ఇద్దరు జిల్లా యువకులను మింగేసిన గ్యాస్‌పైప్ లైన్ దుర్ఘటన
పెంటపాడు/గణపవరం : నిరుపేద కుటుంబాలు వారివి. .నేలతల్లిని మన్ముకుని జీవించే వారి తల్లిదండ్రులకు చేతికంది వచ్చారు. తమ బిడ్డలు ప్రయోజకులవటంతో కష్టాలు, కన్నీళ్లు ఉండవని సంబరపడుతున్న తరుణంలో వారి జీవితాలతో విధి ఆడుకుంది. తూర్పుగోదావరి జిల్లా నగరంలో సమీపంలో జరిగిన గ్యాస్‌పైప్ లైన్ దుర్ఘటన ఇద్దరి యువకుల్ని పొట్టనబెట్టుకుని. వారి తల్లిదండ్రులకు కడుపుకోతతోపాటు, వృద్ధాప్యంలో ఉన్న తమను చక్కగా చూసుకుంటారని భావించిన వారి ఆశలకు నిప్పు పెట్టింది.
సరిగ్గా వారం క్రితం ఇదే రోజు చెల్లెలి నిశ్చితార్థం కావటంతో ఆ వేడుకలో సందడి చేశాడు గోపిరెడ్డి దివ్వతేజ(24). పనులన్నీ తన భుజాన వేసుకుని చక్కబెట్టాడు. వచ్చిన బంధువులందరినీ పేరుపేరునా పలకరించాడు. పెంటపాడు మండలం పరిమళ్ల గ్రామానికి చెందిన కౌలురైతు సత్యనారాయణ కుమారుడు దివ్యతేజ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో జరిగిన గెయిల్ గ్యాస్ పైపులైన్ ప్రమాద ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.
జయసుందర్ ఇంజనీరింగ్ వర్క్స్‌లో మెకానికల్ వింగ్‌లో సూపర్‌వైజర్‌గా ఏడేళ్లుగా నగరంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. తమ ఒక్కగానొక్క కుమారుడిని మృత్యువు గ్యాస్ పైప్‌లైన్ రూపంలో మింగేసిందని తెలిసి అతని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. శుభకార్యం జరగాల్సిన ఇంట ఇంతటి విషాదం చోటుచేసుకోవడంతో వారిని ఓదార్చడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. తేజ తల్లి లక్ష్మి, చెల్లెలు మౌనిక షాక్‌నుంచి తేరుకోలేదు. కష్టపడి పొలం పనులు చేసుకుంటూ కుమారుడిని చదివించిన సత్యనారాయణ చెట్టంత కొడుకును పోగొట్టుకుని విలపిస్తున్నారు.
గణపవరం గ్రామానికి చెందిన మద్దాల శాంతబాలాజీ (25) ఇదే ప్రమాదంలో మృతిచెందాడు. బాలాజీ రెండేళ్లుగా కాంట్రాక్ట్ పద్ధతిలో గెయిల్ పైప్‌లైన్ మెయింటెనెన్స్ చేసే కాంట్రాక్టర్ వద్ద వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. బాలాజీ తండ్రి ధనం వ్యవసాయ కూలీ. తల్లి సుబ్బలక్ష్మి గృహిణి. వీరికి ఇద్దరు కుమారులుకాగా బాలాజీ న్న అన్న కూడా వ్యవసాయ కూలీ. రామలక్ష్మణుల్లా ఉండే తమ ఇద్దరు పిల్లల్లో చిన్నవాడు లేడని తెలిసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.
కొడుకుపై వారికి ఉన్న మమకారం తెలిసిన బందువులు ప్రమాదంలో బాలాజీ మృతి చెందిన వార్తను చాలా సమయం వరకు అతని తల్లిదండ్రులకు తెలియనివ్వలేదు. టీవీలో వార్తలు చూసి కలవరపాటుకు గురైన బాలాజీ తల్లిదండ్రులు తమ బిడ్డ క్షేమంగానే ఉన్నాడని భావించారు. అతనికి ఏమీ కాకూడదని దేవుడ్ని వేడుకున్నారు. కానీ వారికి కడుపుకోత మిగిలింది.