్య లింకులున్నాయా అన్న అనుమానాలను భక్తులు వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలలో కీలకంగా మారిన ఐటీ విభాగం
టీటీడీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం అత్యంత కీలకంగా మారింది. గదులు, దర్శనం టికెట్లు, శ్రీవారి సేవా టికెట్లు పొందేందుకు, డొనేషన్లు ఇచ్చేందుకు ఆన్‌లైన్‌లో ఏర్పాట్లు చేశారు. అటువంటి ఐటీ విభాగాన్ని టీటీడీ పటిష్టంగా అమలు చేయలేకపోతోంది. టీసీఎస్ వైఫల్యంతో ఆన్‌లైన్ అక్రమాలకు అడ్డులేకుండా పోతోంది. ఒక్కడే వందలాది టికెట్లు బుక్ చేసుకుంటున్నా గుర్తించలేనంతగా టీటీడీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవస్థ పనిచేస్తోందా? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి దర్శనాన్ని సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని టీటీడీ విరివిగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. ఒకప్పుడు శ్రీవారిని దర్శించుకోవాలంటే తిరుమలకు వచ్చి క్యూలైన్లో వేచి ఉండాలి. ఆ తరువాత సుదర్శనం కంకణాలను టీటీడీ ప్రవేశపెట్టింది. తిరుపతిలో కంకణం కట్టించుకుంటే తమకు కేటాయించిన సమయానికి క్యూలోకి వెళితే సరిపోయేది. ఇటువంటి కౌంటర్లు దేశ వ్యాపితంగా టీటీడీ సమాచార కేంద్రాల్లో మాత్రమే ఉండేవి. ఆ తరువాత రూ.300 శీఘ్రదర్శనం టికెట్లను టీటీడీ సమాచార కేంద్రాలు, పోస్టాఫీసులు, మీ సేవా కేంద్రాల్లో దొరికే ఏర్పాట్లు చేశారు. ఆపై ఎవరైనా ఎక్కడి నుంచైనా టికెట్లు బుక్‌చేసుకునే వెసులుబాటు కల్పించారు. సెల్‌ఫోన్ యాప్‌ను రూపొందించి స్మార్ట్ ఫోన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే టీటీడీకి సంబంధించిన ప్రతి సేవనూ ఆన్‌లైన్‌లో పొందే అవకాశం కల్పించారు.
వైఫల్యం ఎవరిది?
ఒకప్పుడు టీటీడీ ఉద్యోగులే శిక్షణ పొంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవహారాలను చూసేవారు. అన్నీ ఆన్‌లైన్ అయిన తరువాత టీటీడీ ఐటీ విభాగం మొత్తాన్ని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసు) చేతిలో పెట్టారు. టీసీఎస్ నుంచి ఉద్యోగులను నియమించుకుని లక్షలాది రూపాయల వేతనాలను ప్రతినెలా టీటీడీ చెల్లిస్తోంది. టీటీడీ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనే పోస్టును కూడా కొత్తగా సృష్టించారు. టీసీఎస్ నుంచి వచ్చిన వ్యక్తిని ఆ పోస్టులో నియమించారు. అంతేకాకుండా టీటీడీకి అవసరమైన అనేక సాఫ్ట్‌వేర్లను కోట్లాది రూపాయలు ఖర్చుచేసి టీసీఎస్ వద్దనే కొనుగోలు చేస్తున్నారు. ఇంత చేసినా టీసీఎస్ పని అంత సమర్థవంతంగా లేదు. సాఫ్ట్‌వేర్ ఎంత లోపభూయిష్టంగా ఉందో అనేక సార్లు వెల్లడవుతోంది. ఒకే వ్యక్తి ఆన్‌లైన్‌లో వందలాది టికెట్లు బుక్ చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నా పట్టుకోలేకపోతున్నారు. ఇలా ఇంకెందరు ఉన్నారు? ఇలాంటి మోసాలకు ఇంటి దొంగలు సహకరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆన్‌లైన్ మోసాలపై టీటీడీ ఎందుకు దృష్టి సారించటం లేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment