ఆరు నెలల్లో కొత్త రాజధాని నిర్ణయం: జైరాం రమేష్
ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ మొదలైందని, ఇందుకోసం రెండు కమిటీలు ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి, తెలంగాణపై కేంద్రం నియమించిన జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తెలిపారు. ఆలిండియా సర్వీసు అధికారుల పంపిణీ కోసం ఒక కమిటీ, రాష్ట్ర స్థాయి అధికారుల కోసం మరో కమిటీ వేసినట్లు ఆయన చెప్పారు. సీమాంధ్ర రాజధాని నిర్ణయం కోసం నిపుణుల కమిటీ ఒకదాన్ని నియమిస్తామని, రాజధాని ఎక్కడ ఉండాలో ఆరు నెలల్లోగా ఆ కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు. అయితే, ఇంతకుముందు 45 రోజుల్లోగా కొత్త రాజధాని ఎక్కడో చెబుతామన్నా.. దాన్ని సవరించి ఆరు నెలలుగా చేసినట్లు ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను తిరిగి సీమాంధ్రలో కలుపుతామని, అయితే బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామాలు మాత్రం తెలంగాణలోనే ఉంటాయని ఆయన చెప్పారు. ఇందుకోసం త్వరలోనే కేంద్రం ఆర్డినెన్స్ తెస్తుందన్నారు.
సీమాంధ్ర ఆర్థిక ప్రణాళిక అమలు కోసం ప్లానింగ్ కమిషన్‌లో ప్రత్యేక కమిటీ వేశామని, అది వచ్చే వారం నుంచి పని చేస్తుందని జైరాం రమేష్ అన్నారు. 4, 5 రోజుల్లో రాష్ట్ర ఏర్పాటుపై గెజిట్ విడుదలవుతుందని, తెలంగాణ రాష్ట్ర అవతరణ తేదీని అందులోనే పొందుపరుస్తామని అన్నారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న 84 వేల మంది ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు పంచాల్సి ఉందన్నారు. ఇక తెలంగాణలో పదేళ్ల పాటు అడ్మిషన్ల విధానం మారదని, ఇప్పుడు ఉన్నట్లే ఉంటుందని ఆయన వివరించారు. రెండు ప్రాంతాలు నేతలు కలహాలు మాని పరస్పరం సహకరించుకోవాలని జైరాం రమేష్ సూచించారు. రాయలసీమలో నాలుగు జిల్లాలకు, ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి ఉంటుందని ఆయన చెప్పారు.