Eleru canal
-
బాధలు వింటూ.. భరోసానిస్తూ..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఏలేరు వరద ముంపుతో కుళ్లిపోయిన వరి కంకులతో కన్నీరు పెట్టుకుంటూ ఎదురొచ్చిన రైతుల కష్టాలు చూసిన వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. రైతుల్లో మనో ధైర్యాన్ని కల్పించారు. పిఠాపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో రైతులు, బాధితులను పరామర్శించి తాను ఉన్నానంటూ వారికి భరోసా ఇచ్చారు. బాధితులు, రైతులను జగన్ అక్కున చేర్చుకున్నారు. ఉదయం 10.30 గంటలకు పిఠాపురం వచ్చిన ఆయనకు బాధితులు, రైతులు దారి పొడవునా నిలబడి గోడు వెళ్లబోసుకొన్నారు. ‘మా పంటలు మునిగిపోయాయి. మీరే దిక్కు’ అంటూ రైతులు అడుగడుగునా ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో 12.45 గంటలకు ముగియాల్సిన పర్యటన సాయంత్రం 5 గంటల వరకు సాగింది. మాధవాపురం, పాత ఇసుకపల్లి, నాగులాపల్లి, రమణక్కపేటలో వరదలతో మునిగి ఉన్న కాలనీలను, పంటలను పరిశీలించారు. ప్రతి గ్రామంలో రెండు గంటలు పర్యటన సాగింది. భోజన విరామం కూడా తీసుకోకుండా ప్రతి ఒక్కరి బాధలను జగన్ సావధానంగా ఆలకించారు. ముంపు ప్రాంతాల్లో నీళ్లలో నడుచుకుంటూనే గ్రామాల్లో కలియదిరిగి బాధితులతో మాట్లాడారు. కళ్లెదుటే రెక్కల కష్టం గంగపాలైందని, ఇప్పట్లో తేరుకోలేమని, ప్రభుత్వం తమను ఆదుకొనే తీరులో లేదని, తమ తరఫున పోరాడాలని రైతులు మొరబెట్టుకున్నారు. నాగులపల్లి–రమణక్కపేట రహదారి మునిగిపోవడంతో వైఎస్ జగన్ ట్రాక్టర్‌పై పెదయేరు దాటి రమణక్కపేట వెళ్లారు. అక్కడి ఎస్సీ కాలనీని పరిశీలించి, బాధితులతో మాట్లాడారు. వరద నీటిలోనే ఈదుకుంటూ వచ్చి మరీ జగన్‌కు సమస్యలు విన్నవించుకున్నారు. గతంలో అధికారులే వచ్చి పంటలు చూసి, నష్ట పరిహారం అడగకుండానే ఖాతాల్లో వేసేవారని, ఇప్పుడా పరిస్థితి లేదని, ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరానికి రూ. 30 వేలు పెట్టుబడి అయిందని, పంటంతా కుళ్లిపోయిన చేతికి పైసా రాదని మాధవపురం సర్పంచి వెంకట సుబ్బారావు వైఎస్ జగన్‌కు వివరించారు. ‘మీరు సీఎంగా ఉన్నప్పుడు రూపాయి ప్రీమియం కూడా చెల్లించకుండానే బీమా వచ్చేది. వరద వచ్చిన రోజునే రూ.6,000 ఖాతాల్లో పడేవి. రైతు భరోసా కింద ఎకరానికి రూ.13,500 పడేది. ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. మీరే కాపాడాలి’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడతానని వైఎస్ జగన్ ఆయనకు ధైర్యం చెప్పారు. తిన్నావా అని అడిగే వారే లేరు మూడు రోజులు వరదలో మునిగిపోయి పట్టెడన్నం కూడా లేదని, తిన్నావా అని అడిగే వారే లేరంటూ మాధవపురం సెంటర్లో గృహిణి విత్తనాల లక్ష్మి విలపించింది. వైఎస్ జగన్‌ను చూడగానే ఆమెలో దుఃఖంపెల్లుబికింది. ‘మా కాలనీని ఏలేరు వరద ముంచెత్తి ఇళ్లన్నీ నీట మునిగాయి. బయటకు రావడానిక్కూడా లేదు, మూడు రోజులుగా ఇంట్లోనే ఉండిపోయాం. ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం ఉన్నారా తిన్నారా అని అడిగిన వారు లేరు. చంటి పిల్లలకూ తిండి లేదు. మీరు వస్తున్నారని తెలిశాక కొండంత ధైర్యం వచ్చి0ది, మీరే దిక్కు’ అని విలపించడంతో జగన్ చలించిపోయారు. ఆమెకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పి, వారి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తానని చెప్పారు. -
మేనల్లుడికి పోటీ‘యేలేరు’!
ఏలేరు కాలువ పనుల్లో అవినీతి ప్రవాహం ప్రభుత్వ పెద్ద మేనల్లుడి కళ్లలో ఆనందమే లక్ష్యం అందుకోసం ఐదు ముక్కలుగా పనుల విభజన తెర వెనుక మంత్రాంగం నెరుపుతున్న జీవీఎంసీ అధికారి రూ.3 కోట్ల ఈ పనులకు పోటీ రావద్దని కాంట్రాక్టర్లకు హుకుం ఏలేరు కాలువ నిర్వహణ.. ఈ పనులను ఎప్పటినుంచో రెండు భాగాలు (ప్యాకేజీలు)గా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. అయితే ఈ ఏడాది దాన్ని మూడు ముక్కలు చేశారు... అంతేనా వచ్చే ఏడాదికి ఐదు ముక్కలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఇలా ముక్కలు చేయడం వెనుక మతలబేంటంటే.. నగరానికి చెందిన ఓ ప్రభుత్వ పెద్ద మేనల్లుడికి మేలు చేయడమే! ఇప్పటికే రూ.కోటి విలువైన పనులను ‘గిఫ్ట్’గా కొట్టేసిన ఆయనగారికి మరింత పెద్ద మొత్తం మేలు చేయడమే ఈ మంత్రాంగం లక్ష్యం. విశాఖపట్నం: ఏలేరు కాలువ నిర్వహణ పనుల్లో ఓ ప్యాకేజీని ప్రభుత్వ పెద్ద మేనల్లుడికి గిఫ్ట్‌గా ఇచ్చేసిన అధికారులు.. తాజాగా అదనపు మేలు చేకూర్చే ప్రయత్నాల్లో పడ్డారు. ఈ పనులను ఎన్నో ఏళ్ల నుంచి రెండు ప్యాకేజీల కింద చేస్తూ వచ్చారు. రూ.2.50 కోట్ల విలువైన ఈ పనులపై ప్రభుత్వ పెద్ద మేనల్లుడి కన్ను పడింది. అయితే చిన్న కాంట్రాక్టరైన ఆయనకు పెద్ద పనులు చేసే అర్హత లేదు. కానీ ‘మేనల్లుడి’ కళ్లలో ఆనందం కోసం ప్రభుత్వ పెద్ద జీవీఎంసీ ఉన్నతాధికారులతో మంతనాలు జరిపి ‘దిశా నిర్దేశం’ చేశారు. అంతే కాలువ నిర్వహణ పనులను రెండు ప్యాకేజీల నుంచి మూడు ప్యాకేజీలుగా ముక్కలు చేసేశారు. వాటిలో ఒక ప్యాకేజీని ‘మేనల్లుడి’కి ఏకపక్షంగా కట్టబెట్టేశారు. ఆ పనులను ఏడాదిగా ఎంజాయ్ చేస్తున్నప్పటికీ మేనల్లుడు సంతృప్తి చెందలేదు. పైగా ఈ డిసెంబర్ 31తో కాంట్రాక్టు గడువు ముగుస్తుండటంతో మళ్లీ టెండర్లు పిలవాలి. ఇదే అదనుగా మరింత విలువైన పనులను ఏకపక్షంగా దక్కించుకోవాలని భావించారు. పోటీకి రావద్దు ఈసారి ఏలేరు కాలువ నిర్వహణ పనుల విలువ రూ.3 కోట్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. పనిలో పనిగా ప్రభుత్వ పెద్ద మేనల్లుడికి గరిష్ట ప్రయోజనం కలిగేలా మూడు ప్యాకేజీలుగా ఉన్న పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించాలని నిర్ణయించారు. మొత్తం పనులను ఇద్దరు కాంట్రాక్టర్లకే ధారదత్తం చేయాలని నిర్ణయించారు. అలా చేస్తేనే ప్రభుత్వ పెద్ద సమీప బంధువుకు రూ.కోటిన్నర కాంట్రాక్టు కట్టబెట్టవచ్చన్నది పన్నాగం. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం జీవీఎంసీ అధికారి ఒకరు కాంట్రాక్టర్లతో అనధికారికంగా ఓ సమావేశం నిర్వహించారు. ఏలేరు కాలువ నిర్వహణ టెండర్లు త్వరలో పిలవనున్న విషయాన్ని వెల్లడిస్తూనే.. వాటి కోసం ఎవరూ టెండర్లు వేయరాదని తేల్చి చెప్పేశారు. ఆ కాంట్రాక్టు తన మేనల్లుడికి వదిలేయాలని ప్రభుత్వ పెద్ద చెప్పారని కూడా వివరించారు. దీనిపై ఒకరిద్దరు కాంట్రాక్టర్లు అభ్యంతరం తెలిపారు. కానీ వారికి ఇతరత్రా కాంట్రాక్టుల్లో సర్దుబాటు చేస్తామని ఏలేరు పనుల జోలికి మాత్రం రావద్దని దాదాపు హుకుం జారీ చేశారు. దాంతో చేసేదేమి లేక వారు సమావేశం నుంచి నిష్ర్కమించారు. కొసమెరుపు ఏమిటంటే.. తన కోసం ఇంత చేసిన సదరు అధికారికి ఆ ‘మేనల్లుడు’ ఖరీదైన వాహనాన్ని కానుకగా ఇచ్చి ఖుషీ చేశారుట... అదీ సంగతి! -
నీరు పారదు.. సాగు సాగదు
పిఠాపురం : రబీ సాగుకు పుష్కలంగా నీరందిస్తామన్న అధికారుల మాట నీటిమూటే అయింది. అవసరానికి నీరందక ఏలేరు ఆయకట్టు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కలుపుతీతల సమయం వచ్చినా.. పలుచోట్ల నాట్లే పడలేదు. మరోపక్క ఎదిగిన వరినారు.. నీరు లేక నాట్లు ఆలస్యమవడంతో ముదిరి పనికి రాకుండా పోతోంది. ఇప్పటికే నాట్లు పడ్డ చేలు అంతంత మాత్రంగా అందుతున్న నీటితో ఎండిపోయే స్థితి దాపురించింది. ఈ ఏడాది ఖరీఫ్ సాగును అతికష్టం మీద గట్టెక్కిన రైతులకు రబీలో ఆది నుంచే సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఏలేరు కింద ఆయకట్టులో కొంత శాతం నాట్లు వేసినా నీరందక ఎండిపోతున్నాయి. మిగిలిన ఆయకట్టులో నాట్లు పడని పరిస్థితి నెలకొంది. పిఠాపురం మండలంలో బి.ప్రత్తిపాడు, భోగాపురం, రాపర్తి, రాయవరం, పి.తిమ్మాపురం, వెల్దుర్తి, పి.దొంతమూరు, గోకివాడ, మంగితుర్తి, కోలంక తదితర గ్రామాల పరిధిలో పల్లపు భూములతో పాటు మెట్ట ఆయకట్టు ఉంది. ఏలేరు పరిధిలో 15 వేల ఎకరాల్లో, చెరువుల కింద 7వేల ఎకరాల్లో వరి వేస్తున్నారు. గొల్లప్రోలు, కొత్తపల్లి, మండలాల్లోనూ ఏలేరుపై ఆధారపడి నాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే నాట్లుపడిన పొలాలకే నీటి ఎద్దడి ఎదురవగా మిగిలిన ప్రాంతంలో సుమారు 1500 ఎకరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఏలేరు కాలువ అధ్వానస్థితిలో ఉండడం వల్ల నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని, భారీవర్షాలు కురిస్తే తప్ప సాగునీటి కష్టాలు గట్టెక్కే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. వర్షాలు అధికంగా పడక పోతే ఏలేరు ఆయకట్టు కింద రబీ సాగు సగానికి పైగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏటా రూ.కోట్ల పంటనష్టం నాలుగు మండలాల్లో సాగుకు ఆధారమైన ఏలేరు ఆధునికీకరణ ఈ ఏడాది కూడా అటకెక్కింది. ఏలేరు కాలువలో పూడిక తీయకపోవడంతో గుర్రపుడెక్కతో నిండిపోయింది. దీంతో ఏలేరు ద్వారా కేవలం అరకొర నీరు మాత్రమే వస్తోంది. అయినా నీటిపారుదల శాఖాధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఏటా సాగు నీరందక ఏలేరు రైతాంగం రూ.కోట్ల విలువైన పంటను నష్టపోతున్నా శాశ్వత చర్యలు తీసుకోవడంలో పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. వర్షాలు కురవకపోయినా కాలువ నిండా నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటే సాగుకు ఇబ్బందులు ఉండవని, అయితే అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి, సాగునీరు సక్రమంగా అందేలా చూడాలని కోరుతున్నారు. పుష్కరాలకు తొలి ప్రాధాన్యం రాజమండ్రి సిటీ : పుష్కరాలకు తొలి ప్రాధాన్యమిచ్చి, విజయవంతమయ్యేందుకు పారదర్శకంగా కృషి చేస్తానని నగర పాలక సంస్థ కొత్త కమిషనర్ జె.మురళి చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఆర్అండ్ బి అతిథిగృహంలో ఆయన ఇప్పటి వరకూ కమిషనర్‌గా ఉన్న రవీంద్రబాబు నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న నాలుగు నెలల కాలాన్ని పుష్కరాలకే వెచ్చిస్తానన్నారు. కాగా ఉభయ గోదావరి జిల్లాల పుష్కర ప్రత్యేకాధికారిగా జె.మురళిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
పుణ్యస్నానానికి పోతే..
