మామిడి తోటకు కాపలా వెళ్లి.. తెల్లవారుజామున ఇంటికి నడుచుకుంటూ వస్తున్న ఇద్దరు రైతులను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు వీరిని ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఇద్దరి మృతితో ఇల్లూరులో విషాదఛాయలు అలుముకున్నాయి.
గార్లదిన్నె: గుడ్డాలపల్లి క్రాస్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. గార్లదిన్నె మండలం ఇల్లూరుకు చెందిన రైతులు ఎరికిల ఆంజనేయులు(62) మాల ఓబిలేసు (37) మరో నలుగురు కలిసి తిమ్మంపేట సమీపంలోని సుంకిరెడ్డి తోటలో మామిడికాయలు కోసుకునేందుకు లీజుకు తీసుకున్నారు. రోజూ రాత్రి, పగలు ఇద్దరు చొప్పున తోటకు కాపలాగా ఉండేవారు. శుక్రవారం కాపలా విధుల్లోకి వచ్చిన ఆంజనేయులు, ఓబులేసు శనివారం తెల్లవారుజామున ఇంటికి బయల్దేరారు. గుడ్డాలపల్లి క్రాస్ సమీపాన 44వ నంబరు జాతీయ రహదారి పక్కనే ఉన్న హోటల్‌లో టీ తాగేందుకు వెళుతున్న సమయంలో కోయంబత్తూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు వీరిని ఢీకొంది. దీంతో ఇద్దరూ పైకి ఎగిరి రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందారు.
సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ
సమాచారం అందిన వెంటనే సీఐ శివనారాయణస్వామి ఎస్‌ఐ రామ్‌ప్రసాద్, సిబ్బందితో ప్రమాదస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పరిశీలించి, ప్రమాదం జరిగిన తీరుపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. మృతుడు ఆంజనేయులుకు భార్య రామక్క, ఇద్దరు కొడుకులు, కుమార్తె ఉన్నారు. మరో మృతుడు ఓబిలేసుకు భార్య మాలశ్రీ ఆరు నెలల పాప ఉంది.
దేవుడా ఎంతపని చేశావయ్యా..?
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు ఒకేసారి మృతి చెందడంతో ఇల్లూరు గ్రామంలో విషాదం అలుముకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలు స్వగ్రామానికి చేరగానే కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో మిన్నంటింది. ఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో రెండు కుటుంబాలూ వీధినపడ్డాయి. ‘దేవుడా ఎంతపని చేశావయ్యా? కూలి పనులు చేసుకుని జీవనం సాగించే మాకు ఎంత శిక్ష విధించావయ్యా’ అంటూ మృతదేహాలపై పడి భార్యా, పిల్లలు రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment