యాలాల, న్యూస్‌లైన్: విద్యుత్ స్తంభాలు తరలిస్తున్న ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ఇద్దరు రైతులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు రైతులు గాయపడ్డారు. మృతుల కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది. ఈ సంఘటన మండల పరిధిలోని ఎన్కెపల్లి స్టేజీ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. క్షతగాత్రులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
యాలాల మండల పరిధిలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన సుమారు 20 మంది రైతులు విద్యుత్ స్తంభాల కోసం నాలుగు ట్రాక్టర్లలో బషీరాబాద్ మండలం నవల్గా సబ్‌స్టేషన్‌కు ఆదివారం ఉదయం వెళ్లారు. సబ్‌స్టేషన్ నుంచి 9 విద్యుత్ స్తంభాలను ట్రాక్టర్లలో వేసుకొని సాయంత్రం స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. కాగా నాలుగు ట్రాక్టర్లలో రెండేసి స్తంభాలు ఉండగా కావలి బుగ్గప్ప(45), అప్పరిగిరి ఆశన్న(50), మడిగె ఎల్లప్ప, రమేష్‌లు ఉన్న ట్రాక్టర్‌లో మూడు స్తంభాలు వేసుకున్నారు. మార్గంమధ్యలో ఎన్కెపల్లి గేటు సమీపంలోని దర్గా వద్ద వాహనం డ్రైవర్ అశోక్ ట్రాక్టర్‌ను అదుపు చేయకపోవడంతో ట్రాలీ బోల్తా పడింది. దీంతో అందులో ఉన్న నలుగురు రైతులు రోడ్డుపై పడిపోయారు.
ప్రమాదంలో బుగ్గప్ప తలకు బలమైన గాయమై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఆశన్న, ఎల్లప్పకు తీవ్ర గాయాలవగా రమేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆశన్న పరిస్థితి విషమంగా ఉండటం తో ఇక్కడి వైద్యులు నగరానికి రిఫర్ చేశారు. కుటుంబసభ్యులు తాండూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా సాయంత్రం 6 గంటల సమయంలో ఆశన్న మృతిచెందాడు. ఎల్లప్ప పరిస్థితి విషమంగా ఉండటంతో నగరానికి తరలించారు. బుగ్గప్పకు భార్య దేవమ్మతో పాటు కొడుకులు అశోక్, రవి, అనిల్, కూతుళ్లు మంజుల, వసుంధర ఉన్నారు. ఆశన్నకు భార్యలు పద్మమ్మ, ఆశమ్మలతో పాటు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉంది. విద్యుత్ స్తంభాలు తీసుకొచ్చేందుకు వెళ్లిన రైతులు ఇద్దరు మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. బుగ్గప్ప, ఆశన్నల మృతితో కుటుంబీకులు గుండెలుబాదుకుంటూ రోదిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ స్తంభాల కోసం వెళ్లి...కానరాని లోకాలకు
Published Mon, Dec 16 2013 2:04 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement