తూర్పుగోదావరి(కపిలేశ్వరపురం): మెడిసన్ సీటు ఇప్పిస్తామని నమ్మించి రూ.10.5 లక్షలు కాజేసిన వ్యవహారంపై తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలిలా ఉన్నాయి. అంగరకు చెందిన నెక్కంటి శ్రీనివాస్‌కుమార్ అదే గ్రామానికి చెందిన గుడిమెట్ల మురళీకృష్ణ కుమారుడికి చైనాలో మెడిసన్ సీటు ఇప్పిస్తానని నమ్మించాడు. 2013లో హైదరాబాద్‌లోని శాంభవి కన్సల్టెన్సీ ద్వారా సీటు ఇప్పిస్తానని ఆ కార్యాలయంలో ఉన్న భరత్‌కుమార్, హరిశంకర్‌లకు రూ.మూడు లక్షలు మురళీకృష్ణతో ఇప్పించాడు. ఎంతకీ సీటు ఖరారు కాకపోవడంతో మురళీకృష్ణ నిలదీయడంతో కుంటిసాకులు చెప్పి గుంటూరులోని కాటూరి మెడికల్ కాలేజీలో సీటు ఇప్పిస్తానని శ్రీనివాస్‌కుమార్ అన్నాడు.
ఆ క్రమంలోనే మరో రూ.3,92,000 వసూలు చేశాడు. కాలేజీ నుంచి అడ్మిషన్ లెటర్ తెచ్చి, చేర్పించే బాధ్యత తనదని, మరికొన్ని ఖర్చులకని ఇంకో రూ.3,60,000 వసూలు చేశాడు. ఇలా దఫ దఫాలుగా మొత్తం రూ. 10,52,000 వసూలు చేశాడు. ఎంతకీ సీటు రాకపోవడంతో మురళీకృష్ణ ఈ నెల ఆరున అంగర పోలీసులను ఆశ్రయించాడు. శ్రీనివాస్‌కుమార్, భరత్‌కుమార్, హరిశంకర్‌లతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు.