పసిడి పంటగా పేరుగాంచిన పసుపు ధర క్రమంగా పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో సుగంధ ద్రవ్యాల ధరను నియంత్రించే కమోడిటీలో పసుపునకు డిమాండ్ ఏర్పడటంతో గడచిన సీజన్‌లో ఉన్న పరిస్థితికి భిన్నంగా ఈ సీజన్‌లో ధరలో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ధర మరింతగా పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మోర్తాడ్, న్యూస్‌లైన్ : పసుపు ధరలకు రెక్కలొచ్చాయి. మహారాష్ట్ర లోని సాంగ్లీ మార్కెట్‌లో క్వింటాలు పసుపు రూ. 10 వేలు పలుకుతోంది. నిజామాబాద్ మార్కెట్‌లో రూ. 7,500 నుంచి రూ. 8,500 మధ్య ధర లభిస్తోంది. సీజన్ ఆరంభంలో క్వింటాలు పసుపు రూ. 4,500 నుంచి రూ.5 వేలు మాత్రమే పలికింది.
జిల్లాలో మోర్తాడ్, కమ్మర్‌పల్లి, బాల్కొండ, వేల్పూర్, జక్రాన్‌పల్లి మండలాల్లో పసుపు ఎక్కువగా సాగు అవుతోంది. నిజామాబాద్ మార్కెట్‌కు సాంగ్లీ మార్కెట్‌కు ధరలో వెయ్యి రూపాయల నుంచి రూ. 2 వేల వరకు తేడా ఉంటుంది. దీంతో చాలా మంది రైతులు సాంగ్లీ మార్కెట్‌కు పంటను తరలిస్తున్నారు.
వర్షాకాలంలో భారీగా వర్షాలు కురియడంతో పసుపు పంట తెగుళ్లు సోకాయి. దీంతో దిగుబడి తగ్గింది. గతంలో నిజామాబాద్ మార్కెట్‌కు రోజుకు 10 వేల సంచుల నుంచి 15 వేల సంచుల పసుపును రైతులు తరలించేవారు. ఈ సీజన్‌లో రోజుకు ఐదు వేల సంచుల పసుపు మాత్రమే వస్తోంది. సరఫరా తక్కువగా ఉండడంతో వ్యాపారుల మధ్య పోటీ నెలకొంది. దీనికి తోడు కమోడిటీలో పసుపునకు డిమాండ్ ఏర్పడడంతో ధర పెరుగుతోంది.
నిజామాబాద్ మార్కెట్‌కు ఈరోడ్, బసుమతినగర్ మార్కెట్‌ల వ్యాపారులు వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నారు. ఈరోడ్ మార్కెట్‌కు పసుపు సరిగా సరఫరా కాకపోవడంతో అక్కడి వ్యాపారులు ఇక్కడి వ్యాపారులతో పసుపును కొనుగోలు చేయించి తీసుకెళ్తున్నారు. బసుమతి నగర్ ప్రాంతంలో పసుపు సాగు తక్కువ కావడంతో అక్కడి వ్యాపారులు కూడా నిజామాబాద్ మార్కెట్‌పై కన్నేశారు. దీంతో ధర పెరుగుతోంది. వారం వ్యవధిలో పసుపు ధర క్వింటాలుకు రూ. 12 వేలకు పెరిగే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. తొందరపడి పంట విక్రయించవద్దని సాంగ్లీకి చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వ్యాపారులు మార్కెట్‌ను అంచనా వేయడంతో పాటు రైతులకు ప్రయోజనం కలిగే విధంగా ప్రచారం నిర్వహించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
పసిడి పంట ధర పైపైకి..
Published Sat, Feb 22 2014 3:12 AM | Last Updated on Mon, Oct 8 2018 6:18 PM
Advertisement
Advertisement