న్యూఢిల్లీ: విజయనగర సామ్రాజ్య పాలకుడు శ్రీకృష్ణ దేవరాయలు 16వ శతాబ్దంలో తిరుమల శ్రీవారికి సమర్పించిన అత్యంత విలువైన ఆభరణాలు ఎక్కడున్నాయో చెప్పాలని కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్‌ఐ), కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని(టీటీడీ) ప్రశ్నించింది. తిరుమల ఆలయాలను ప్రాచీన కట్టడాలుగా ప్రకటించడానికి, శ్రీవారి ఆభరణాలను పరిరక్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో ప్రజలకు తెలియజేయాలని ప్రధానమంత్రి కార్యాలయాన్ని(పీఎంఓ) ఆదేశించింది. ఈ మేరకు సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు ఆదేశాలు జారీ చేశారు.
కారణం లేకుండానే వెయ్యి కాళ్ల మండపం కూల్చేశారు
తిరుమల ఆలయాలను చరిత్రాత్మక, జాతీయ వారసత్వ కట్టడాలుగా ప్రకటించడానికి తీసుకున్న చర్యలను తెలియజేయాలంటూ బీకేఎస్‌ఆర్ అయ్యంగార్ అనే వ్యక్తి తొలుత ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించారు. అక్కడి నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో చివరకు కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. తిరుమల ఆలయాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. 1,500 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి సంరక్షించడం లేదని పేర్కొన్నారు. శ్రీకృష్ణ దేవరాయలు సమర్పించిన ఆభరణాల భద్రతపైనా అయ్యంగార్ అనుమానాలు వ్యక్తం చేశారు. తిరుమల కొండపై శ్రీవారి ప్రధాన ఆలయం మహాద్వారం ఎదురుగా ఉన్న 15 శతాబ్దం నాటి వెయ్యి కాళ్ల మండపాన్ని ఎలాంటి కారణం లేకుండానే 2003లో కూల్చివేశారని ఆక్షేపించారు.
తేలిగ్గా తీసుకోవద్దు...
తిరుమల కొండపై ఉన్న ఆలయాలను ప్రాచీన కట్టడాలుగా ప్రకటించి ఉంటే, వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చేసే సాహసం చేసేవారు కాదని మాడభూషి శ్రీధర్ ఆచార్యులు పేర్కొన్నారు. శ్రీవారి ఆలయాలు, ఆభరణాల పరిరక్షణ విషయంలో జస్టిస్ వాద్వా, జస్టిస్ జగన్నాథరావు కమిటీలు ఇచ్చిన నివేదికలను ఇప్పటిదాకా ఎందుకు బహిర్గతం చేయడం లేదని టీటీడీని ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం కింద దాఖలయ్యే వినతులకు టీటీడీ పాలక మండలి గతంలో స్పందించేదని, ఇప్పుడు సమాధానం ఇచ్చేందుకు నిరాకరిస్తోందని చెప్పారు. ‘‘ఫిర్యాదిదారుడు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రధానమంత్రి కార్యాలయం తేలిగ్గా తీసుకోరాదు. ప్రాచీన కట్టడాలను కాపాడే విషయంలో కేంద్ర సాంస్కృతిక శాఖ, ఆర్కియాలాజికల్ విభాగం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేయాలి. భారతదేశ ప్రాచీన సంస్కృతిని, వారసత్వాన్ని ప్రతిబింబించే తిరుమల ఆలయాలు, కట్టడాలు, అప్పటి విలువైన ఆభరణాలను కాపాడడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి. టీటీడీ పాలక మండలిలో తిష్టవేసిన రాజకీయ నాయకులకే ఈ అంశాన్ని వదిలేసి చేతులు దులుపుకోవద్దు’’ అని మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు.
శ్రీవారి ఆభరణాలు భద్రమేనా?
Published Mon, Sep 3 2018 3:10 AM | Last Updated on Mon, Sep 3 2018 7:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment