మేనల్లుడికి పోటీ‘యేలేరు’!
ఏలేరు కాలువ పనుల్లో అవినీతి ప్రవాహం
ప్రభుత్వ పెద్ద మేనల్లుడి కళ్లలో ఆనందమే లక్ష్యం
అందుకోసం ఐదు ముక్కలుగా పనుల విభజన
తెర వెనుక మంత్రాంగం నెరుపుతున్న జీవీఎంసీ అధికారి
రూ.3 కోట్ల ఈ పనులకు పోటీ రావద్దని కాంట్రాక్టర్లకు హుకుం
ఏలేరు కాలువ నిర్వహణ.. ఈ పనులను ఎప్పటినుంచో రెండు భాగాలు (ప్యాకేజీలు)గా విభజించి కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్నారు. అయితే ఈ ఏడాది దాన్ని మూడు ముక్కలు చేశారు... అంతేనా వచ్చే ఏడాదికి ఐదు ముక్కలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి..
ఇలా ముక్కలు చేయడం వెనుక మతలబేంటంటే.. నగరానికి చెందిన ఓ ప్రభుత్వ పెద్ద మేనల్లుడికి మేలు చేయడమే! ఇప్పటికే రూ.కోటి విలువైన పనులను ‘గిఫ్ట్’గా కొట్టేసిన ఆయనగారికి మరింత పెద్ద మొత్తం మేలు చేయడమే ఈ మంత్రాంగం లక్ష్యం.
విశాఖపట్నం: ఏలేరు కాలువ నిర్వహణ పనుల్లో ఓ ప్యాకేజీని ప్రభుత్వ పెద్ద మేనల్లుడికి గిఫ్ట్‌గా ఇచ్చేసిన అధికారులు.. తాజాగా అదనపు మేలు చేకూర్చే ప్రయత్నాల్లో పడ్డారు. ఈ పనులను ఎన్నో ఏళ్ల నుంచి రెండు ప్యాకేజీల కింద చేస్తూ వచ్చారు. రూ.2.50 కోట్ల విలువైన ఈ పనులపై ప్రభుత్వ పెద్ద మేనల్లుడి కన్ను పడింది. అయితే చిన్న కాంట్రాక్టరైన ఆయనకు పెద్ద పనులు చేసే అర్హత లేదు. కానీ ‘మేనల్లుడి’ కళ్లలో ఆనందం కోసం ప్రభుత్వ పెద్ద జీవీఎంసీ ఉన్నతాధికారులతో మంతనాలు జరిపి ‘దిశా నిర్దేశం’ చేశారు. అంతే కాలువ నిర్వహణ పనులను రెండు ప్యాకేజీల నుంచి మూడు ప్యాకేజీలుగా ముక్కలు చేసేశారు. వాటిలో ఒక ప్యాకేజీని ‘మేనల్లుడి’కి ఏకపక్షంగా కట్టబెట్టేశారు. ఆ పనులను ఏడాదిగా ఎంజాయ్ చేస్తున్నప్పటికీ మేనల్లుడు సంతృప్తి చెందలేదు. పైగా ఈ డిసెంబర్ 31తో కాంట్రాక్టు గడువు ముగుస్తుండటంతో మళ్లీ టెండర్లు పిలవాలి. ఇదే అదనుగా మరింత విలువైన పనులను ఏకపక్షంగా దక్కించుకోవాలని భావించారు.
పోటీకి రావద్దు
ఈసారి ఏలేరు కాలువ నిర్వహణ పనుల విలువ రూ.3 కోట్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. పనిలో పనిగా ప్రభుత్వ పెద్ద మేనల్లుడికి గరిష్ట ప్రయోజనం కలిగేలా మూడు ప్యాకేజీలుగా ఉన్న పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించాలని నిర్ణయించారు. మొత్తం పనులను ఇద్దరు కాంట్రాక్టర్లకే ధారదత్తం చేయాలని నిర్ణయించారు. అలా చేస్తేనే ప్రభుత్వ పెద్ద సమీప బంధువుకు రూ.కోటిన్నర కాంట్రాక్టు కట్టబెట్టవచ్చన్నది పన్నాగం. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం జీవీఎంసీ అధికారి ఒకరు కాంట్రాక్టర్లతో అనధికారికంగా ఓ సమావేశం నిర్వహించారు. ఏలేరు కాలువ నిర్వహణ టెండర్లు త్వరలో పిలవనున్న విషయాన్ని వెల్లడిస్తూనే.. వాటి కోసం ఎవరూ టెండర్లు వేయరాదని తేల్చి చెప్పేశారు. ఆ కాంట్రాక్టు తన మేనల్లుడికి వదిలేయాలని ప్రభుత్వ పెద్ద చెప్పారని కూడా వివరించారు. దీనిపై ఒకరిద్దరు కాంట్రాక్టర్లు అభ్యంతరం తెలిపారు. కానీ వారికి ఇతరత్రా కాంట్రాక్టుల్లో సర్దుబాటు చేస్తామని ఏలేరు పనుల జోలికి మాత్రం రావద్దని దాదాపు హుకుం జారీ చేశారు. దాంతో చేసేదేమి లేక వారు సమావేశం నుంచి నిష్ర్కమించారు. కొసమెరుపు ఏమిటంటే.. తన కోసం ఇంత చేసిన సదరు అధికారికి ఆ ‘మేనల్లుడు’ ఖరీదైన వాహనాన్ని కానుకగా ఇచ్చి ఖుషీ చేశారుట... అదీ సంగతి!