సాక్షి, తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గరుడవాహన సేవలో విశ్వపతిని దర్శించాలని భక్తులు తండోపతండాలుగా తరలిరావటం, దర్శనం లేక ఆవేదనతో వెనుదిరిగిపోవటం సర్వసాధారణమైంది. ఈ ఏడాది కూడా సగం మంది భక్తులకు కూడా దర్శన భాగ్యం లభించలేదు. ఈ నేపథ్యంలో ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడవీధుల విస్తరణ వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడవీధుల్లో 1.80 లక్షల మంది భక్తులు హాయిగా కూర్చుని ఉత్సవ మూర్తులను దర్శించవచ్చని టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి 1.5 లక్షలకు మించి భక్తులు కూర్చుని వాహన సేవలను దర్శించే అవకాశం లేదు.
ఎందుకంటే సెక్యూరిటీ నిబంధనల ప్రకారం వాహన సేవలు వీక్షించే సందర్భంలో ప్రతి గ్యాలరీ పక్కన, ముందు ‘డి సర్కిల్’ పేరుతో కొంత ఖాళీ స్థలాన్ని వదలాల్సి ఉంటుంది. భద్రతా, పోలీసు సిబ్బంది భక్తులకు ఆయా స్థలాల్లో కూర్చునే అవకాశం కల్పించటం లేదు. పోలీసు కట్టడితో భక్తులకు ఇక్కట్లు పెరుగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు సాగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు రాత్రి జరిగే గరుడవాహన సేవకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ సేవకు ప్రతియేటా 3 నుంచి 4 లక్షల మంది వరకు భక్తులు తిరుమలకు చేరుకుంటారు. మధ్యాహ్నం సమయానికే గ్యాలరీలు నిండిపోతాయి. ఆ తర్వాత వచ్చిన భక్తులను గ్యాలరీలకే కాదు... నాలుగు మాడ వీధుల చుట్టుపక్కలకూ పంపకుండా పోలీసులు కట్టడి చేస్తారు. దీంతో వాహన సేవలో స్వామిని దర్శిద్దామని వచ్చిన భక్తులు తీవ్ర ఆవేదనతో తిరిగి వెళుతుంటారు.
కొత్త నిర్మాణాల వల్లే సమస్యంతా?
ఆలయ నాలుగు మాడవీధులు విస్తరణ ఆలోచన 1978లో నాటి ఈవో పీవీఆర్‌కే ప్రసాద్ హయాంలోనే మొదలైంది. 1983 నుంచి దశలవారీగా అమలు చేశారు. 2003లో ఆలయ నాలుగు మాడవీధుల్లోని స్థానికుల ఇళ్లు, మఠాలు, చిన్న ఆలయాలు పూర్తి స్థాయిలో తొలగించారు. దీంతో భక్తులకు వాహన సేవల భాగ్యం కలుగుతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొందరి ఒత్తిడితో కొన్ని నిర్మాణాలు వెలిశాయి. ప్రస్తుతం బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల్లో భక్తులు ఉత్సవమూర్తిని దర్శించేందుకు ఆ నిర్మాణాల్లో అవరోధాలుగా నిలిచాయి.
ఖాళీ ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చు
ప్రస్తుతం ఆలయానికి తూర్పు, దక్షిణ మాడ వీధిలోని హథీరాంజీ మఠం స్థల సేకరణ అంశం కోర్టులో నడుస్తోంది. ఇక దక్షిణ మాడవీధిలోని గ్యాలరీల వెనుక వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో కొంత స్థలాన్ని వినియో గించుకోవచ్చని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. పడమర మాడ వీధిలోని కొన్ని ప్రాంతాల్లోని గ్యాలరీలు అభివృద్ధి చేసే అవకాశమున్నట్లు చెబుతు న్నారు. ఇక ఉత్తర మాడవీధిలో ఎక్కువ స్థాయిలో గ్యాలరీలు అభివృద్ధి చేయవచ్చని అంటున్నారు.
మాడవీధులు అభివృద్ధి చేస్తాం..
‘‘బ్రహ్మోత్సవాల్లో యేటేటా భక్తులు పెరుగుతున్నారు. అందు లోనూ గరుడవాహన సేవ, రథోత్సవంలో భక్తులు ఎక్కువ మంది వస్తుంటారు. వారందరికీ ఉత్సవమూర్తిని దర్శించే అవకాశం కల్పించాలంటే మాడవీధులు విస్తరించాల్సిందే. వచ్చే బ్రహ్మోత్సవాల్లోపు కొత్త గ్యాలరీలు నిర్మిస్తాం.’’
– అనిల్‌కుమార్ సింఘాల్, ఈవో, టీటీడీ
తిరుమలలో పోటెత్తిన భక్తులు
తిరుపతి (అలిపిరి): దసరా సెలవులు పూర్తవుతుండటంతో సోమవారం తిరుమలకు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి ఆలయ మాడవీధులు, లడ్డూ కౌంటర్లు, బస్టాండ్లు, విచారణ కార్యాలయాలు, ఉచిత సముదాయాలు, అన్నప్రసాద కేంద్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. శ్రీవారి సర్వదర్శన భక్తులు క్యూ వెలుపల కిలోమీటర్ వరకు బారులు తీరారు. క్యూలో గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో అవస్థలు పడ్డారు. వైకుంఠం కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి.
వైభవంగా బాగ్ సవారి
తిరుపతి (అలిపిరి): తిరుమలలో సోమవారం బాగ్ సవారి వైభవంగా సాగింది. సాధారణంగా అన్ని ఉత్సవాలు, సేవలు, ఊరేగింపుల్లో ఉత్సవర్లు ఆలయానికి ప్రదక్షిణంగానే ఊరేగు తారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు మాత్రమే మలయప్ప ఆలయానికి, పుష్కరిణికి అప్రదక్షిణగా ఊరేగుతా రు. దీనిలో భాగంగా మలయప్ప అనంతాళ్వారుల తోటలో పూజా నివేదనలు అందుకున్నారు. తిరిగి అప్రదక్షిణగానే ఆల యానికి చేరుకున్నారు. కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో కోదండరామారావు, డాలర్ శేషాద్రి ఉన్నారు.