నీటితో కళకళలాడుతున్న తుంగభద్ర జలాశయం
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయం (టీబీ డ్యాం) ఉపరితలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా జలాశయంలో ఇప్పటికే 42.33 టీఎంసీలకు పైగా వరద చేరుకుంది. 133 టీఎంసీల సామర్థ్యమున్న టీబీడ్యాం.. పూడిక వల్ల 100 టీఎంసీలకే నిండుకుండలా తొణికసలాడుతుంటుంది. అయితే డ్యాంలో ఎప్పటికప్పుడు నీటిని దిగువకు విడుదల చేయడం ద్వారా ఈ ఏడాది 130 టీఎంసీల కన్నా ఎక్కువ నీరందే అవకాశాలున్నట్లు అంచనా.
22 తర్వాత హెచ్చెల్సీకి నీరు
దామాసా ప్రకారం 19 టీఎంసీల వరకు హెచ్చెల్సీకి నీరు అందుతుందని భావిస్తున్నా.. టీబీ డ్యాం ఉపరితలంలో కురుస్తున్న భారీ వర్షాలకు 20 టీఎంసీల వరకు నీరు అందే సూచనలు ఉన్నాయి. ఈ నెల రెండో వారం ప్రారంభంలోనే జలాశయానికి 42.33 టీఎంసీల నీరు చేరుకుంది. దీంతో హెచ్చెల్సీకి ఈ నెల 22 నుంచి 25వ తేదీ మధ్యలో నీటిని విడుదల చేసే సూచనలు ఉన్నాయి. ఆగస్టు మొదటి వారంలో ఇరిగేషన్ అడ్వయిజరీ బోర్డు (ఐఏబీ) సమావేశం నిర్వహించనున్నారు. దీంతో హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు ఈ నెల 20 నాటికి పూర్తి చేసేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు.
నీటి లభ్యత పెరిగే అవకాశం
జలాశయం ఎగువ ప్రాంతాలైన కర్ణాటకలోని అగుంబె, శివమొగ్గ, హరిహర, తీర్ధహాళ్లి తదితర ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురుస్తుండడంతో డ్యాంకు ఇన్‌ఫ్లో ఆశాజనకంగా ఉంది. జలాశయం నీటి మట్టం 1632 అడుగులు కాగా, ఆదివారం నాటికి 1613.47 అడుగులకు చేరుకుంది. 7661 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. సాధారణంగా జలాశయంలోకి 40 టీఎంసీల నీరు చేరాక వాటా ప్రకారం హెచ్చెల్సీకి ఆరు టీఎంసీలు విడుదల చేస్తారు. జలాశయానికి నీటి లభ్యత మరింత పెరిగే అవకాశం ఉండడంతో హెచ్చెల్సీకి అదనంగా నీటిని విడుదల చేసే అవకాశమున్నట్లు రైతులు భావిస్తున్నారు.
నీటి విడుదలపై మల్లగుల్లాలు
గత ఏడాది ఆలస్యంగా నవంబర్ ఒకటి నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంతో పంటలు సాగు చేసిన రైతులు దిగుబడి లేక తీవ్ర నష్టాలు చవిచూశారు. ఈ ఏడాది ఇప్పటికే నీటి విడుదలకు సంబంధించి ఇంజినీరింగ్ అధికారులు సమీక్షలు నిర్వహిస్తూ తేదీల ఖరారుపై మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు, కర్ణాటకలో మరమ్మతు పనుల పురోగతిపై అంచనాలు వేసి నీటి విడుదల తేదీ ఖరారు చేయనున్నారు. ఆధునికీకరణ పనులను ఈ నెల 20వ తేదీ నాటికి నిలిపివేసే విధంగా కాంట్రాక్టర్లకు సూచిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ నాటికి నీటిని కర్ణాటక సరిహద్దు దాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. కర్ణాటకలోనూ ఆంధ్ర సరిహద్దు వరకు చేపట్టిన కాలువ మరమ్మతు పనులను ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తి చేసి, 20న నీటి విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు సమాచారం.
కర్ణాటకతో కలిసి నీటిని తీసుకుంటాం
హెచ్చెల్సీకి కర్ణాటకతో పాటు నీరు విడుదల చేసుకోవాలని భావిస్తున్నాం. ఇరు రాష్ట్రాలు ఒకేసారి ఇండెంట్ ఇవ్వడం వల్ల నీటి ప్రవాహ నష్టాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఈ నెల 20వ తేదీ నాటికల్లా కర్ణాటకలో కాలవ మరమ్మతు పనులు పూర్తి కానున్నాయని బోర్డు వర్గాలు తెలిపాయి. దీంతో 20వ తేదీ తరువాత కర్ణాటక నిర్ణయం పరిగణనలోకి తీసుకొని నీరు విడుదల చేసుకోవాలని భావిస్తున్నాం. దీనిపై ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించనున్నాం. సాధ్యాసాధ్యాలు పరిశీలించి నీటి విడుదల తేదీ ఖరారు చేస్తాం.– మక్బుల్ బాషా, ఇన్‌చార్జి ఎస్‌ఈ
Comments
Please login to add a commentAdd a comment