క్రాంతి, సాక్షిప్రతినిధి, నల్లగొండ: దివాళా తీసిన దుకాణం లెక్కున్న పార్టీ ఆఫీసు ముందల ఇద్దరు తెలుగుతమ్ముళ్లు దిగాలుగా కూసుండ్రు. ఎట్లున్న రోజులుఎట్లయిపాయేరా భగవంతుడా అని ఒకర్నొకరు ఓదార్సుకుంటుండ్రు. పార్టీ పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే కడుపుల కట్టెపెట్టి కెలికనట్టు అయితాందని ఇదై పోతాండ్రు. ఒకప్పటి రోజుల్ని జ్ఞాపకం జేసుకుంటుండ్రు..
ఎవడ్రా పార్టీని ఇట్ట నాశనం చేసినోడని ఉడికి పోతుండ్రు. మాధవరెడ్డి పోయిండు.. మారాజులు పోయిండ్రు.. మాయగాళ్లు వచ్చిండ్రని గుర్రుగున్నరు. కమ్యూనిస్టులతోని దోస్తితో జిల్లాల పచ్చజెండా రెపరెపలాడిన రోజుల గురించి.. జేబులు నింపుకునే సొంత పార్టీ నాయకుల తీరు గురించి.. ఏమీ పట్టించుకోక.. ఆగమాగం చేసిన నాయకుడి గురించి.. ముచ్చట్ల పడ్డరు.
అసలు కొంపంతా ముంచింది మన ‘నాయకుడే’రా.. అని ఓ తమ్ముడు అక్కసంతా వెళ్లగక్కిండు. అవ్ అంటూ మరో తమ్ముడు తలూపిండు. ‘‘తెలంగాణ విషయంలాగ రెండు కళ్ల తిరకాసేంది. ఒకతాన ఒకమాట చెప్పుడు... మరోకాడ మాట మార్సుడేంది. చివరికేమైంది.. ఎటూ గాకుంట అయితిమి. తెలంగాణ కోసం కొట్లాడినం అన్నా నమ్మేటోడు లేకుంటాయే. ఇగిప్పుడు జనంలకు పోయెదెట్టా.. బయట పడేదెట్టా. పరిస్థితి ఇట్లుంటే ఒక్క సీటన్న గెలుస్తమా..? గీ సంగతి పార్టీల ఎవనికైనా తలెక్కుతుందా..?’’ అని ఓ తమ్ముడు ఉడికిపోయిండు. కార్యకర్తల గురించి పట్టించుకునేటోడే లేడు. ఎవని గోల వానిది.. ఎవడి పదవి కోసం వాడిదే ఆరాటం. గుంపుల లొల్లితో కొట్టుక చస్తుండ్రు. చేజేతాల పార్టీని నాశనం చేసిండ్రు గదరా భయ్ అని రెండో తమ్ముడు సమర్దించిండు.
ఇద్దరు తమ్ముళ్లకు జరుగుతున్న సంగతులు ఒక్కొక్కటే కళ్ల ముందుకదలాడుతున్నయ్. ‘కమలం’తో దోస్తి అంటూ చక్కర కొడుతున్న ముచ్చట్లు గుర్తుకు తెచ్చుకుండ్రు. వామపక్షాలతోని దోస్తానాను మూసీల కలిపిండ్రు. ఇగిప్పుడు కమలం వెంట పడతుండ్రు.
అయినా, జిల్లాల బీజేపోల్లతో దోస్తానా చేస్తే ఏం కలిసొస్తది. అయిదేళ్ల కాడ్నుంచి ఎట్లనో గట్ల పార్టీ కోసం పైసలు బెట్టినోళ్ల నోట్ల మన్నుగొడతరా ఏంది..? పార్టీల లొల్లితోనే .. షానాల్ల దాకా నియోజకవర్గాలల్ల ఎవరికీ ఇన్‌చార్జి పదవులియ్యలే. మొన్నమొన్ననే తీరా.. మల్లయ్య ఓ తానా.. పుల్లయ్య ఓ తానా అని లెక్క తేల్చిండ్రు. ఇగ పోటీ చేసుడే తరువాయి అనుకుని చ ంకలు గుద్దుకుని గోడల మీద రాతలు.. బ్యానర్లు.. ఫ్లెక్సీలు.. ఇంటింటికీ తెలుగుదేశం అని ఊరూరా డప్పుకొట్టుకుంట తిరిగినోని పనేం గావాలే.. అని మదన పడిపోయారు. టీడీపీ.. బీజేపీల దోస్తి పట్టాలెక్కిందో...! ఇగ మనోళ్ల పనైనట్టే.. ఇప్పుడున్న మూడు సీట్లల్ల ఒక్కటన్నా బయట పడతామా అని భయపడ్డరు.
‘‘అసలు పార్టీల ఏమైతుందో చంద్రన్నకు ఏమన్నా తెలుస్తుందా. సూస్తుండంగనే .. అయిదేళ్ల పొద్దు గిర్రున తిరిగిపోయే..పోయిన ఎలచ్చన్ల ఓట్లేసినోళ్లకు.. ఏం జేయలేక పోతిమి. ఇగిప్పుడు ఏం మొఖం పెట్టుకుని జనాల కాడికి పోవాలే.. ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలకు.. రెండు గుంపులు. ఒకడు నిచ్చెనెక్కిటోడు.. కాలుపట్టి కిందికి గుంజే టోడు మరోడు. ఇగ పార్టీ ముందల పడేదెట్టరా..? కచ్చపట్టిన ట్టు పార్టీలో రచ్చ రచ్చ చేసి.. గెల్చుడు కష్టమని పెద్దల సభకు పోటీ పడిరి. అంటేంది. గీ ఎలచ్చన్న గెలవమనే కదా..? పదవులు ఎలగబెట్టినోడే పారిపోబడితే.. ఇగ పార్టీకి అండగ నిలబడేటోడు ఎవరు...’’ అనుకుంటు పార్టీ ఆఫీసుకల్ల బిక్క మొఖం పెట్టుకుని చూసిండ్రు. పాత రోజులు మళ్లేం వస్తయ్.. ఇక పార్టీ పనై పోయింద ని గునుక్కుంట ఇళ్ల దారి పట్టిండ్రు.
పనై.. పోయింది..
Published Sun, Feb 9 2014 3:31 AM | Last Updated on Fri, Mar 22 2019 6:24 PM
Advertisement
Advertisement