ఉగ్ర గోదావరి
ఉగ్ర గోదావరి
Published Tue, Sep 27 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
సారంగాపూర్/ధర్మపురి/ఇబ్రహీంపట్నం/జగిత్యాల రూరల్/ బసంత్‌నగర్/మంథని/కాళేశ్వరం: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టునుంచి గేట్లు ఎత్తివేయడంతో దిగువకు ఒక్కసారిగా వరదనీరు వచ్చి చేరుతోంది. లోతట్టు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ధర్మపురి, కాళేశ్వరం, మంథని ప్రాంతాల్లోనూ గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. ప్రధాన ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.
సారంగాపూర్ మండలంలో గోదావరి ఉధృతి మంగళవారం మధ్యాహ్నం 12గంటల వరకు పెరిగి ఆ తర్వాత తగ్గింది. రాయికల్ మండలం బోర్నపెల్లిలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టునుంచి గేట్లు ఎత్తివేయడంతో నీరు పుష్కరఘాట్‌లోని షవర్ల వద్దకు చేరింది. వరదనీటితో ఒడ్డున ఉన్న పత్తిపంట నీట మునిగింది. ఎస్సారెస్పీ నీటితో ధర్మపురిలోని పుష్కరఘాట్లతోపాటు సంతోషిమాత ఆలయంలోకి నీరు చేరింది. శ్రాద్ధ మండపం సగం మునిగింది. ఎస్సారెస్పీ నుంచి 3.50లక్షల క్యూసెక్కుల నీటిని వదలడంతో రాయపట్నం వంతెన వద్ద నీటి ఉధృతి పెరిగింది. భక్తులను స్నానాలకు అనుమతించలేదు. ధర్మపురిలోని తెనుగువాడలో ఉన్న వాగు నీటితో పోటెత్తింది. దమ్మన్నపేట, రాజరాం, జైనా గ్రామాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. జగిత్యాల మండలం గోవిందుపల్లి వంతెన, మోతె బ్రిడ్జి, తిమ్మాపూర్ బ్రిడ్జిలపై నుంచి నీరు ప్రవహిస్తోంది. అంతర్గాం ప్రధాన కాలువ వద్ద ఎస్సారెస్పీ ప్రధాన కాలువపైనున్న ఎస్కేప్‌ను ఎత్తడంతో ధరూర్ గ్రామ శివారులో నుంచి తిమ్మాపూర్ గ్రామశివారు వరకు వచ్చే ప్రధాన వాగు భారీగా ప్రవాహం రావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారులు స్పందించి నీటిని నిలిపివేశారు. భారీ వర్షానికి ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి శివారులో మినీ పర్కులేషన్ ట్యాంక్‌కు గండి పడడంతో పొలాలు నీటమునిగాయి. దాదాపు 50ఎకరాల్లో నష్టం వాటిల్లింది.
ఎల్లంపల్లికి కొనసాగుతున్న వరద..
ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఎగువనున్న ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్ట్‌ల గేట్లు ఎత్తి వరద నీటిని వదులుతున్నారు. వస్తున్న వరదకు సమానంగా ప్రాజెక్ట్ నలభై గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 20టీఎంసీలకుగాను మంగళవారం 16.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌కు 4,00,830 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 5,79,018 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతోంది.
పంట పొలాలు మునక
మంథని వద్ద గల గోదావరి నదికి వరద మళ్లీ పోటెత్తింది. మొదటి ప్రమాద హెచ్చరికను దాటి డేంజర్ జోన్‌లో ప్రవహించింది. నదిలోని ఆలయాలు, మండపాలు, స్నానఘట్టాలు పూర్తిగా మునిగిపోయాయి. ఎగువ ప్రాజెక్టుల నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదలచేశారు. దీంతో గోదావరి నది పరివాహక ప్రాంతాల వెంట ఉన్న పంట పొలాల్లోకి నీరు చేరింది. డివిజన్‌లో సుమారు మూడువేల ఎకరాల్లో వరి, పత్తి పంట పొలాలు మునిగిపోయినట్లు ప్రాథమిక సమాచారం. నీట మునిగిన పంట పొలాలను మంథని ఎమ్మెల్యే పుట్ట మధు మంగళవారం పరిశీలించారు. వరద ఉధృతి గంటగంటకు పెరుగుతుండడంతో పోలీసులు సందర్శకులకు గోదావరి వద్దకు అనుమతి నిలిపివేశారు. కొద్ది దూరంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి నది వైపు వెళ్లనీయడం లేదు.
కాళేశ్వరం వద్ద..
కాళేశ్వరం వద్ద గోదావరినది ఉగ్రరూపం దాల్చింది. గోదావరి ఎగువన పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తిడంతో మంగళవారం కాళేశ్వరం వద్ద నీటిమట్టం భారీగా పెరిగింది. సాయంత్రంవరకు గోదావరి నీటిమట్టం 9.90 మీటర్ల మేర పెరిగి ప్రవహిస్తోంది. రాత్రి వరకు నీటి మట్టం మరింత పెరిగే అవకాశముంది. గోదావరి పరివాహక ప్రాంతాలైన అన్నారం, మద్దులపల్లి, పల్గుల, కుంట్లం, పూసుకుపల్లి, కాళేశ్వరం, మెట్‌పల్లి గ్రామాల్లోపత్తి, మిర్చి, వరి పంటలు నీట మునిగాయి. రెవెన్యూ, పోలీస్ అధికారులు లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement