‘భారీ’ష్‌! | heavy rains in medak dist | Sakshi
Sakshi News home page

‘భారీ’ష్‌!

Published Wed, Sep 14 2016 9:25 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

heavy rains in medak dist

తడిసిముద్దయిన మెతుకు సీమ
జిల్లావ్యాప్తంగా 55.8 మిల్లీమీటర్ల వర్షపాతం
వెల్దుర్తిలో అత్యధికంగా 15 సెం.మీ వర్షం
నిండిన నారింజవాగు.. చెరువులు, కుంటల్లోని నీరు
పలుచోట్ల పాక్షికంగా కూలిన ఇళ్లు
వర్షాధార పంటలకు మేలు, రబీ సాగుకు ఊతం

సాక్షి, సంగారెడ్డి: భారీగా కురుస్తున్న వర్షాలతో మెతుకుసీమ తడిసిముద్దయింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో చెరువులు, కుంటల్లో వర్షం నీరు వచ్చి చేరింది. జహీరాబాద్‌లోని నారింజవాగు నిండగా.. వాగు పరివాహక ప్రాంతాల్లోని పొలాలు మునిగిపోయాయి.

బుధవారం జిల్లావ్యాప్తంగా 55.8 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కాగా.. వెల్దుర్తిలో అత్యధికంగా 15 సెం.మీ, నర్సాపూర్‌లో 11.4 సెం.మీ వర్షంకురిసింది. భారీ వర్షాల కారణంగా వెల్దుర్తి, రామాయంపేట, మెదక్‌లోని పలుచోట్ల ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి. కోహీర్‌ మండలం పైడిగుమ్మల్‌ గ్రామంలో వర్షం ధాటికి చావిడి కూలి రాజయ్య గాయపడ్డాడు.

వర్షాధార పంటలకు మేలు
వర్షాల వల్ల ఖరీఫ్‌లో సాగుచేసిన వర్షాధార పంటలకు మేలు జరుగుతుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. జొన్న, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి పంటలకు మేలు జరగనుంది. అదేవిధంగా చెరకు, వరి, అల్లం పంటలు వర్షంతో ఎదుగుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రబీకి సిద్ధమయ్యే వారికి ప్రస్తుత వర్షాలు మేలు చేయనున్నాయి. మెదక్‌లోని కొంటూరు, రాయినిపల్లి ప్రాజెక్టు, సమ్నాపూర్, కూచన్‌పల్లి చెరువుల్లోకి వర్షం నీరు వచ్చి చేరింది. మెదక్‌ పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి ఆవరణలో ఇల్లు కూలింది. రామాయంపేటలో ఏడు ఇళ్లు పాక్షికంగా.. తూప్రాన్‌లో 18, వెల్దుర్తి మండంలంలో 12 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌
వర్షం కారణంగా పటాన్‌చెరు మండలం బీరంగూడ సమీపంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. జోగిపేట పట్టణంలోని ప్రధాన రహదారి నిండిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మెదక్‌ డివిజన్‌లో అత్యధికం
నర్సాపూర్‌ ప్రాంతంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లావ్యాప్తంగా 55 మి.మీ వర్షపాతం నమోదు కాగా మెదక్‌ డివిజన్‌లో 66.8 మి.మీ, సంగారెడ్డిలో 51.6 మి.మీ, సిద్దిపేటలో 45.4 మి.మీ వర్షం కురిసింది. వెల్దుర్తిలో అత్యధికంగా 15 సెం.మీటర్ల వర్షం కురవగా.. నర్సాపూర్‌లో 11.4, చేగుంట, తొగుటలో 9 సెం.మీ, శివ్వంపేటలో 8.5 సెం.మీటర్ల వర్షం కురిసింది. రాయికోడ్, జహీరాబాద్, అల్లాదుర్గం, చిన్నశంకరంపేట, హత్నూర, జిన్నారం, నంగనూరు, కొండపాక మండలాల్లో 7 సెం.మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. రామచంద్రాపురం, కోహీర్, కొల్చారం, అందోలు, పుల్కల్, దౌల్తాబాద్‌ మండలాల్లో 6 సెం.మీటర్లు వర్షం కురిసింది. కంగ్టి, ఝరాసంగం, సంగారెడ్డి, రేగోడ్‌ మండలాల్లో 5 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement