
విషాదం
- వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బాలుర మృతి
- విద్యుదాఘాతానికి గురై ఒకరు, కాలువలో మునిగి మరొకరు..
- కొడాలి, నడకుదురుల్లో విషాదఛాయలు
చల్లపల్లి/ఘంటసాల : ప్రమాదవశాత్తూ నీట మునిగి 23 నెలల బాలుడు, విద్యుదాఘాతానికి గురై పదో తరగతి విద్యార్థి మృతిచెందారు. చల్లపల్లి మండలం పాతనడకుదురులో బాలుడు, ఘంటసాల మండలం కొడాలికి చెందిన పదో తరగతి విద్యార్థి ఆదివారం కొన్ని గంటల వ్యవధిలో మరణించడంతో రెండు గ్రామాల్లోనూ విషాదఛాయలు అలముకున్నాయి.
రెండు కుటుంబాల్లోనూ ప్రథమ సంతానమైన కుమారులు కన్నుమూయడంతో తల్లిదండ్రులు గర్భశోకంతో కుమిలిపోతున్నారు. ఈ విషాద ఘటనలకు సంబంధించిన వివరాలు... కొడాలిలోని ఆంధ్రా బ్యాంకు పక్క వీధిలో నివాసం ఉంటున్న వల్లారపు బాలకృష్ణ కుమారుడు దినేష్ మణికంఠకుమార్(15) చల్లపల్లిలోని ఓ ప్రయివేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కుమార్తె రోహిణ రెండో తరగతి చదువుతోంది.
బాలకృష్ణ ఇంటి ఆవరణలోని చేతిపంపునకు నీరందకపోవడంతో వాడుక నీటి కోసం శనివారం దాని పక్కనే మరో 20 అడుగులు బోరు వేయించారు. ఆదివారం ఉదయం 9.30గంటల సమయంలో నీటి కోసం దినేష్‌మణికంఠ కుమార్ మోటారు స్విచ్ వేశాడు. నీరు రాకపోవడంతో మోటారు వద్ద ఉన్న పైపులను పరిశీలించేందుకు చేతితో పట్టుకున్నాడు. విద్యుత్ షాక్ తగలటంతో పెద్దగా కేక వేసి ముందున్న మోటరుపై పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన దినేష్‌మణికంఠ కుమార్ తల్లి కనకదుర్గ మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి కుమారుడిని మోటారుపై నుంచి పక్కకు తీసుకొచ్చారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకోవడంతో 108 వాహనానికి సమాచారం అందజేశారు.
108 రాకపోవడం వల్లే చనిపోయాడు
సమాచారం ఇచ్చిన 20 నిమిషాల తర్వాత కూడా 108 రాలేదు. దీంతో బాలకృష్ణ తన కుమారుడిని ప్రయివేటు వాహనంలో కూచిపూడి తీసుకెళ్లారు. ఆదివారం కావడం వల్ల అక్కడ డాక్టర్లు అందుబాటులో లేరు. దీంతో అదే వాహనంలో చల్లపల్లిలోని ఓ ప్రయివేటు వైద్యశాలకు తీసుకువచ్చారు. దినేష్ మణికంఠకుమార్‌ను పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు చెప్పారు.
అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లారు. అప్పటికి రెండు గంటల సమయం గడచినా 108 వాహనం రాలేదు. సమాచారం అందించిన వెంటనే 108 వాహనం రాకపోవడం వల్లే తన కుమారుడికి సకాలంలో వైద్యం చేయించలేకపోయామని బాలకృష్ణ కన్నీటి పర్యంతమయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కుమారుడు తమ కళ్లెదుటే కరెంటు షాక్‌తో మరణించటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
నీటమునిగి బాలుడు మృతి
చల్లపల్లి మండలంలోని పాత నడకుదురు అంకమ్మ తల్లి ఆలయం వద్ద నివాసం ఉంటున్న కొలుసు శివరామకృష్ణ, శివనాగులుకు కుమారుడు శ్యామసుందర కృష్ణ(23 నెలలు), కుమార్తె తేజశ్రీ(ఏడు నెలలు) ఉన్నారు. వ్యవసాయ పనులు నిర్వహించే శివరామకృష్ణకు ఎడ్ల బండి ఉంది. ప్రతి రోజూ తండ్రి వెంట కుమారుడు శ్యామసుందరకృష్ణ కూడా ఎడ్లను కట్టివేయటానికి సమీపంలోని పశువుల పాకకు వెళ్లేవాడు. యథావిధిగా ఆదివారం ఉదయం 9.30గంటల సమయంలో శివరామకృష్ణ ఎడ్లను కట్టేసేందుకు వెళుతూ కుమారుడుని కూడా రావాలని కోరారు.
అయితే తాను రానని శ్యామసుందర కృష్ణ ఇంటి వద్దే ఉండిపోయాడు. ఆ సమయంలో తమ ఇంటి ఎదురుగా ఉన్న కాలువగట్టుపై ఆడుకుంటున్న శ్యామసుందరకృష్ణ ప్రమాదవశాత్తూ కాలువలో పడిపోయాడు. కొద్దిసేపటికే చనిపోయిన బాలుడు నాలుగు అడుగుల లోతు ఉన్న కాలువలో అడుగు భాగాన కొట్టుకువెళ్లాడు. ఇంటికి సమీపంలో బట్టలు ఉతుకుతున్న కొంతమంది కాలువలో కొట్టుకు వెళుతున్న బాలుడి మృతదేహాన్ని చూసినా గుర్తించలేకపోయారు.
అర్ధగంట తర్వాత ఇంటికి వచ్చిన తండ్రి శివరామకృష్ణ.. కుమారుడు కనిపించకపోవడంతో సమీప ప్రాంతాల్లో వెతికారు. ఇంతలో కాలువలో కొట్టుకువెళుతున్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు శివరామకృష్ణకు సమాచారం ఇచ్చారు. అప్పటికే 300మీటర్ల వరకు బాలుడు మృతదేహం కొట్టుకువెళ్లింది. వంతెన దాటిన తర్వాత మృతదేహాన్ని గుర్తించి పైకి తీసుకువచ్చారు.
నాలుగు రోజుల కిందటే శుభకార్యం...
నాలుగు రోజుల క్రితం శ్యామసుందర కృష్ణ చెల్లెలు తేజశ్రీ అన్నప్రాసన, పుట్టువెంట్రుకలు తీసేందుకు మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవాలయానికి కుటుంబ సమేతంగా వెళ్లివచ్చారు. బుజ్జి బుజ్జి మాటలతో బుడిబుడి నడకలతో సరదాగా తిరుగుతూ ఉన్న కుమారుడు నీటమునిగి మరణించటంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఏడు నెలల కుమార్తెను ఒడిలో పెట్టుకుని ‘లేరా కన్నా..’ అంటూ తల్లి శివనాగులు రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. ఈ రెండు ఘటనలతో కొడాలి, పాతనడకుదురు గ్రామాల్లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.