పిఠాపురం :
రబీ సాగుకు పుష్కలంగా నీరందిస్తామన్న అధికారుల మాట నీటిమూటే అయింది. అవసరానికి నీరందక ఏలేరు ఆయకట్టు రైతులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కలుపుతీతల సమయం వచ్చినా.. పలుచోట్ల నాట్లే పడలేదు. మరోపక్క ఎదిగిన వరినారు.. నీరు లేక నాట్లు ఆలస్యమవడంతో ముదిరి పనికి రాకుండా పోతోంది. ఇప్పటికే నాట్లు పడ్డ చేలు అంతంత మాత్రంగా అందుతున్న నీటితో ఎండిపోయే స్థితి దాపురించింది. ఈ ఏడాది ఖరీఫ్ సాగును అతికష్టం మీద గట్టెక్కిన రైతులకు రబీలో ఆది నుంచే సాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఏలేరు కింద ఆయకట్టులో కొంత శాతం నాట్లు వేసినా నీరందక ఎండిపోతున్నాయి. మిగిలిన ఆయకట్టులో నాట్లు పడని పరిస్థితి నెలకొంది. పిఠాపురం మండలంలో బి.ప్రత్తిపాడు, భోగాపురం, రాపర్తి, రాయవరం, పి.తిమ్మాపురం, వెల్దుర్తి, పి.దొంతమూరు, గోకివాడ, మంగితుర్తి, కోలంక తదితర గ్రామాల పరిధిలో పల్లపు భూములతో పాటు మెట్ట ఆయకట్టు ఉంది. ఏలేరు పరిధిలో 15 వేల ఎకరాల్లో, చెరువుల కింద 7వేల ఎకరాల్లో వరి వేస్తున్నారు. గొల్లప్రోలు, కొత్తపల్లి, మండలాల్లోనూ ఏలేరుపై ఆధారపడి నాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే నాట్లుపడిన పొలాలకే నీటి ఎద్దడి ఎదురవగా మిగిలిన ప్రాంతంలో సుమారు 1500 ఎకరాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
ఏలేరు కాలువ అధ్వానస్థితిలో ఉండడం వల్ల నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని, భారీవర్షాలు కురిస్తే తప్ప సాగునీటి కష్టాలు గట్టెక్కే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. వర్షాలు అధికంగా పడక పోతే ఏలేరు ఆయకట్టు కింద రబీ సాగు సగానికి పైగా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏటా రూ.కోట్ల పంటనష్టం
నాలుగు మండలాల్లో సాగుకు ఆధారమైన ఏలేరు ఆధునికీకరణ ఈ ఏడాది కూడా అటకెక్కింది. ఏలేరు కాలువలో పూడిక తీయకపోవడంతో గుర్రపుడెక్కతో నిండిపోయింది. దీంతో ఏలేరు ద్వారా కేవలం అరకొర నీరు మాత్రమే వస్తోంది. అయినా నీటిపారుదల శాఖాధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఏటా సాగు నీరందక ఏలేరు రైతాంగం రూ.కోట్ల విలువైన పంటను నష్టపోతున్నా శాశ్వత చర్యలు తీసుకోవడంలో పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. వర్షాలు కురవకపోయినా కాలువ నిండా నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటే సాగుకు ఇబ్బందులు ఉండవని, అయితే అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి, సాగునీరు సక్రమంగా అందేలా చూడాలని కోరుతున్నారు.
పుష్కరాలకు
తొలి ప్రాధాన్యం
రాజమండ్రి సిటీ : పుష్కరాలకు తొలి ప్రాధాన్యమిచ్చి, విజయవంతమయ్యేందుకు పారదర్శకంగా కృషి చేస్తానని నగర పాలక సంస్థ కొత్త కమిషనర్ జె.మురళి చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ఆర్‌అండ్ బి అతిథిగృహంలో ఆయన ఇప్పటి వరకూ కమిషనర్‌గా ఉన్న రవీంద్రబాబు నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న నాలుగు నెలల కాలాన్ని పుష్కరాలకే వెచ్చిస్తానన్నారు. కాగా ఉభయ గోదావరి జిల్లాల పుష్కర ప్రత్యేకాధికారిగా జె.మురళిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.