రెండు కుటుంబాల మధ్య తగాదా
గొల్లప్రోలులో హైడ్రామా
తలలు పట్టుకుంటున్న పోలీసులు
డీఎన్‌ఏ పరీక్ష చేయాలంటున్న ఎస్సై
అనుకోకుండా కనిపించిన ఆ యువకుడు తమ బిడ్డ అంటే.. కాదు తమ బిడ్డ అంటూ రెండు కుటుంబాలవారు తగదా పడిన ఘటన ఇది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పిఠాపురం శివారు ఇల్లింద్రాడ వద్ద ఉన్న వీరభద్రా రైస్ మిల్లుకు తాళ్లరేవు నుంచి మంగళవారం ధాన్యం లోడు లారీ వచ్చింది. ఆ లారీ క్లీనర్ భవానీ మాల ధరించి ఉన్నాడు. అదే మిల్లులో గొల్లప్రోలుకు చెందిన రత్నం అనే మహిళ పని చేస్తోంది. ఆమె క్లీనర్ వివరాలు ఆరా తీసింది. తన పేరు శ్రీను అని ఆ యువకుడు చెప్పాడు.
ఇదిలా ఉండగా, గొల్లప్రోలు కమ్మరశాల వీధికి చెందిన దౌడూరి నాగేశ్వర్రావు, రమణ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు శ్రీను మానసిక వైకల్యంతో బాధపడేవాడు. 15 ఏళ్ల వయసులో 2007 అక్టోబర్ 8న భారీ వర్షాల సమయంలో అతడు ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయాడు.అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసి, పలుచోట్ల వెతికినా ఫలితం లేకపోయింది. నాగేశ్వరరావు దంపతులతో రైస్ మిల్లులో పని చేస్తున్న రత్నానికి గతంలో పరిచయం ఉంది. వారి కుమారుడు శ్రీను తప్పిపోయిన విషయం ఆమెకు తెలుసు. శ్రీనును లారీ క్లీనర్ పోలి ఉండడం.. అతడి పేరు కూడా ‘శ్రీను’ అనే చెప్పడంతో ఆమె ఈ విషయాన్ని నాగేశ్వరరావుకు తెలిపింది.
దీంతో అక్కడకు చేరుకున్న నాగేశ్వరరావు దంపతులు లారీ క్లీనర్‌గా ఉన్న యువకుడు తప్పిపోయిన తమ కొడుకు శ్రీనేనని నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని వారు గొల్లప్రోలు పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు ఆ యువకుడిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా లారీ డ్రైవర్ ద్వారా విషయం తెలుసుకున్న తాళ్లరేవు మండలం చిన్నవలసలు గ్రామానికి చెందిన పెనుపోతుల ప్రసాద్, భవానీ దంపతులు కూడా గొల్లప్రోలు స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ యువకుడు తమ కుమారుడేనని, తమ ఇంట్లోనే ఉంటున్నాడని వారు చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు.
తమకు ముగ్గురు కుమారులు కాగా, ఇతడు పెద్ద కుమారుడని, పేరు వర్మ అని ప్రసాద్ దంపతులు చెప్పారు. తమ రేషన్ కార్డులో ఉన్న అతడి వివరాలను పోలీసులకు చూపించారు. ఇరు కుటుంబాల వాదనల నేపథ్యంలో పోలీసులు ఆ యువకుడిని కూడా విచారించారు. ఇరువైపుల వారూ తన తల్లిదండ్రులేనని అతడు బదులు చెప్పడంతో వారు తలలు పట్టుకున్నారు.
‘నీ పేరు ఏమిటి?’ అని అడిగితే ఒకసారి శ్రీను అని, మరోసారి వర్మ అని ఆ యువకుడు చెబుతుండడంతో అయోమయానికి గురయ్యారు. ఇరు కుటుంబాల వారినీ పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉందని ఎస్సై ఎన్‌ఎస్ నాయుడు తెలిపారు. అవసరమైతే డీఎన్‌ఏ పరీక్ష చేయిస్తామన్నారు. కాగా ఇరు కుటుంబాల బంధువుల తాకిడితో పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా వాతావరణం నెలకొంది.