పుణ్యస్నానానికి పోతే..
* ఏలేరు కాలువలో మునిగి ఇద్దరు మృతి
* మరో ఇద్దరిని కాపాడిన అయ్యప్ప భక్తుడు
* పరవాడపాలెంలో విషాదం
కశింకోట: పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్లి ఏలేరు కాలువలో మునిగి ఇద్దరు బాలికలు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు బయట పడ్డారు. విషాదకరమైన ఈ దుర్ఘటన కశింకోట మండలం పరవాడపాలెంలో ఆదివారం వేకువజామున చోటు చేసుకొంది. స్థానికుల వివరాల ప్రకారం... మండలంలోని పరవాడపాలేనికి చెందిన సుమారు వంద మంది మహిళలు పోలిపాడ్యమి స్నానాలకు గ్రామాన్ని ఆనుకొని ఉన్న ఏలేరు కాలువకు ఆదివారం వేకువ జామున 3.30 గంటలప్పుడు వెళ్లారు. కాలువలో స్నానాలు ఆచరిస్తూ తమ్మిన సాయిలక్ష్మి(15), కరక నాగమ్మ (14), ముక్కుర్తి రాధ (15) లోతులోకి జారి మునిగిపోయారు. బయటకు తేలియాడుతూ కనిపించిన రాధను సమీపంలో ఉన్న పరవాడ పరమేశ్వరి (25) బయటకు పుణ్యస్నానానికి పోతే..
తీయడానికి ప్రయత్నించింది. అయితే భయంతో రాధ ఆమె కాళ్లుపట్టుకొని వేలాడడంతో ఇద్దరూ కాలువలో పడిపోయి మునిగిపోయారు. పెద్ద పెట్టున కేకలు పెట్టారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన అయ్యప్ప భక్తుడు పందిరి కొండలరావు రాధ,పరమేశ్వరిలను రక్షించారు. స్పృహ కోల్పోయిన రాధకు సపర్యలు చేయడంతో తేరుకొంది. తనతోపాటు సాయిలక్ష్మి, నాగమ్మలు కూడా కాలువలో మునిగిపోయినట్లు చెప్పింది. వారి కోసం స్థానికులు గాలించగా మృతదేహాలు బయట పడ్డాయి. తాళ్లపాలెం ఉన్నతపాఠశాలలో సాయిలక్ష్మి పదో తరగతి, నాగమ్మ తొమ్మిదో తరగతి చదువుతున్నారు.
ఒంటరయిన సాయిలక్ష్మి తల్లి రాజులమ్మ
సాయిలక్ష్మి తల్లి రాజులమ్మ భర్తకు దూరంగా ఉంటూ కూలీ పని చేసుకుని కుమార్తెను కష్టపడి చదివిస్తోంది. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని కోల్పోయి ఒంటరిదయింది. ఇప్పుడామె కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఇది చూపరులను కంట తడిపెట్టించింది. ఇక నాగమ్మ తమ తల్లిదండ్రులకు మూడో కుమార్తె. తండ్రి అచ్చెన్న మేకలు మేపుతుంటారు. తల్లి లక్ష్మి కూలి పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం అయింది. తనకు ఇంటి పనుల్లో సాయంగా నిలిచే అంది వచ్చిన మూడో కుమార్తె రాధ మృతిని వారు జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమవుతున్నారు.
కాలువలో ఎక్కువ నీరు చేరడం వల్లే..: స్నానాలు ఆచరించడానికి ఏలేరు కాలువ అనువుగా లేదు. సుమారు పది అడుగులు లోతు ఉంటుంది. మూడు రోజుల క్రితం వరకు నీటి మట్టం తక్కువగా ఉండేది. ఇటీవల పెరిగింది. ఇదే ప్రమాదానికి కారణమైందని స్థానికులు పేర్కొంటున్నారు. కార్తీక మాసంలో రోజూ ఇంటి వద్ద బోర్లు,బావుల నీటితో స్నానాలు ఆచరించే వారంతా పోలిపాడ్యమి పుణ్యమైన రోజు కావడంతో పవిత్రమైన గోదావరి నీరు ప్రవహించే ఏలేరు కాలువలో స్నానానికి అంతా వెళ్లారు. వేకువ జాము కావడం, చీకటిగా ఉండటంతో దురదృష్ట వశాత్తు ఇద్దరు బాలికలు కాలువలో మునిగి చనిపోయారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. తహశీల్దార్ కె.రమామణి, ఎస్.ఐ. టి.వి. విజయకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.