* ఏలేరు కాలువలో మునిగి ఇద్దరు మృతి * మరో ఇద్దరిని కాపాడిన అయ్యప్ప భక్తుడు * పరవాడపాలెంలో విషాదం కశింకోట: పుణ్య స్నానాలు ఆచరించడానికి వెళ్లి ఏలేరు కాలువలో మునిగి ఇద్దరు బాలికలు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు బయట పడ్డారు. విషాదకరమైన ఈ దుర్ఘటన కశింకోట మండలం పరవాడపాలెంలో ఆదివారం వేకువజామున చోటు చేసుకొంది. స్థానికుల వివరాల ప్రకారం... మండలంలోని పరవాడపాలేనికి చెందిన సుమారు వంద మంది మహిళలు పోలిపాడ్యమి స్నానాలకు గ్రామాన్ని ఆనుకొని ఉన్న ఏలేరు కాలువకు ఆదివారం వేకువ జామున 3.30 గంటలప్పుడు వెళ్లారు. కాలువలో స్నానాలు ఆచరిస్తూ తమ్మిన సాయిలక్ష్మి(15), కరక నాగమ్మ (14), ముక్కుర్తి రాధ (15) లోతులోకి జారి మునిగిపోయారు. బయటకు తేలియాడుతూ కనిపించిన రాధను సమీపంలో ఉన్న పరవాడ పరమేశ్వరి (25) బయటకు పుణ్యస్నానానికి పోతే.. తీయడానికి ప్రయత్నించింది. అయితే భయంతో రాధ ఆమె కాళ్లుపట్టుకొని వేలాడడంతో ఇద్దరూ కాలువలో పడిపోయి మునిగిపోయారు. పెద్ద పెట్టున కేకలు పెట్టారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన అయ్యప్ప భక్తుడు పందిరి కొండలరావు రాధ,పరమేశ్వరిలను రక్షించారు. స్పృహ కోల్పోయిన రాధకు సపర్యలు చేయడంతో తేరుకొంది. తనతోపాటు సాయిలక్ష్మి, నాగమ్మలు కూడా కాలువలో మునిగిపోయినట్లు చెప్పింది. వారి కోసం స్థానికులు గాలించగా మృతదేహాలు బయట పడ్డాయి. తాళ్లపాలెం ఉన్నతపాఠశాలలో సాయిలక్ష్మి పదో తరగతి, నాగమ్మ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఒంటరయిన సాయిలక్ష్మి తల్లి రాజులమ్మ సాయిలక్ష్మి తల్లి రాజులమ్మ భర్తకు దూరంగా ఉంటూ కూలీ పని చేసుకుని కుమార్తెను కష్టపడి చదివిస్తోంది. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కూతుర్ని కోల్పోయి ఒంటరిదయింది. ఇప్పుడామె కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఇది చూపరులను కంట తడిపెట్టించింది. ఇక నాగమ్మ తమ తల్లిదండ్రులకు మూడో కుమార్తె. తండ్రి అచ్చెన్న మేకలు మేపుతుంటారు. తల్లి లక్ష్మి కూలి పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహం అయింది. తనకు ఇంటి పనుల్లో సాయంగా నిలిచే అంది వచ్చిన మూడో కుమార్తె రాధ మృతిని వారు జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమవుతున్నారు. కాలువలో ఎక్కువ నీరు చేరడం వల్లే..: స్నానాలు ఆచరించడానికి ఏలేరు కాలువ అనువుగా లేదు. సుమారు పది అడుగులు లోతు ఉంటుంది. మూడు రోజుల క్రితం వరకు నీటి మట్టం తక్కువగా ఉండేది. ఇటీవల పెరిగింది. ఇదే ప్రమాదానికి కారణమైందని స్థానికులు పేర్కొంటున్నారు. కార్తీక మాసంలో రోజూ ఇంటి వద్ద బోర్లు,బావుల నీటితో స్నానాలు ఆచరించే వారంతా పోలిపాడ్యమి పుణ్యమైన రోజు కావడంతో పవిత్రమైన గోదావరి నీరు ప్రవహించే ఏలేరు కాలువలో స్నానానికి అంతా వెళ్లారు. వేకువ జాము కావడం, చీకటిగా ఉండటంతో దురదృష్ట వశాత్తు ఇద్దరు బాలికలు కాలువలో మునిగి చనిపోయారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. తహశీల్దార్ కె.రమామణి, ఎస్.ఐ. టి.వి. విజయకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.