
ఇంటి గోడ బలిపీఠమైంది
భీమవరం క్రైం :నిద్రలోనే తమ పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గోడ రూపంలో తమ పిల్లలను బలిగొనడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వారు ఇక లేరనే విషయాన్ని తట్టుకోలేక ఏమి చేయాలో తెలియక అయోమయస్థితిలో ఉండిపోయారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారికి ఈ ఘటన కడుపుకోత మిగల్చడంతో వారు రోదిస్తుండటంతో ఆ ప్రాంతవాసులను కలచివేసింది. తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చింతాడ లచ్చన్న, మంగమ్మలది భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామం.
అయితే పొట్టకూటికోసం వారు కొంత కాలం హైదరాబాద్ వెళ్లి అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవారు. అక్కడ కూడా సరైన పనులు లేక నెల క్రితం చినఅమిరం వచ్చి అల్లం సుబ్బలక్ష్మికి చెందిన నివాసంలో అద్దెకు దిగారు. ఇళ్ల నిర్మాణ పనులను చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం వంట చేద్దామని తల్లి మంగమ్మ ఆరు బయటకు వచ్చింది. లచ్చన్న కూడా ఇంటి బయటకు వచ్చా డు. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న కుమార్తె ఎస్తేరు (5), కుమారుడు సోమేష్ (3)లపై సిమెంట్ ఇటుకలతో కట్టిన గోడ పెద్ద శబ్ధంతో కూలిపోయింది. చిన్నారులకు తీవ్ర రక్తస్రావమవడంతో 108లో భీమవరం ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
నా బిడ్డలను బతికించండి..
తన బిడ్డలను బతికించండంటూ ప్రభుత్వాసుపత్రి వైద్యులను లచ్చన్న, మంగమ్మలు వేడుకుంటున్న తీరు అక్కడి వారిని కలచివేసింది. ఉన్న ఇద్దరు బిడ్డలు మృత్యువాతపడటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వారు రోదిస్తున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. భీమవరం టూటౌన్ సీఐ జయసూర్య, ఎస్సై శ్రీనివాసకుమార్ ఆసుపత్రికి వెళ్లి బాధితుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం రెవెన్యూ అధికారులతో సంఘటనపై మాట్లాడారు. వారికి ప్రభుత్వపరంగా ఏమైనా సహకారం అందించాలని కోరారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జయసూర్య తెలిపారు. కాగా సంఘటనా ప్రాంతాన్ని భీమవరం ఇన్‌చార్జి తహసిల్దార్ దశిక వంశీ పరిశీలించారు. ప్రభుత్వాసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించారు. దీనిపై కలెక్టర్‌కు నివేదిస్తామని చెప్పారు.