
కోటనందూరు/తుని రూరల్: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంతా గోడలకు రంగులు, బొమ్మలు వేయడంలోనే ఉందని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కనిపించడంలేదని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. రూ.15 లక్షల వ్యయంతో గోడలకు రంగులు వేస్తూ ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని విమరించారు. ఇప్పటికే ఉన్న రహదారులపై మళ్లీ సిమెంట్ రోడ్లను కమిషన్ల కోసం నిర్మిస్తున్నారన్నారు. ఆ నిధులతో పేదల నివాసాలు, మురికివాడల్లో కాలువలు, రహదారులు నిర్మించడంలో వివక్ష ఏమిటని ప్రశ్నించారు. శనివారం ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా స్థానిక గొల్ల అప్పారావు సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మాట్లాడారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన ప్రజాసంకల్పయాత్ర బహిరంగ సభకు, నియోజకవర్గంలో సాగుతున్న టీడీపీ నాయకుల అరాచక పాలనకు వ్యతిరేకంగా భారీగా తరలివచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు ఎమ్మెల్యే రాజా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 2014లో చంద్రబాబు ఇచ్చిన ఏ హామీ సంపూర్ణంగా నెరవేరలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. రైతు, డ్వాక్రా రుణాలు, 108 అంబులెన్సు, ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి వంటి హామీలు అమలు జరక్కపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్నారన్నారు.
ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా నిర్ధిష్టమైన ప్రణాళికతో మీ ముందుకు వస్తున్న జగన్‌ను వచ్చే ఎన్నికల్లో గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. బహిరంగ సభ వేదిక వద్ద స్వాతంత్రం కోసం పోరాడిని అల్లూరి సీతారామరాజు, మరోపక్క రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్, మరోపక్క పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేసిన ఎన్.టి.రామారావు విగ్రహాలను ఏర్పాటు చేసిన ఈ పట్టణంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యహరిస్తూ అభివృద్ధిని కుంటుపర్చారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆరోపించారు. చంద్రబాబునాయుడు మోసపూరితమైన హామీలతో రాష్ట్రంలో వ్యవస్థలన్నింటిని భ్రష్టు్టపట్టించారని మాజీ మంత్రి పార్థసారథి అన్నారు. ప్రజలకు రాజన్న పాలన అందాలంటే ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డికి వచ్చే ఎన్నికల్లో మద్దతు పలకాలన్నారు.
రెండు నెలలుగా జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో చేస్తున్న ప్రజా సంకల్పయాత్రకు విశేష స్పందన లభిస్తోందని కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. అన్నదమ్ముల్లా కలసి ఉన్న తుని, పాయకరావుపేట పట్టణాలు ఏమాత్రం అభివృద్ధి సాధించలేదని మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. 2009, 2013 ఉప ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా నెగ్గించి సేవ చేసే అవకాశం ఇచ్చినప్పటికీ టీడీపీ నేతలు అనేక కుట్రలు పన్ని అణగదొక్కారన్నారు. చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం నుంచే రాష్ట్రంలో ఎన్నో అనర్ధాలు జరుగుతూ ప్రజలు మృత్యువాత పడుతున్నారని పార్టీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పెదపాటి అమ్మాజీ అన్నారు.
రాష్ట్రంలో హీరోగా చెప్పుకునే యనమల రామకృష్ణుడు తునిలో జీరోగా ఉన్నారని ఆమె అన్నారు. ఆయన తమ్ముడు చిన్నికృష్ణుడు వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. టీడీపీ నేతల వేధింపులకు దీటుగా నిలబడి ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పార్టీ నేతలందరికీ అండగా నిలుస్తున్నారన్నారు. బాధ్యతరహితమైన జన్మభూమి కమిటీల కారణంగానే వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా యనమల మూడోసారి ఓడిపోతారని కొయ్య శ్రీనుబాబు అన్నారు. అరాచక పాలనను అంతమెందించి జగనన్నను గెలిపించాలని రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి మాకినీడి గాంధీ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment