తండ్రితో చిన్నారి చివరి మాటలు..
► నాన్నా.. లేస్ ప్యాకెట్ తీసుకురా..
► చిన్నారుల సజీవ దహనం ఘటన
పటమట(విజయవాడ ఈస్ట్): ‘మేం పడుకుంటాంలే నాన్న.. అమ్మను తీసుకురా.. వచ్చేటప్పుడు లేస్ ప్యాకెట్ తీసుకురా.. మర్చి పోవద్దు.. అమ్మకు కూడా చెప్పా.. తమ్ముడిని నువ్వు వచ్చే వరకు నేను చూసుకుంటాలే.. త్వరగా వెళ్లి అమ్మను తీసుకుని రా.. ఎండగా ఉంది. నాకోటి.. తమ్ముడి కోటి లేస్ ప్యాకెట్లు తీసుకురండి.. అని తండ్రికి చెప్పిన ఆ చిన్నారి ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. వచ్చీరాని మాటలతో.. చేతి సైగలతో అందరినీ ముచ్చట చేస్తూ తిరిగిన ఆ చిన్నారి అన్నతో పాటు సజీవ దహనమవ్వటం స్థానికంగా కలచివేసింది.
వివరాలు.. పటమటలోని అయ్యప్పనగర్ ట్రెజరీ ఎంప్లాయీస్ కాలనీలో బుధవారం చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో ఓ కుటుంబంతో విధి ఆటలాడుకుంది. ఒడిశా రాష్ట్రంలోని కటక్‌కు చెందిన కల్లిపల్లి భోగేష్ , పద్మ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో రెండో కొడుకు లోకేష్(6), రాజేష్(3)లను తీసుకుని ఆరు నెలల క్రితమే జీవనోపాధి కోసం నగరానికి వచ్చారు.
కాలనీలో ఓ బిల్డర్ భవనం స్థలం ముందు పూరిపాక వేసుకుని జీవనం సాగిస్తున్నారు. భోగేష్ భవన నిర్మాణ పనులు వెళ్తుండగా, పద్మ ఇళ్లలో పనిచేయటానికి వెళ్తోంది. రోజూ మాదిరే పద్మ పనికి వెళ్లగా బుధవారం భోగేష్‌కు పనిలేకపోవటంతో చిన్నారులకు భోజనం తినిపించి వారిని నిద్రబుచ్చి భార్యను తీసుకురావటానికి వెళ్లాడు. వెళ్లిప పది నిముషాల్లో అగ్ని ప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో చిన్నారులు లోకేష్, రాజేష్ సజీవ దహనం అయ్యారు.
అంతా నిమిషాల్లోనే..
భోగేష్ భార్యను తీసుకురావటానికి వెళ్లిన పది నిమిషాల్లో ఇంటికి మంటలు అంటుకోవటంతో కేకలు పెట్టా. పక్కనే ఉండే యువకులు వచ్చే సరికి మంటలు బాగా వ్యాపించాయి. అప్పటికే భోగేష్ పిల్లలు లోపల మంటల్లో చిక్కుకున్నారని తెలిసింది. పక్కనే ఉన్న పండు అనే యువకుడు వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. విషాదం జరిగిపోయింది. – కె. దేవి. ప్రత్యక్ష సాక్షి
రక్షించేందుకు ప్రయత్నించినా..
చిన్నారుల ఆర్త నాదాలు వినిపించి వారిని రక్షించేందుకు ప్రయత్నించా.. లోపలి వరకు వెళ్లా.. విద్యుత్ బోర్డు వద్ద మంటలు దట్టంగా రావటంతో లోనికి వెళ్లేందుకు ప్రయత్నించినా కుదరలేదు. మంచంపై పడుకున్న చిన్నారుల ఆర్తనాదాలు చేస్తూనే సజీవ దహనమయ్యారు. లోనికి వెళ్లే క్రమంలో నా జుట్టు కూడా కాలింది. చేతికి గాయమయ్యింది. మంటలు తీవ్ర స్థాయిలో ఎగిసి పడటంతో వెనక్కి వచ్చా. – పండు, స్థానిక యువకుడు
బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి
పటమట : పటమట ట్రెజరీ కాలనీలో చోటుచేసుకున్న ప్రమాద బాధిత భోగేష్ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్ డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఆయన భోగేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సహాయం కింద రూ.5 వేలు అందించారు. ఆయన వెంట గాదిరెడ్డి అమ్ములు, ధనేకుల కాళీ, మహ్మద్ రిజ్వాన్ ఉన్నారు. కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.8 వేలు విడుదల చేసినట్లు కలెక్టర్ బి. లక్ష్మీ కాంతం బుధవారం ఓ ప్రకటలో పేర్కొన్నారు.
బాధితులను ఆదుకుంటాం..
సంఘటన వెంటనే అక్కడికి చేరుకున్న తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.