- అరకొరగానే గ్రామీణ విత్తనాభివృద్ధి పథకం అమలు
- సొంత విత్తనాల అభివృద్ధే ధ్యేయం
- జిల్లాలో 150మంది రైతులకే ప్రయోజనం
గుడ్లవల్లేరు : ప్రజాప్రతినిధుల పట్టించుకోనితనం, అధికారుల అనాలోచిత నిర్ణయాల కారణంగా రైతులను విత్తన కొరత విపరీతంగా వేధిస్తోంది. రైతులకు మేలైన, నాణ్యమైన విత్తనాలనందించేందుకు అమలు చేస్తున్న గ్రామీణ విత్తనాభివృద్ధి పథకం వల్ల రైతుకు పెద్దగా ఒరుగుతున్నదేమీలేదని పెదవి విరుస్తున్నారు. ప్రతి ఏటా ఈ పథకం కింద స్వయం విత్తన సమృద్ధే ధ్యేయంగా సబ్సిడీ విత్తనాలను రైతులకు జిల్లా వ్యవసాయ శాఖాధికారులు అందజేస్తున్నారు. అయితే గతేడాది జిల్లాలో 12,200మంది రైతులకు ప్రయోజనం చేకూరగా ఈ సారి కేవలం 150మందికే మేలు చేకూరింది.
నకిలీ విత్తనాల బెడద తప్పించుకునేందుకే...
దుకాణాల్లో నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి, రైతులు నష్టపోకుండా సొంత విత్తనాలను రైతే తయారు చేసుకునేందుకు ఈ పథకం దోహదపడుతుంది. వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో శాస్త్రవేత్తలు పరిశోధించిన మూల విత్తనాలనే ఈ పథకం ద్వారా సరఫరా చేస్తారు. ఈ పథకం ద్వారా విత్తనాలు పొందిన రైతు వద్ద అదే మూల విత్తనాల ద్వారా మూడేళ్ల వరకూ సొంత విత్తనాల తయారీకి అవకాశం ఉంటుంది. ఆ రైతు తన చుట్టుపక్కలున్న రైతులకు ఈ విత్తనాలను తనకు గిట్టుబాటు ధర వచ్చే విధంగానే అమ్ముకోవచ్చు. ఒక్కో యూనిట్‌కు వ్యవసాయ శాఖ 25ఎకరాలను సేకరిస్తోంది. గతంలో 488 యూనిట్లు మంజూరు చేసిన ప్రభుత్వం ఈ సారి 60యూనిట్లతోనే సరిపుచ్చింది.
మంజూరైన మండలాలు ఇవే...
ఖరీఫ్ రైతులకు బీపీటీ 5204 రకానికి వచ్చేసరికి యూనిట్‌కు 7.5క్వింటాళ్ల చొప్పున జిల్లాలోని 50మండలాలకు 50యూనిట్లు మంజూరయ్యాయి. యూనిట్‌కు 7.5క్వింటాళ్ల చొప్పున గుడ్లవల్లేరు, ఉంగుటూరు మండలాలకు 7029రకం రెండు యూనిట్లు, యూనిట్‌కు 7.5క్వింటాళ్ల చొప్పున నాగాయలంక, అవనిగడ్డ, కోడూరు, మోపిదేవి మండలాలకు 1010రకం నాలుగు యూనిట్లు, యూనిట్‌కు 15క్వింటాళ్ల చొప్పున బాపులపాడు మండలానికి వేరుశెనగ విత్తనాలు ఒక యూనిట్. వేరుశెనగ గతంలో వరి తర్వాత ఎక్కువ ప్రాధాన్యతగా ఎక్కువ యూనిట్లు మంజూరయ్యాయి. ఈ సారి ఆ అవకాశం లేకపోయింది. యూనిట్‌కు రెండు క్వింటాళ్ల చొప్పున కంచికచర్ల, వీరులపాడు, గంపలగూడెం మండలాలకు పెసర విత్తనాలు మూడు యూనిట్ల చొప్పున మంజూరయ్యాయి. మినుము, కందిసాగుకు ఈ సారి మంజూరు రాలేదు.
జిల్లాకు 60యూనిట్లు...
గ్రామీణ విత్తనాభివృద్ధి పథకం కింద జిల్లాకు 60యూనిట్లు మంజూరయ్యాయి. ఎకరానికి వరి 30కిలోల చొప్పున 50శాతం సబ్సిడీపై విత్తన పంపిణీ ఉంటుంది. 56యూనిట్లు వరిసాగు రైతులకు విత్తనాలు అందజేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. బీపీటీ రకం కిలో 29 ఉంటే, రూ.14.50కే రైతులకు అందిస్తున్నాం. 1061రకం కిలో రూ.26 ఉంటే, రూ.13కే ఇస్తున్నాం. స్వర్ణ కిలో రూ.27 ఉంటే, 13.50కే పంపిణీ చేస్తున్నాం.
అలాగే పెసర సాగుకు 3యూనిట్లు వచ్చాయి. ఈ విత్తనాలు కిలో రూ.90 ఉంటే, రూ.45కే పంపిణీ చేస్తున్నాం. వేరుశెనగకు వచ్చేసరికి ఒక యూనిట్టే మంజూరైంది. ఈ విత్తనాల విలువ ఈ సారి తగ్గింది. కిలో రూ.53 ఉంటే, రూ.26.50కే రైతులకు అందజేస్తున్నాం.
- వి.నరసింహులు, వ్యవసాయ శాఖ జిల్లా ఇన్‌చార్జి జేడీ