ఇద్దరు బాలికలపై లైంగిక దాడి | Two girls molested in Nellore district | Sakshi
Sakshi News home page

ఇద్దరు బాలికలపై లైంగిక దాడి

Published Sun, Oct 14 2018 12:18 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM

Two girls molested in Nellore district - Sakshi

నెల్లూరు (వేదాయపాళెం): అభం శుభం తెలియని ఇద్దరు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడికి స్థానికులు దేహశుద్ధి చేసి నెల్లూరు రూరల్‌ పోలీసులకు అప్పగించిన ఘటన శనివారం రాత్రి  మండలంలోని కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డులో జరిగింది. స్థానికులు, నెల్లూరురూరల్‌ సీఐ పి.శ్రీనివాసరెడ్డి కథనం మేరకు.. గూడూరు మసీదువీధికి చెందిన సయ్యద్‌హాసిన్‌బాషా ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నాడు. భార్యతో తరచూ గొడవ పడుతుండడంతో  ఆమె అతన్ని వదిలి పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత మూడేళ్ల క్రితం కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీకి జీవనోపాధి నిమిత్తం వచ్చాడు. 

కొంతకాలంగా నెల్లూరు నగరంలో ఓ ప్రాంతంలో ఉంటుండేవాడు. ఇటీవల మళ్లీ కల్లూరుపల్లి హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఎల్‌ఐజీ 2లో 169వ ప్లాట్లో అద్దెకు ఉంటున్నాడు. ప్లాటు పక్కనే ఉన్న రెండు ప్లాట్లకు చెందిన బాలికలతో సన్నిహితంగా ఉండేవాడు. మూడో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలిక, నాల్గో తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలికలకు తరచూ డబ్బులు, స్వీట్లు ఇచ్చి ఇంటికి పిలిపించుకునేవాడు. ముస్లిం పండగలు వచ్చిన సందర్భంగా ప్రత్యేకంగా వీరికి డబ్బులు, తినుబండారాలు ఇస్తుండేవాడు. 

ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీ ఇద్దరు బాలికలు ఆటలాడుకుంటుండగా ఇంటిలోకి పిలిచి నోట్లో గుడ్డలు కుక్కి దుస్తులు విప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికలు మరుసటి రోజు జరిగిన విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పారు. అప్పటి నుంచి హాసిన్‌బాషా ఇంట్లో కనిపించలేదు. శనివారం సాయంత్రం హాసిన్‌బాషా ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని బాలికల తల్లిదండ్రులు, స్థానికులు అక్కడికి చేరుకుని అతడిని తాళ్లతో కట్టివేసి దేహశుద్ధి చేశారు. నెల్లూరురూరల్‌ పోలీసులకు ఇతడిని అప్పగించారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఇతడిపై ఫోక్సా చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికలకు ఆదివారం నెల్లూరు ప్రభుత్వాస్పపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement